నీట్​పై సిట్టింగ్ జడ్జితో విచారణ చేపట్టాలి : ఆర్. కృష్ణయ్య

నీట్​పై సిట్టింగ్ జడ్జితో విచారణ చేపట్టాలి :   ఆర్. కృష్ణయ్య

బషీర్ బాగ్, వెలుగు: నీట్ అవకతవకలపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలని రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. నీట్ అక్రమాలకు వ్యతిరేకంగా బర్కత్ పుర చౌరస్తా వద్ద బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ, బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు  గుజ్జ సత్యం, బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వేముల రామకృష్ణ ఆధ్వర్యంలో  నిరసన ర్యాలీ నిర్వహించారు. వందలాది మంది విద్యార్థులు ఈ ర్యాలీలో  పాల్గొన్నారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి, నీట్ చైర్మన్ లకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా కృష్ణయ్య మాట్లాడుతూ.. నీట్ ను రద్దుచేసి తిరిగి పరీక్ష నిర్వహించాలని.. అక్రమాలకు పాల్పడిన వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ప్రధాని మోదీ  నీట్ అక్రమాలపై స్పష్టమైన ప్రకటన చేయాలని కోరారు. నీట్ పరీక్షకు. వైద్య రంగానికి ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు ఉందని..అవకతవకల వల్ల భారత ప్రతిష్ట దిగజారిపోయిందని కృష్ణయ్య ఆవేదన వ్యక్తం చేశారు.