న్యూఢిల్లీ : ఇండియా స్టార్ అథ్లెట్, వరుసగా రెండు ఒలింపిక్స్‌లో గోల్డ్, సిల్వర్‌తో చరిత్ర సృష్టించిన నీరజ్ చోప్రా మరో ఘనత సాధించాడు. 2024 ఏడాదికి గాను ప్రపంచంలోనే బెస్ట్ జావెలిన్ త్రోయర్ గా (పురుషుల్లో) నీరజ్‌ను అమెరికాకు చెందిన ప్రఖ్యాత మేగజైన్ ‘ట్రాక్ అండ్ ఫీల్డ్ న్యూస్’ ఎంపిక చేసింది. 27 ఏండ్ల నీరజ్ పారిస్ ఒలింపిక్స్‌లో సిల్వర్ నెగ్గగా.. పాకిస్తాన్‌కు చెందిన అర్షద్ నదీమ్ గోల్డ్ అందుకున్నాడు.
రెండుసార్లు వరల్డ్ చాంపియన్, గ్రెనెడాకు చెందిన అండర్సన్ పీటర్సన్‌ను వెనక్కు నెట్టిన నీరజ్ ఈ మేగజైన్ జాబితాలో అగ్రస్థానం అందుకున్నాడు. 2024లో ఒలింపిక్స్ కాకుండా మరొక్క ఈవెంట్‌లో ఆడిన నేపథ్యంలో నదీమ్‌కు ఐదో ర్యాంక్ లభించింది. ‘ట్రాక్ అండ్ ఫీల్డ్ న్యూస్’ మేగజైన్ ప్రకటించిన 2023 ర్యాంకింగ్స్‌లోనూ నీరజ్ అగ్రస్థానం సాధించాడు.