గెలిచేది ఆ ముగ్గురేనట..గుబులు పుట్టిస్తున్న పార్టీ హైకమాండ్​ సర్వే

  • ఉమ్మడి జిల్లాలో ముగ్గురికే సానుకూల ఫలితాలు 
  •  9 మంది ఎమ్మెల్యేల పనితీరు నిరాశాజనకం
  •  పార్టీ కంటే ఎమ్మెల్యేల పనితీరు పైనే ప్రతికూల ఫలితాలు

నల్గొండ, వెలుగు  నల్గొండ జిల్లాలోని ఒక అసెంబ్లీ సెగ్మెంట్​లో జరిపిన సర్వేలో బీఆర్ఎస్​అభ్యర్థికి 26శాతం మంది మద్ధతు తెలిపితే, కాంగ్రెస్​ అభ్యర్థికి 42శాతం మంది మద్ధతు తెలిపారు. బీఆర్ఎస్ అసమ్మతి లీడర్​కు 15 శాతం మంది సపోర్ట్​ చేశారు. పార్టీ పరంగా చూస్తే బీఆర్ఎస్ కు​47 శాతం, కాంగ్రెస్ కు 40 శాతం  మంది సపోర్ట్​ చేశారు. పార్టీ పరంగా బీఆర్ఎస్​, కాంగ్రెస్​ మధ్య 7శాతం తేడా ఉండగా..

అభ్యర్థి విషయంలో మాత్రం 16 శాతం తేడా కనిపిస్తోంది. కులాల వారీగా యాదవ, గౌడ సామాజిక వర్గాలు బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపాయి. మాదిగ సామాజిక వర్గానికి వస్తే బీఆర్ఎస్​, కాంగ్రెస్ మధ్య 3శాతం తేడా ఉంది. రెడ్లు, మైనార్టీ, ఆర్యవైశ్య, పద్మశాలీ, మాల సామాజిక వర్గానికి చెందిన వాళ్లు కాంగ్రెస్ వైపు ఆసక్తిచూపారు. ప్రస్తుతం కాంగ్రెస్​లో ఉన్న ఆ ముఖ్యనేత ఒకవేళ బీజేపీలో చేరితే ఆయనకే మద్ధతు తెలిపేందుకు సిద్ధంగా ఉన్నామని మెజార్టీ ప్రజలు తమ అభిప్రాయాన్ని వెలిబుచ్చారట.

12 నియోజకవర్గాల్లో రహస్య సర్వే 

బీఆర్ఎస్​ హైకమాండ్​ ఇటీవల ఒక ప్రముఖ ఏజెన్సీ ద్వారా 12 నియోజ కవర్గాల్లో రహస్య సర్వే జరిపింది. సీఎం కేసీఆర్​కు నమ్మదగిన ఆ ఏజెన్సీ వివిధ వర్గాల ప్రజల అభిప్రాయాలను లోతుగా సేకరించింది. బీఆర్ఎస్​, కాంగ్రెస్​, బీజేపీ, సొంత పార్టీలోని అసమ్మతి నేతల పేర్లతో సర్వే చేసింది. ఏ సామాజిక వర్గానికి చెందిన జనాలు ఎవరి వైపు మొగ్గుచూపుతున్నారు, ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే బీఆర్ఎస్​ పరిస్థితి ఎట్లా ఉంటుందనే అంశాలపైన సర్వే చేశారు.  అయితే ఈ సర్వేలో వచ్చిన ఫలితాలు ఆశ్యర్యానికి గురిచేశాయని, పార్టీ హైకమాండ్​ సైతం బిత్తరపోయిందని ఉమ్మడి జిల్లాకు చెందిన పార్టీ ముఖ్యనేత ఒకరు చెప్పారు. 

ముగ్గురికే గెలుపు అవకాశాలు...

ఉమ్మడి జిల్లాలో పార్టీ బలంగా ఉందని, ఎమ్మెల్యేల వైఖరి వల్లే నష్టం ఎక్కువ ఉందని సర్వేలో తేలినట్లు తెలిసింది. 12 నియోజకవర్గాల్లో మూడు నియోజక వర్గాల్లో మాత్రమే పార్టీ, అభ్యర్థి పట్ల సానుకూల ఫలితాలు వచ్చాయి. నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి జిల్లాలో ముగ్గురు ఎమ్మెల్యేలకు మాత్రమే గెలుపువకాశాలు మెండుగా ఉన్నాయని, వీళ్లలో ఉమ్మడి జిల్లా ముఖ్యనేత కూడా ఉన్నట్లు తెలిసింది. మిగితా 9 మంది ఎమ్మెల్యేల పరిస్థితి అంత బాగా లేదని, పార్టీ పరంగా ఫలితాలు ఆశాజనకంగా ఉన్నప్పటికీ అభ్యర్థి విషయంలోనే ప్రజలు విముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం.

9 మంది ఎమ్మెల్యేల్లో టెన్షన్​..

 సర్వే ఫలితాలు ఎమ్మెల్యేల్లో టెన్షన్​ పుట్టిస్తున్నాయి. నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి పనులే వచ్చే ఎన్నికల్లో గెలిపిస్తాయని ఎమ్మెల్యేలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. కానీ సర్వే ఫలితాలు మాత్రం అందుకు భిన్నంగా ఉండటంతో ఏం చేయాలో పాలుపోవడం లేదని సీనియర్​ నేతలు చెపుతున్నారు. ఎమ్మెల్యేల వైఖరి సరిగా లేకపోవడంతోనే కాంగ్రెస్​ లీడర్లు 12 స్థానాల్లో గెలుస్తామని చాలెంజ్​ చేశారు.

నల్గొండ జిల్లాను కేసీఆర్​ ఖిల్లాగా మారుస్తామని బీఆర్ఎస్​ ముఖ్యనేతలు సవాల్ విసిరితే..కాంగ్రెస్​ లీడర్లు పార్టీకి పూర్వవైభవం తీసుకొస్తామని చాలెంజ్​ చేయడం వెనక సర్వే ఫలితాలే కారణమని సీనియర్ నేత ఒకరు తెలిపారు. జిల్లాలో కంప్లీట్​ చేసిన పనుల కంటే శంకుస్థాపనులు చేసి ఇంకా మొదలు పెట్టని పనులు, పెండింగ్​పనులే చాలా ఉన్నాయి. ఎన్నికల వరకు పెండింగ్​ పనులు కంప్లీట్​ చేసి, ప్రజల మెప్పు పొందాలని ఎమ్మెల్యేలు చూస్తుంటే.. కాంగ్రెస్​, బీజేపీలు మాత్రం వాటినే ప్రధాన అస్త్రంగా ప్రయోగించేందుకు సిద్ధమయ్యాయి. 

 కాంగ్రెస్​తోనే ప్రధాన పోటీ...

వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్​తోనే తలపడాల్సి వస్తదని సర్వే ఫలితాలు తేటతెల్లం చేశాయి. బీఆర్ఎస్, కాంగ్రెస్​, బీజేపీ ట్రయాంగిల్ వార్​ ఉంటదని భావిస్తున్న సెగ్మెంట్లలో కూడా కాంగ్రెస్సే గట్టిపోటీ అని తేలింది. సర్వే రిపోర్ట్​లు ప్రతికూలంగా ఉన్నాయనే ఉద్దేశంతోనే ఇటీవలీ కాలంలో ఎమ్మె ల్యేలు కాంగ్రెస్​ లీడర్లను టార్గెట్​ చేశారు. 'నాడు-–నేడు' అనే నినాదంతో అభివృద్ధి మంత్రాన్నే జపిస్తున్నారు.

పార్టీ బలంగా ఉందని సర్వే చెప్తున్న ప్పటికీ ఎమ్మెల్యేల వైఖరి, గ్రూపు తగదాలు పెద్ద తలనొప్పిగా మారాయి. ఇక నుంచి ఎమ్మెల్యేలు జనంలోకి వెళితే తప్ప ఎన్నికల వరకు పరిస్థితులు అనుకూలంగా మారవని, ఇందులో భాగంగానే తెలంగాణ దశాబ్ధి ఉత్సవాలను వాడుకోవాలని పార్టీ హైకమాండ్​ ఆదేశించినట్లు ముఖ్యనేత ఒకరు 'వెలుగు'తో చెప్పారు.