- ఈనెల చివరలో నిర్వహించే అవకాశం
- కొత్త కాలేజీల్లో సీట్లు ఫైనల్ కాగానే నోటిఫికేషన్
- ఎన్టీయే అధికారిక వర్గాల వెల్లడి
- నీట్ లీకేజీపై రేపు సుప్రీంకోర్టులో విచారణ
మెడికల్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ యూజీ కౌన్సెలింగ్ ను వాయిదా వేస్తున్నట్టు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వెల్లడించింది. కౌన్సెలింగ్‌ను ఈ నెలాఖరులో ప్రారంభించే అవకాశాలు ఉన్నాయని తెలిపింది.
హైదరాబాద్, వెలుగు: మెడికల్ కోర్సుల్లో ప్రవేశాల కోసం చేపట్టే నీట్ యూజీ 2024 కౌన్సెలింగ్ ను వాయిదా వేశామని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీయే) వర్గాలు వెల్లడించాయి. కౌన్సెలింగ్ ను ఈనెల చివరలో ప్రారంభించే అవకాశాలు ఉన్నాయని తెలిపాయి. వాస్తవానికి నీట్ యూజీ కౌన్సెలింగ్ ఈనెల మొదటి వారంలోనే (6వ తేదీ నుంచే) ప్రారంభం కావాల్సి ఉంది.
అయితే, కొన్ని మెడికల్ కాలేజీలకు పర్మిషన్ లెటర్ల జారీ, అదనపు సీట్ల కేటాయింపు ప్రక్రియ కొనసాగుతోందని, అలాగే కొత్త కాలేజీల్లో సీట్ల సంఖ్యపై కసరత్తు కూడా పూర్తికాగానే కౌన్సెలింగ్ కు నోటిఫికేషన్ జారీ చేస్తామని అధికారులు తెలిపారు. సీట్లపై కసరత్తు పూర్తికాగానే కౌన్సెలింగ్ తేదీ, షెడ్యూల్ ను ప్రకటించే అవకాశం ఉందన్నారు. అయితే, జులై చివరి వారంలో షెడ్యూల్ రిలీజ్ అయ్యే అవకాశం ఉందని తెలిపారు. ఈనెల మూడో వారంలో ఎంబీబీఎస్ సీట్ మ్యాట్రిక్స్ ఫైనల్ అవుతుందని, ఆ తర్వాతే షెడ్యూల్‌పై నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు.
నిరుడు కూడా జులై మూడో వారంలోనే షెడ్యూల్ ప్రారంభమైందని గుర్తుచేశారు. కాగా, నీట్ యూజీ ఎగ్జాంలో అవకతవకల ఆరోపణల నేపథ్యంలో ఈ ఎగ్జాంను రద్దు చేయాలంటూ సుప్రీంకోర్టులో 32 పిటిషన్లు దాఖలయ్యాయి. అయితే, పెద్ద ఎత్తున అక్రమాలు జరిగినట్టు ఆధారాలేమీ లేకుండానే పరీక్షను రద్దుచేస్తే లక్షల మంది స్టూడెంట్లకు నష్టం జరుగుతుందని కేంద్ర ప్రభుత్వం, నీట్ ఎగ్జామ్ నిర్వహించిన ఎన్టీయే.. సుప్రీంకోర్టుకు తెలిపాయి.
ఈ నేపథ్యంలో నీట్ యూజీ కౌన్సెలింగ్ ను వాయిదా వేసేందుకు సుప్రీంకోర్టు తిరస్కరించింది. కానీ, మొదట వ్యతిరేకించిన ఎన్టీయే ఇప్పుడు కౌన్సెలింగ్ ను తనంతట తానే వాయిదా వేసింది. కాగా.. నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంపై దాఖలైన 32 పిటిషన్లను కలిపి జస్టిస్ చంద్రచూడ్ బెంచ్ ఈనెల 8న విచారణ జరపనుంది.
రాష్ట్రాలకు అందని ర్యాంకుల జాబితా
నీట్ ఫలితాలు వెలువడిన 10, 15 రోజుల తర్వాత అన్ని రాష్ట్రాలకు ఆయా రాష్ట్రాల విద్యార్థుల మార్కులు, ర్యాంకుల జాబితాను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పంపిస్తుంది. ఈసారి ఫలితాలు విడుదలై నెల రోజులు దాటినా ఇప్పటి వరకూ జాబితాను రాష్ట్రాలకు పంపలేదు. ఈ జాబితా వచ్చిన తర్వాతే కౌన్సెలింగ్ ప్రారంభమవుతుంది. అప్పటి దాకా కౌన్సెలింగ్ షురూ అయ్యే అవకాశం లేదు. మన రాష్ట్రం నుంచి ఈసారి 77,849 మంది విద్యార్థులు నీట్ పరీక్షకు హాజరయ్యారు. వారిలో 47,371 (60.84 శాతం) మంది ఉత్తీర్ణత సాధించారు.