
- కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్
సూర్యాపేట, వెలుగు : జిల్లాలో నీట్ ప్రవేశ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో నీట్ యూజీ –2025 పరీక్ష నిర్వహణపై జిల్లాస్థాయి సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మే 4వ మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నీట్పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
జిల్లాలోని మోడల్ స్కూల్ ఇమాంపేట్ సూర్యాపేట, టీజీఎస్ డబ్ల్యూఆర్ గర్ల్స్ జూనియర్ కాలేజ్ ఇమాంపేట, తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్, జూనియర్ కాలేజ్ దూరజ్ పల్లి, గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ సూర్యాపేటలో నీట్ పరీక్షలు నిర్వహిస్తామన్నారు. ఈ పరీక్షలకు మొత్తం 890 మంది విద్యార్థులు హాజరవుతారని తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద జామర్లను ఏర్పాటు చేయడంతోపాటు విద్యార్థుల బయోమెట్రిక్ తీసుకోనున్నట్లు చెప్పారు. ఎస్పీ నరసింహ, డీఎస్పీ పార్థసారధి, డీఈవో అశోక్ కుమార్, అధికారులు పాల్గొన్నారు.