ఖైరతాబాద్, వెలుగు: నీట్ పరీక్షను రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని విద్యార్థి సంఘాల నేతలు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎన్ఎస్యూఐ తెలంగాణ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ నేతృత్వంలో పలు విద్యార్థి సంఘాల నేతలు సోమవారం ప్రెస్‌క్లబ్‌లో విలేకరుల సమావేశం నిర్వహించాయి. నీట్ క్వశ్చన్ పేపర్ల లీక్ కారణంగా 24 లక్షల మంది విద్యార్థుల జీవితాలు నాశనం అయ్యాయని వెంకట్ ఆందోళన వ్యక్తం చేశారు. కొందరు డబ్బుకు ఆశపడి పేపర్లను లీక్ చేశారని, దీనిపై సుప్రీంకోర్టు జడ్జితో విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.
ఏఐవైఎఫ్ నాయకుడు ధర్మేంద్ర యాదవ్ మాట్లాడుతూ, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్రమంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్ లీకేజీపై ఎందుకు మాట్లాడట్లేదని ప్రశ్నించారు. లీకేజీకి కారుకులైనోళ్లను శిక్షించాలని కోరారు. పీడీఎస్‌యూ ప్రతినిధి నాగేశ్వరరావు మాట్లాడుతూ, నీట్ పేపర్ల లీకేజీకి బాధ్యత వహించి ఆశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. నీట్ సమస్యల పరిష్కారం కోసం మంగళవారం అన్ని విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని హిమాయత్‌నగర్ నుంచి ట్యాంక్‌బండ్ వద్దనున్న అంబేద్కర్ విగ్రహందాకా స్టూడెంట్ మార్చ్ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.