
పారిస్: టోక్యో ఒలింపిక్స్ గోల్డ్ మెడలిస్ట్ నీరజ్ చోప్రా.. పారిస్‌లోనూ అదే ఫలితాన్ని పునరావృతం చేస్తాడా? గేమ్స్ మొదలయ్యి 13 రోజులు గడిచినా ఇంకా బంగారు, రజత పతకాలు సాధించలేకపోతున్న ఇండియాకు స్వర్ణ కాంతులు అందిస్తాడా? ప్రస్తుతం సగటు అభిమాని మదిలో మెదులుతున్న ప్రశ్నలివి. ఈ నేపథ్యంలో మంగళవారం మెన్స్ జావెలిన్ త్రో క్వాలిఫికేషన్ పోటీలు జరగనున్నాయి. ఫుల్ ప్రాక్టీస్, అంతకుమించిన ఫామ్‌తో ఉన్న నీరజ్ జావెలిన్‌లో మరోసారి సత్తా చాటేందుకు సిద్ధమయ్యాడు. డిఫెండింగ్ చాంపియన్ హోదాతో పాటు పారిస్ గడ్డపై కొత్త రికార్డులను క్రియేట్ చేసేందుకు రెడీగా ఉన్నాడు. ఈ గేమ్స్‌లో నీరజ్ గోల్డ్ మెడల్ గెలిస్తే.. టైటిల్‌ను నిలబెట్టుకున్న ఐదో ఒలింపియన్, తొలి ఇండియన్‌గా రికార్డులకెక్కుతాడు.
ఈ ఏడాది నీరజ్ కేవలం మూడు ఈవెంట్లలోనే బరిలోకి దిగినా ప్రపంచ చూపు మొత్తం అతనిపైనే ఉంది. పారిస్ డైమండ్ లీగ్‌లో బరిలోకి దిగకపోవడంతో అతని ఫిట్‌నెస్‌పై చాలా అనుమానాలు నెలకొన్నా.. అవేవి సరైనవి కావని నీరజ్ కోచ్ కొట్టి పారేశాడు. టోక్యో ఒలింపిక్స్ తర్వాత నీరజ్ పాల్గొన్న 15 టోర్నీల్లో అతను నిలకడగా 85 మీటర్ల మార్క్ అందుకున్నాడు. కాబట్టి ఈ గేమ్స్‌లోనూ అతనే ఫేవరెట్‌గా దిగనున్నాడు. అయితే జాకబ్ వెడ్లెచ్ (చెక్), జులియన్ వెబర్ (జర్మనీ), అండర్సన్ పీటర్స్ (గ్రెనెడా) నుంచి గట్టి పోటీ ఎదురుకానుంది. ఇండియా నుంచి కిశోర్ జెనా కూడా ఈ పోటీల్లో అదృష్టాన్నీ పరీక్షించుకోనున్నాడు