నా అల్లుడు బంగారం.. రూపాయితో సరిపెట్టుకున్నాడు: నీరజ్‌పై మామ ప్రశంసలు

నా అల్లుడు బంగారం.. రూపాయితో సరిపెట్టుకున్నాడు: నీరజ్‌పై మామ ప్రశంసలు

ఒలింపిక్ విజేత, భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా ఇటీవల వివాహ బంధంలోకి అడుగుపెట్టాడు. టెన్నిస్ ప్లేయ‌ర్ హిమాని మోర్‌(Himani) అనే వధువును మనువాడాడు. జనవరి 14 నుండి 16 వరకు మూడు రోజుల పాటు హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌లోని కుమ‌ర‌ట్టి ప్రాంతంలో ఉన్న ఓ రిసార్ట్‌లో వీరి వివాహం జరిగింది. ఇరు కుటుంబాలకు చెందిన  65 నుంచి 70 మంది మాత్రమే ఈ పెళ్లికి హాజరయ్యారు.

లవ్.. అరేంజ్డ్ మ్యారేజ్

మొదట వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించినప్పటికీ, పెద్ద‌ల అంగీకారంతోనే ఆ బంధాన్ని మరో మెట్టు ఎక్కించారు. వివాహానికి ముందు హిమానీ.. తనకు కాబోయే వరుడు నీరజ్ చోప్రా గ్రామాన్ని సందర్శించారు. వివాహానికి ముందు జరిగే ఆచారాలలో భాగంగా 14 గంటల పాటు అక్కడే ఉన్నారు. ఇవన్నీ బాగానే ఉన్నప్పటికీ.. తన అల్లుడు కట్నం తీసుకోకుండా పెళ్లి చేసుకున్నారని అతని మామ, వధువు తండ్రి ఒలింపిక్ విజేతపై ప్రశంసలు కురిపించారు. 

రూపాయి మాత్రమే..

తన కుమార్తె హిమానిని పెళ్లి చేసుకోవ‌డానికి నీర‌జ్ ఎలాంటి కట్న కానుకలు తీసుకోలేదని ఆమె తండ్రి ఓ మీడియా సంస్థ‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో తెలిపారు. షాగున్(ఆశీర్వాదం) రూపంలో కేవ‌లం రూపాయి మాత్ర‌మే తీసుకున్న‌ట్లు వెల్లడించారు. పుట్టింటి త‌ర‌ఫు నుంచి వ‌చ్చే దుస్తులు, బంగారంతో పాటు ఇత‌ర వ‌స్తువుల్ని నీర‌జ్ వ‌ద్ద‌న్నాడ‌ట‌. నీరజ్ మనసు ఎంత మంచిదో.. అతని తల్లిదండ్రులు అటువంటి వారేనని ఆయన అన్నారు. తమ బిడ్డను కోడలిలా కాకుండా.. కూతురిలా ఆదరించారని ప్రశంసించారు. ఓ తండ్రిగా తాను కోరుకుంది ఇదేనని చెప్పుకొచ్చారు.

రెండు ఒలింపిక్స్‌ ప‌త‌కాలు

2021 టోక్నో ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడ‌ల్ సాధించిన  నీర‌జ్ చోప్రా.. గ‌తేడాది జ‌రిగిన పారిస్ ఒలింపిక్స్‌లో ర‌జ‌త ప‌త‌కం సాధించాడు.

ALSO READ | నీరజ్ చోప్రా పెళ్లి చేసుకున్నది ఎవరిని అంటే.?