
- పగిలిన పైప్‌లైన్ల రిపేర్లు ఆలస్యం
- ఫేజ్ 1,2 కింద 10 టీఎంసీలకు లిఫ్టు చేసింది 0.7 టీఎంసీలే
- తుపాకులగూడెం బ్యారేజ్‌లో మిగిలింది 1.74 టీఎంసీలే !
- దేవాదుల కింద ఎండిపోతున్న పంటలు
- ఆందోళనలో అన్నదాతలు
జయశంకర్ భూపాలపల్లి, వెలుగు: గోదావరిలో నీళ్లున్నప్పుడు చెరువులు నింపుకొని, అవసరం ఉన్నప్పుడు వాడుకోవాలనేది దేవాదుల లిఫ్టు స్కీం లక్ష్యం. కానీ సర్కారు నిర్వాకం, ఇరిగేషన్ ఆఫీసర్ల నిర్లక్ష్యం వల్ల ఆ లక్ష్యం నెరవేరలేదు. గతేడాది జూలై నెలలో కురిసిన భారీ వర్షాలు, వరదల వల్ల పలుచోట్ల దేవాదుల పైపులైన్లు పైకిలేవగా రిపేర్లు చేసేందుకు నెలలు గడిపారు. తీరా ఫిబ్రవరి 15 నుంచి మోటార్లు స్టార్ట్ చేసినా అప్పటికే తుపాకుల గూడెం బ్యారేజీ వద్ద గోదావరిలో నీటి మట్టం పడిపోయింది. 6.94 టీఎంసీలకు ప్రస్తుతం1.74 టీఎంసీలకే పరిమితమైంది. ఈ యాసంగిలో ఫేజ్1,2 కింద సుమారు10 టీఎంసీల వాటర్ లిఫ్ట్ చేసి, లక్ష ఎకరాలకు నీళ్లివ్వాలని అనుకున్నా ఇప్పటివరకు లిఫ్టు చేసింది కేవలం 0.7 టీఎంసీలే!. దీంతో ఆయకట్టు పరిధిలో పంటలు ఎక్కడికక్కడ ఎండిపోతుండగా, కాపాడుకునేందుకు రైతులు అష్టకష్టాలుపడ్తున్నారు.
ఆఫీసర్ల నిర్లక్ష్యంతో ఎండుతున్న పంటలు..
2008లో ప్రారంభమైన దేవాదుల లిఫ్టు స్కీం ద్వారా సుమారు 6.21 లక్షల ఎకరాలకు సాగునీరివ్వాల్సి ఉంది. కానీ, పనులు పూర్తికాకపోవడంతో యేటా యాసంగిలో సుమారు 10 టీఎంసీల వాటర్ లిఫ్ట్ చేస్తున్నారు. 500 కు పైగా చెరువులను నింపి, వాటి పరిధిలో లక్ష ఎకరాలకు మాత్రమే సాగునీరందిస్తున్నారు. కానీ, ఈ ఏడాది ఖరీఫ్‌లో కురిసిన భారీ వర్షాల వల్ల దేవాదుల ఫేజ్ ‒1 పైప్‌లైన్ పరకాల మండలంలో, దేవాదుల ఫేజ్‒2 పైప్‌లైన్ ధర్మసాగర్ మండలంలో పగిలిపోయింది. వీటిని ఇన్‌టైంలో రిపేర్ చేసి నీళ్లిస్తారని భావించిన రైతులు ఎప్పట్లాగే ఆయకట్టు పరిధిలో వరి, ఇతర పంటలు సాగు చేశారు. తీరా పంట పొట్ట దశకు వచ్చేసరికి సాగునీటి సమస్య తీవ్రమైంది. చెరువులన్నీ అడుగంటడంతో ఇప్పటికే దేవాదుల కింద సుమారు 30 వేల ఎకరాలు
ఎండిపోయినట్లు తెలుస్తోంది.
ఫిబ్రవరిలో ధర్మసాగర్‌కు..
గోదావరిపై ఇన్‌టేక్‌వెల్ దగ్గర జనవరి నెలలోనే మోటార్లు స్టార్ట్ చేసి భూపాలపల్లి జిల్లాలోని భీంఘన్‌పూర్ రిజర్వాయర్‌కు 3.5 టీఎంసీల వాటర్ లిఫ్ట్ చేశారు. కానీ ఇక్కడి నుంచి ఫేజ్‒1, ఫేజ్‒2 మోటార్లను ఆన్ చేస్తేనే ధర్మసాగర్ రిజర్వాయర్‌కి నీళ్లు చేరుకుంటాయి. కానీ, ఈ రెండు ఫేజ్‌లలో పైప్‌లైన్లు పగిలి భూమిపైకి లేవడం వల్ల భీం ఘన్‌పూర్ దగ్గర మోటార్లను ఆన్ చేయలేదు. రైతుల నుంచి వచ్చిన ఒత్తిడితో ఫిబ్రవరిలో పైప్‌లైన్లు రిపేర్ చేసి వాటర్ లిఫ్ట్ చేయడం స్టార్ట్ చేశారు. ధర్మసాగర్ రిజర్వాయర్‌కు ఫిబ్రవరి మూడో వారంలో నీళ్లు చేరుకున్నాయి. మొదటి, రెండో దశల్లో కలిపి 4 మోటార్లను 172 రోజుల పాటు నిరంతరాయంగా నడిపిస్తే 12.33 టీఎంసీల నీటిని ధర్మసాగర్ వరకు వరకు పంపింగ్ చేసే వీలుండేది. ఆ రిజర్వాయర్ నిండితే అక్కడి నుంచి ఆర్‌ఎస్ ఘన్‌పూర్, ఆశ్వరావుపల్లి, చీటకోడూర్, గండిరామారం, బొమ్మకూరు, వెల్దండ, తపాస్‌పల్లి రిజర్వాయర్లను, వాటి కింద సుమారు 500 చెరువులను నింపి పంటలకు నీళ్లిచ్చే అవకాశముండేది. కానీ, పంపింగ్ 50 రోజులకు పైగా ఆలస్యం కావడంతో గోదావరిలో నీటిమట్టం తగ్గిపోయింది. మేడిగడ్డ బ్యారేజీ గేట్లు బంద్ పెట్టడంతో ఎగువ నుంచి తుపాకుల గూడెం బ్యారేజీకి నీళ్లు రావట్లేదు. ఈ బ్యారేజీ కెసాసిటీ 6.94 టీఎంసీలకు ప్రస్తుతం 1.74 టీఎంసీలు మాత్రమే ఉన్నాయి. మండుతున్న ఎండలకు ఎవాపరేషన్ లాసెస్, డెడ్ స్టోరేజీ తీసేస్తే టీఎంసీ నీళ్లను కూడా లిఫ్టు చేసే పరిస్థితి లేదు. దీంతో వేలాది ఎకరాల్లో చేతికి వచ్చే దశలో ఉన్న పంటలపై రైతులు ఆశలు వదులుకుంటున్నారు.
పైప్‌లైన్లు రిపేర్ చేయకపోవడం వల్లే..
ధర్మసాగర్ నుంచి మల్లన్న గండికి నీళ్లు పోయే పైప్ లైన్ జాయింట్ ఊడిపోయి జానకిపురంలో ఆగస్టు నెలలో 10 పైపులు పైకి తేలినయ్. నాలుగు నెలల దాకా వాటి దిక్కు చూసినోళ్లు లేరు. అప్పటికే ఆలస్యం జరిగి నీళ్లు రాక రైతులు వేసిన పంటలు ఎండిపోతున్నయి. పెట్టుబడులు చేతికి వచ్చే పరిస్థితి లేదు
- తొట్టె చేరాలు, జానకీపురం, ధర్మసాగర్ మండలం, హనుమకొండ జిల్లా