భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జాడలేని గృహలక్ష్మీ

 

  •     భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో  రెండో విడతపై కానరాని స్పష్టత
  •     దళిత బంధు, బీసీ ఆర్థిక సాయం కోసం తప్పని ఎదురుచూపులు
  •     ఎన్నికల నోటిఫికేషన్​రాబోతుండడంతో 

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గృహలక్ష్మి స్కీంలో దరఖాస్తులు తీసుకున్న ఆఫీసర్లు, అమలుపై పెద్దగా దృష్టి సారించకపోవడం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని  లబ్ధిదారుల్లో ఆందోళన నెలకొంది.  ఖమ్మంలో గృహలక్ష్మి స్కీం అమలవుతుండగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మాత్రం నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది.  

మరో వైపు దళితబంధు, బీసీ ఆర్థిక  సాయం రెండో విడత అమలుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఫండ్స్​ రిలీజ్​ చేయలేదు.  వచ్చే నెల రెండో వారంలో అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్​ వస్తుందనే ప్రచారం జరుగుతుండడంతో లబ్ధిదారుల్లో ఆందోళన నెలకొంది. 

ఊరిస్తున్న గృహలక్ష్మి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గృహలక్ష్మీ దరఖాస్తులు తీసుకున్న ఆఫీసర్లు అర్హుల జాబితాపై వెరిఫికేషన్ పూర్తి చేశారు.  మొత్తం 87,741 దరఖాస్తులు రాగా..  దాదాపు 12,300  మందికి గృహలక్ష్మి స్కీంను అమలు చేయాలని ఆఫీసర్లు లక్ష్యంగా పెట్టుకున్నారు.  అర్హుల జాబితా రూపకల్పనలో దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిశీలించాలని కలెక్టర్​డాక్టర్​ప్రియాంక అల అధికారులను ఆదేశించారు. 

దళితబంధు.. బీసీ ఆర్థిక సాయం ఏదీ?

దళితబంధు స్కీం రెండో విడతపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు  గైడ్​లైన్స్‌, ఫండ్స్​ రాకపోవడంతో లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దళిత బంధు  రెండో విడతకు సంబంధించి జిల్లా వ్యాప్తంగా దాదాపు 11,759 దరఖాస్తులు వచ్చాయి.  వచ్చిన అఫ్లికేషన్ల వెరిఫికేషన్‌ను ఆఫీసర్లు పూర్తి చేశారు. అర్హుల జాబితా సెలెక్షన్​ పూర్తిగా ఎమ్మెల్యేల చేతిలో ఉండడంతో ఆఫీసర్లు ఏం మాట్లడలేని పరిస్థితి.  

దళితబంధు స్కీంలో అర్హుల లిస్ట్‌లో తమ పేరు ఉండేందుకు జిల్లాలోని కొత్తగూడెం, ఇల్లెందు నియోజకవర్గాల్లో దళారులకు పలువురు దరఖాస్తుదారులు దాదాపు రూ. 2 నుంచి రూ. 3 లక్షల వరకు ముట్టజెప్పారనే ప్రచారం జరుగుతోంది.  మరో  రెండు, మూడు వారాల్లో అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్​ వచ్చే అవకాశం ఉందనే ప్రచారంతో లబ్ధిదారుల్లో టెన్షన్ నెలకొంది.  ఎన్నికల నోటిఫికేషన్​ రాకముందే దళితబంధు,  

బీసీ ఆర్థిక సాయం, గృహలక్ష్మి స్కీంలు అందిస్తారో లేదో అనే సందిగ్ధత నెలకొంది.   దళితబంధు, బీసీ ఆర్థిక సాయంతో పాటు గృహలక్ష్మి స్కీం అమలులో పారదర్శకత ఉండాలని, ఎమ్మెల్యే చెప్పిన వాళ్లకే  స్కీంలు ఇవ్వడం దారుణమని పలు పార్టీలు, ప్రజా సంఘాల నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే ఇస్తాం : ఆఫీసర్లు 

ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే దళిత బంధు స్కీంను అమలు చేస్తామని జిల్లా మైనార్టీ వెల్ఫేర్​ఆఫీసర్​ సంజీవరావు తెలిపారు.  రెండో విడతకు సంబంధించి బీసీ ఆర్థికసాయం అమలుపై  ప్రభుత్వం నుంచి ఆదేశాలు రావాల్సి ఉందని బీసీ వెల్ఫేర్​ఆఫీసర్​ఇందిరా పేర్కొన్నారు.