ధన్వాడ, వెలుగు: భార్యను చంపిన కేసులో మండలకేంద్రానికి చెందిన నీరటి కృష్ణయ్యకు యావజ్జీవ కారాగార శిక్షతో పాటు రూ.10 వేల జరిమానా విధిస్తూ నారాయణపేట జిల్లా సెషన్స్ జడ్జి ఎంఏ రఫి మంగళవారం తీర్పునిచ్చారు. వివరాలిలా ఉన్నాయ.. ధన్వాడకు చెందిన నీరటి కృష్ణయ్యకు చిన్న చింతకుంట మండలం ఉంద్యాల గ్రామానికి చెందిన సుశీలతో 30 ఏండ్ల కింద వివాహం జరిగింది. వీరికి సంతానం లేకపోవడంతో శివ అనే అబ్బాయిని దత్తత తీసుకున్నారు. మద్యానికి బానిసైన కృష్ణయ్య తరచూ భార్యతో డబ్బుల కోసం గొడవ పడేవాడు.
2021 జూన్ 8న భార్యతో గొడవపడి కొట్టడంతో చనిపోయింది. సుశీల తండ్రి కురుమూర్తి ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది.నేరం రుజువు కావడంతో ఈ మేరకు శిక్ష విధించినట్లు ఎస్ఐ రమేశ్ తెలిపారు. అప్పటి ఎస్ఐ ఎం రాజేందర్, సీఐ టి శివకుమార్ లతో పాటు ప్రస్తుత సీఐ శ్రీకాంత్ రెడ్డి, ఎస్ఐ రమేశ్, అడిషనల్ పీపీ మురళీకృష్ణ, ఏఎస్ఐ బాలకృష్ణ, కోర్ట్ డ్యూటీ ఆఫీసర్ అరవింద్ ను ఎస్పీ ఎన్ వెంకటేశ్వర్లు అభినందించారు.