నీట్​ ఎగ్జామ్​రివైజ్డ్​ ఫలితాలు విడుదల

నీట్​ ఎగ్జామ్​రివైజ్డ్​ ఫలితాలు విడుదల
  •      ఈ సారి 17 మందికే టాప్​ ర్యాంక్​  
  •      సవరించిన స్కోర్​కార్డ్స్​రిలీజ్​ చేసిన ఎన్టీఏ


న్యూఢిల్లీ:  దేశవ్యాప్తంగా మెడికల్​ కాలేజీల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్​యూజీ– 2024 రివైజ్డ్ ఫలితాలు విడుదలయ్యాయి. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం.. సవరించిన ఫలితాలను నేషనల్​ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) గురువారం రిలీజ్​ చేసింది. ఫలితాలను ఎన్టీఏ అధికారిక వెబ్​సైట్ లో పొందుపర్చింది. ఫిజిక్స్​లోని ఒక ప్రశ్నకు సంబంధించి ఒక ఆప్షన్​ను ఆన్సర్​గా గుర్తించిన వారికి మాత్రమే మార్కు ఇవ్వాలని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. 

దీంతో తాజాగా విడుదల చేసిన స్కోర్‌‌‌‌కార్డ్ లో ఈ సర్దుబాటు కార‌‌‌‌ణంగా దాదాపు 4.2 లక్షల మంది విద్యార్థుల స్కోర్ మారింది. ఒక్కొక్కరూ ఐదు మార్కుల చొప్పున కోల్పోవాల్సి వచ్చింది.  టాప్‌‌‌‌ ర్యాంక్‌‌‌‌ సాధించిన వారి సంఖ్య 17కు తగ్గింది.  నీట్ యూజీ పరీక్షలో ప్రతి తప్పు సమాధానానికి 5 మార్కుల కోత ఉంటుంది.

ఆ ప్రశ్నకు ఆ ఆప్షన్​ పెట్టినోళ్లకే మార్కు.. 

ఫిజిక్స్​లోని ఒక ప్రశ్నకు ఎన్సీఈఆర్టీ 12 వ తరగతి పాత సిలబస్​ ప్రకారం ఆన్సర్​ చేసిన వారికి ఎన్టీఏ అదనపు మార్కులు కలిపింది. అయితే, సుప్రీంకోర్టులో నీట్‌‌‌‌ వ్యవహారంపై విచారణ సందర్భంగా ఫిజిక్స్‌‌‌‌ విభాగంలో 29వ ప్రశ్నకు ఒకటి మాత్రమే సరైన సమాధానం అయినప్పుడు.. రెండు ఆప్షన్స్​ ఎంచుకున్న విద్యార్థులకు ఎన్టీఏ అదనపు మార్కులు కలిపిందని ఓ పిటిషనర్‌‌‌‌  బెంచ్​ దృష్టికి తెచ్చారు. 

దీంతో నిపుణులతో కమిటీ వేసి, మరుసటి రోజు మధ్యాహ్నానికి ఆ ఫిజిక్స్​ ప్రశ్నకు సరైన ఆన్సర్​కు సంబంధించిన నివేదికను సమర్పించాలని ఐఐటీ ఢిల్లీని ఆదేశించింది. ఐఐటీ ఢిల్లీ నివేదిక ప్రకారం ఆ ప్రశ్నకు 4వ ఆప్షన్​ సరైన ఆన్సర్​గా కోర్టు తేల్చింది. ఆప్షన్​ 4ను ఆన్సర్​గా ఎంచుకున్నవారికే మార్కు ఇవ్వాలని, మిగతా వారి మార్కులను కట్ చేయాలని ఆదేశించింది.  అలాగే, పరీక్షను రద్దు చేసి, మళ్లీ నిర్వహించాలని దాఖలైన పలు పిటిషన్లు సుప్రీంకోర్టు కొట్టివేసింది.  

నీట్ పేపర్ లీక్​ కేసు.. చెరువులో 16 ఫోన్లు

నీట్​ ఎగ్జాం పేపర్​ లీక్​ కేసులో  కీలక నిందితుడు జార్ఖండ్​లోని ధన్​బాద్​కు చెందిన అవినాశ్​ అలియాస్​ బంటికి సంబంధించిన 16 ఫోన్లను ఓ చెరువులో నుంచి సీబీఐ స్వాధీనం చేసుకున్నది. అతడిని పాట్నా సీబీఐ కోర్టు ఎదుట బుధవారం హాజరుపర్చింది. విచారణ నిమిత్తం బంటిని జులై 30 వరకు కోర్టు సీబీఐ కస్టడీకి అప్పగించింది.