Paris Olympics 2024: నా బిడ్డకు గాయమైంది.. సిల్వర్ మెడల్ మాకు గోల్డ్‌తో సమానం: నీరజ్ చోప్రా తల్లి

Paris Olympics 2024: నా బిడ్డకు గాయమైంది.. సిల్వర్ మెడల్ మాకు గోల్డ్‌తో సమానం: నీరజ్ చోప్రా తల్లి

పారిస్ ఒలింపిక్స్ లో నీరజ్ చోప్రా మరోసారి మెరిశాడు. వరుసగా రెండోసారి జావెలిన్‌ త్రో లో దేశానికి పతకం అందించాడు. టోక్యో 2020 ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకం సాధించిన 26 ఏళ్ల నీరజ్‌.. పారిస్‌లో మాత్రం రజత పతకంతో సరిపెట్టుకున్నాడు. ఇది మాత్రం అతనికి కొంచెం నిరాశను కలిగిస్తుంది. పాకిస్థాన్ ఆటగాడు అర్షద్ నదీమ్ చేతిలో ఓడిపోయి రెండో స్థానంతో సరిపెట్టుకున్నాడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో అభిమానులు అతనికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. తాజాగా అతని విజయంపై నీరజ్ తల్లి స్పందించారు.

"పురుషుల జావెలిన్ త్రోలో నీరజ్ చోప్రా రజత పతకాన్ని గెలుచుకోవడంపై అతని తల్లి సరోజ్ దేవి ఇలా చెప్పింది. "మేము చాలా సంతోషంగా ఉన్నాము. నీరజ్ గెలిచిన వెండి మాకు బంగారంతో సమానం. అతను గాయపడ్డాడు. అయినా అతని ప్రదర్శనతో సంతోషంగా ఉన్నాము. నదీమ్ స్వర్ణం గెలుచుకున్నందుకు సంతోషంగా ఉంది. అతనికి నా శుభాకాంక్షలు. అథ్లెట్లందరూ తన సొంత పిల్లలు లాంటివారు. నీరజ్ ఇంటికి తిరిగి రాగానే అతనికి ఇష్టమైన ఆహారాన్ని వండుతాను". అని నీరజ్ చోప్రా తల్లి అన్నారు. 

నీరజ్ చోప్రా రజత పతకాన్ని గెలుచుకున్న తర్వాత తన తండ్రి సతీష్ కుమార్ తన కొడుకు విజయం పట్ల సంతోషం వ్యక్తం చేశారు.   "ప్రతి ఒక్కరికీ వారి రోజు ఉంటుంది. ఈ రోజు పాకిస్తాన్ రోజు. కానీ మేము రజతం సాధించాము. ఇది మాకు గర్వకారణం" అని చెప్పుకొచ్చారు. గురువారం (ఆగస్ట్) అర్ధ రాత్రి   జరిగిన ఫైనల్లో అర్షద్ ఏకంగా 92.97 మీటర్లు జావెలిన్‌ విసరగా.. నీరజ్‌ చోప్రా రెండో ప్రయత్నంలో అత్యధికంగా 89.45 మీటర్ల దూరం విసిరాడు.