- సుప్రీంకోర్టుకు కేంద్రం వెల్లడి
- ఆ అభ్యర్థులకు మళ్లీ 23న ఎగ్జామ్ పెట్టి 30న రిజల్ట్స్ ప్రకటిస్తం
- కమిటీ సూచన మేరకే నిర్ణయం తీసుకున్నామని వివరణ
- పేపర్ లీక్ కాలేదని కేంద్రం ప్రకటన
న్యూఢిల్లీ: మెడికల్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్ట్(నీట్) యూజీ ఫలితాల్లో 1,563 మంది అభ్యర్థులకు ఇచ్చిన గ్రేస్ మార్కులను తొలగిస్తామని సుప్రీం కోర్టుకు కేంద్ర ప్రభుత్వం తెలియజేసింది. వీళ్లందరికీ మళ్లీ ఈ నెల 23న ఎగ్జామ్ నిర్వహించి.. 30వ తేదీన ఫలితాలు వెల్లడిస్తామని చెప్పింది. క్వశ్చన్ పేపర్లో ప్రశ్నలు తప్పుగా వచ్చినందుకు 1,563 మంది అభ్యర్థులకు గ్రేస్ మార్కులు కలిపామని వివరణ ఇచ్చింది. ఎవరైనా ఎగ్జామ్‌కు అటెండ్ కావొద్దనుకుంటే.. వారికి వచ్చిన మొత్తం మార్కుల్లోంచి గ్రేస్ మార్క్స్ తీసేసి లెక్కిస్తామని చెప్పింది. ఒరిజినల్ మార్కులతోనే కౌన్సిలింగ్‌కు వెళ్లొచ్చని వెల్లడించింది. నీట్ యూజీ 2024 ఎగ్జామ్‌లో అక్రమాలు జరిగాయంటూ దేశవ్యాప్తంగా అభ్యర్థులు నిరసన తెలియజేస్తున్నారు. గ్రేస్ మార్కులు యాడ్ చేయడాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలో వాటిని తొలగించి మళ్లీ ఎగ్జామ్ నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది.
మూడు రోజుల పాటు విచారణ
నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ అయిందంటూ పలువురు ఆరోపిస్తున్న నేపథ్యంలో కేంద్ర విద్యా శాఖ ఆధ్వర్యంలో నలుగురు సభ్యులతో కూడిన కమిటీ ఏర్పాటు చేశామని సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ‘‘జూన్ 10, 11, 12వ తేదీల్లో కమిటీ ఇన్వెస్టిగేషన్ చేసింది. ఎగ్జామ్ రాసిన అభ్యర్థులతో మాట్లాడింది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) అధికారుల నుంచి సమాచారం సేకరించింది. క్వశ్చన్ పేపర్లో వచ్చిన తప్పులపై ఆరా తీసింది. ఈ మేరకు నివేదిక సమర్పించింది”అని వివరించింది. కమిటీ సూచన మేరకే 1,563 మంది అభ్యర్థులకు వేసిన గ్రేస్ మార్కులను తొలగిస్తున్నామని చెప్పింది. వీరందరికీ మళ్లీ ఎగ్జామ్ నిర్వహించి వారం రోజుల్లోనే ఫలితాలు వెల్లడిస్తామని తెలిపింది. ఆ తర్వాతే కౌన్సిలింగ్ నిర్వహిస్తామని చెప్పింది. క్వశ్చన్ పేపర్ లీక్ అయిందని వస్తున్న ఆరోపణలను కేంద్ర ప్రభుత్వం ఖండించింది.
ఏడు హైకోర్టుల్లో పిటిషన్లు
నీట్ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ లీక్ అయిందని..1,563 మందికి గ్రేస్ మార్కులు కలపడాన్ని వ్యతిరేకిస్తూ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పలువురు అభ్యర్థులతో పాటు మరికొందరు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దేశవ్యాప్తంగా ఏడు హైకోర్టుల్లో పిటిషన్లు దాఖలయ్యాయి. వెబ్ కౌన్సిలింగ్‌పై స్టే విధించాలని అభ్యర్థులు విన్నవించారు. ఈ పిటిషన్లపై సుప్రీం కోర్టు గురువారం విచారణ జరిపింది. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం.. వెబ్ కౌన్సిలింగ్‌పై స్టే విధించేందుకు నిరాకరించింది. షెడ్యూల్ ప్రకారం.. జులై 6 నుంచి వెబ్ కౌన్సిలింగ్ ప్రారంభం అవుతుందని స్పష్టం చేసింది. అభ్యర్థులు దాఖలు చేసిన పిటిషన్లపై రెండు వారాల్లోగా వివరణ ఇవ్వాలంటూ ఎన్టీఏను ఆదేశిస్తూ నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను జులై 8వ తేదీకి వాయిదా వేసింది.
అభ్యర్థుల తరఫున ‘ఫిజిక్స్ వాలా’ లీగల్ ఫైట్
నీట్ అభ్యర్థుల తరఫున ‘ఫిజిక్స్ వాలా’ కంపెనీ ఫౌండర్ అలఖ్ పాండే సుప్రీం కోర్టులో లీగల్ ఫైట్ చేస్తున్నారు. ఎగ్జామ్‌లో మాస్ కాపీయింగ్ జరి గిందని, క్వశ్చన్లు ముందే లీక్ అయ్యాయని, గ్రేస్ మార్కులు తొలగించాలంటూ పిటిషన్లో కోరారు. ప్రయాగ్‌రాజ్ కు చెందిన పాండే బీటెక్ మధ్యలోనే ఆపేశాడు. నటుడు కావాలనుకున్నా, ఆర్థిక ఇబ్బందుల వల్ల 8వ క్లాస్ విద్యార్థులకు ట్యూషన్ ప్రారంభించాడు. ఇప్పుడు ‘ఫిజిక్స్ వాలా’గా మారాడు. 61 యూట్యూబ్ చానెల్స్ ఉన్నాయి. 3.10 కోట్ల మంది సబ్‌స్ర్కైబర్లు ఉన్నారు. రూ.2 వేల కోట్ల ఆస్తులు సంపాదించి దేశంలో రిచ్చెస్ట్ టీచర్ అయ్యాడు. అవసరమైనప్పుడు అభ్యర్థుల తరఫున న్యాయపోరాటం కూడా చేస్తూ అండగా నిలుస్తున్నాడు.
సుప్రీంకోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరగాలి: ఖర్గే
నీట్ ఎగ్జామ్ నిర్వహణలో అక్రమాలు జరిగాయని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. సుప్రీంకోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరగాలని డిమాండ్ చేశారు. ‘‘నీట్ ఎగ్జామ్‌లో గ్రేస్ మార్కుల సమస్య ఒక్కటే కాదు.. పేపర్ లీక్ అయింది. కొన్ని సెంటర్లలో మాస్ కాపీయింగ్ జరిగింది. ప్రధాని నరేంద్ర మోదీ కారణంగా 24 లక్షల మంది అభ్యర్థుల ఫ్యూచర్ ప్రమాదంలో పడింది. క్వశ్చన్ పేపర్ అమ్ముకున్నారు. ఇందులో పెద్ద స్కామ్ జరిగింది. రూ. వేల కోట్లు చేతులు మారాయి. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) అసమర్థతకు ఇదే నిదర్శనం. సుప్రీంకోర్టు పర్యవేక్షణలోనే ఇన్వెస్టిగేషన్ జరగాలి. లక్షల మంది భవిష్యత్తుతో ఆడుకున్న వారిని కఠినంగా శిక్షించాలి. పదేండ్లుగా మోదీ ప్రభుత్వం పేపర్ లీకేజ్, మాస్ కాపీయింగ్‌తో కోట్లాది మంది విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నది’’అని ఖర్గే మండిపడ్డారు.
నీట్.. ఎలిజిబిలిటీ ఎగ్జామ్ కాదు.. ఎలిమినేషన్ ఎగ్జామ్: కనిమొళి
‘‘నీట్.. ఎలిజిబిలిటీ ఎగ్జామ్ కాదు.. ఎలిమినేషన్ ఎగ్జామ్” అని డీఎంకే ఎంపీ కనిమొళి విమర్శించారు. గురువారం ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. తమిళనాడు రాష్ట్రంలో సొంత మెడికల్ రిక్రూట్‌మెంట్ బోర్డు ద్వారా ఎగ్జామ్స్‌ను సక్సెస్‌ఫుల్‌గా నిర్వహిస్తున్నామని, అందుకే నీట్ యూజీ నుంచి తమ రాష్ట్రాన్ని మినహాయించాలని కోరుతున్నామని చెప్పారు. నీట్ ప్రవేశపెట్టినప్పటి నుంచి తమిళనాడు రాష్ట్రం చాలా నష్టపోయిందన్నారు. తమ రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో డాక్టర్లు లేరని, నీట్‌ను తీసుకురావడం వల్ల హెల్త్‌కేర్ వ్యవస్థ దెబ్బతింటోందని కనిమొళి తెలిపారు. అడ్వాన్స్‌డ్ కోచింగ్ తీసుకునే సామర్థ్యం ఉన్న స్టూడెంట్ల కోసం నీట్ పని చేస్తుండగా, తమిళనాడులోని గ్రామీణ విద్యార్థులకు ఇది ప్రతికూలంగా ఉందన్నారు.