నీట్ పేపర్ లీక్ కాలేదు.. ఎగ్జామ్​లో ఎలాంటి అక్రమాలు జరగలేదు: ఎన్టీఏ డీజీ సుబోధ్

నీట్ పేపర్ లీక్ కాలేదు..  ఎగ్జామ్​లో ఎలాంటి అక్రమాలు జరగలేదు: ఎన్టీఏ డీజీ సుబోధ్

న్యూఢిల్లీ: వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్)లో అవకతవకలు జరిగాయంటూ ఆరోపణలు రావడంతో కేంద్ర విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. దీనిపై విచారణ చేపట్టేందుకు యూపీఎస్సీ మాజీ చైర్మన్ నేతృత్వంలో నలుగురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేసింది. ఈ మేరకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) డైరెక్టర్ జనరల్ సుబోధ్ కుమార్ సింగ్ తెలిపారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడారు. ‘‘1,500 మందికి పైగా విద్యార్థులకు కలిపిన గ్రేస్ మార్కులను కమిటీ సమీక్షిస్తుంది. ఆ కమిటీ వారం రోజుల్లో రిపోర్టు అందజేస్తుంది. అనంతరం ఆ విద్యార్థుల మార్కులను సవరించే అవకాశం ఉంటుంది” అని చెప్పారు. కొంతమంది విద్యార్థులకు గ్రేస్ మార్కులు ఇవ్వడం వల్ల అర్హతా ప్రమాణాలపై ఎలాంటి ప్రభావం పడలేదని, ఇప్పుడు ఆ విద్యార్థుల ఫలితాలను సమీక్షించడం ద్వారా అడ్మిషన్ ప్రక్రియపైనా ఎలాంటి ఎఫెక్ట్ ఉండదని పేర్కొన్నారు. 

గ్రేస్ మార్కులు కలిపిన స్టూడెంట్లకు మళ్లీ ఎగ్జామ్ నిర్వహిస్తారా? అని ప్రశ్నించగా.. కమిటీ సిఫార్సులను బట్టి నిర్ణయం తీసుకుంటామన్నారు. ‘‘నీట్ ఎగ్జామ్ లో ఎలాంటి అవకతవకలు, అక్రమాలు జరగలేదు. పేపర్ లీక్ కాలేదు. కొన్ని ఎగ్జామ్ సెంటర్లలో టైమ్ కోల్పోయిన కొంతమంది స్టూడెంట్లకు గ్రేస్ మార్కులు కలపడం వల్లే వాళ్లకు ఎక్కువ మార్కులు వచ్చాయి. 6 ఎగ్జామ్ సెంటర్లలో విద్యార్థులకు తప్పుడు ప్రశ్నపత్రాలు ఇచ్చారు. దీనివల్ల టైమ్ వేస్ట్ అయింది. ఆ స్టూడెంట్లకు రూల్స్ ప్రకారం గ్రేస్ మార్కులు కలిపాం” అని సుబోధ్ కుమార్ వివరించారు. కాగా, నీట్ ఫలితాల్లో 67 మందికి ఫస్ట్ ర్యాంక్ రావడం, వారిలో ఆరుగురు విద్యార్థులు ఒకే సెంటర్ నుంచి ఉండడంతో ఎగ్జామ్ లో అక్రమాలు జరిగాయంటూ ఆరోపణలు వెల్లువెత్తాయి. 

ఎన్టీఏ వివరణ ఇది.. 

    ఎన్టీఏ ఈసారి ముందుగానే నీట్ ఫలితాలను విడుదల చేసింది. జూన్ 14న విడుదల చేస్తామని చెప్పిన ఎన్టీఏ.. జూన్ 4నే రిజల్ట్ ఇచ్చింది. దీనిపై ఎన్టీఏ స్పందిస్తూ.. ‘‘జూన్ 4 నాటికి రిజల్ట్ రెడీ అయ్యాయి. అందుకే ఇంకో 10 రోజులు ఆగడం ఎందుకని రిలీజ్ చేశాం. ప్రతిఏటా వీలైనంత తొందరగా రిజల్ట్ విడుదల చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం” అని తెలిపింది. ఇక ఎగ్జామ్ లో క్యాండిడేట్ల పెర్ఫామెన్స్ ను బట్టి కట్ ఆఫ్ మార్కుల నిర్ధారణ ఉంటుందని చెప్పింది. 
    కొన్ని ఎగ్జామ్ సెంటర్లలో విద్యార్థులకు తప్పుడు క్వశ్చన్ పేపర్ ఇవ్వడంతో వాళ్లు కొంత టైమ్ కోల్పోయారు. దీనికి గాను ఆ విద్యార్థులకు గ్రేస్ మార్కులు కలిపారు. దీనిపై ఎన్టీఏ స్పందిస్తూ.. ‘‘మే 5న దేశవ్యాప్తంగా 4,750 సెంటర్లలో నీట్ ఎగ్జామ్ నిర్వహించాం. అయితే ఆరు సెంటర్లలో విద్యార్థులకు తప్పుడు ప్రశ్నపత్రాలు ఇవ్వడంతో సమస్య తలెత్తింది. మేఘాలయా, హర్యానా, చత్తీస్ గఢ్, గుజరాత్, చండీగఢ్ లో ఇలా జరిగింది. ఆ విద్యార్థులు తమకు ఎగ్జామ్ లో ఫుల్ టైమ్ ఇవ్వలేదంటూ కోర్టుకు వెళ్లారు. దీనిపై గ్రీవెన్స్ రీడ్రెస్సల్ కమిటీ ఏర్పాటు చేశాం. ఆ కమిటీ సిఫార్సుల మేరకు బాధిత విద్యార్థులకు గ్రేస్ మార్కులు కలిపాం” అని తెలిపింది.