గద్వాల, వెలుగు: ఐదో శక్తిపీఠమైన జోగులాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి టెంపుల్‌పై ఆలయ కమిటీ మెంబర్లు, ఎండోమెంట్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. రేపటి నుంచే శివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నా.. ఇంకా ఏర్పాట్లు పూర్తి చేయలేదు. తాగునీరు, చలువ పందిళ్లు, మరుగుదొడ్లు, పార్కింగ్.. తదితర సౌకర్యాలు ఇంకా కల్పించలేదు. కానీ, చైర్మన్, ఈవో, అర్చకులు అంతా కలిసి బ్రహ్మోత్సవాలకు ఆహ్వానం పేరిట వీఐపీల చుట్టూ తిరుగుతున్నారు. గత నెల చివరి నుంచి 13 తేదీ వరకు ఇదే పనిలో ఉన్నారు. సీఎం ఫ్యామిలీ మెంబర్స్, మినిస్టర్లు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, ఎస్పీలు, జడ్పీ చైర్‌పర్సన్లు, మున్సిపల్ చైర్‌పర్సన్లతో పాటు కర్నూల్ వెళ్లి అక్కడి లీడర్లు, కలెక్టర్, ఎస్పీలను కూడా ఆహ్వానించారు.
17 నుంచి 21 వరకు ఉత్సవాలు
జోగులాంబ బ్రహ్మోత్సవాలు ఈనెల 17న ప్రారంభమై 21 వరకు కొనసాగనున్నాయి. దాదాపు 50 వేల వరకు భక్తులు వస్తారని అంచనా వేసి ఆ మేరకు ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు. కానీ, ఇప్పటి వరకు ఎక్కడి పనులు అక్కడే ఉన్నాయి. కనీసం నేషనల్ హైవేపై ఉన్న ఆర్చీని కూడా క్లీన్ చేయలేదు. గతంలో వారం ముందుగా క్లీన్ చేసి.. రంగురంగుల బల్బులతో డెకరేట్ చేసేవారు. భక్తులకు సరిపడా టాయిలెట్స్, బాత్రూమ్స్ ఏర్పాటు చేయలేదు. టెంపుల్ వద్ద ప్రస్తుతం 20 టాయిలెట్స్, 10 బాత్రూమ్‌లు ఉండగా.. 100కు పైగా తాత్కాలిక టాయిలెట్స్, బాత్రూమ్‌లు ఏర్పాటు చేయాల్సి ఉంది. కేవలం చలువ పందిళ్లు , క్యూలైన్లుతో పాటు నదిలో నీళ్లు తక్కువగా ఉండడంతో భక్తులు స్నానాలు చేసేందుకు 40 షవర్లు ఏర్పాటు చేస్తున్నారు.
సౌకర్యాలు కరువు
టెంపుల్ వద్ద భక్తులకు కనీస సౌకర్యాలు కూడా కల్పించడం లేదు. సామాగ్రి పెట్టేందుకు లాకర్, నిద్ర చేసేందుకు రూమ్‌లు అందుబాటులో లేవు. గుడి ఆవరణలో పడుకుందామన్నా.. షెడ్లు కూడా లేవు. పైగా పందులు, మేకల సంచారంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. స్వామి, అమ్మవార్ల దర్శనం అనంతరం భక్తులు కాసేపు కూర్చునేందుకు స్థలం కూడా లేదు. నిత్య అన్నదాన సత్రం ఉన్నా.. సరైన బిల్డింగ్ లేకపోవడంతో ఇబ్బందులు తప్పట్లేదు. పార్కింగ్ కూడా అస్తవ్యస్తంగా ఉంది. టెండర్ ద్వారా లక్షల ఆదాయం వస్తున్నా.. వాహనాలు నిలిపేందుకు కనీసం రేకుల షెడ్డు కూడా వేయలేదు. ఎక్కడపడితే అక్కడ వాహనాలను నిలుపుతుండడంతో ఆ ఏరియా పద్మవ్యూహంలా మారుతోంది. ప్రసాద్ స్కీమ్ పనులు కూడా నెమ్మదిగా సాగుతున్నాయి. జోగులాంబ టెంపుల్ అభివృద్ధికి కేంద్రం ప్రసాద్ స్కీమ్ కింద రూ. 36 కోట్లు మంజూరు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఎండోమెంట్ ఆధ్వర్యంలో పనులు చేపట్టినా.. ఇంకా 50 శాతం పెండింగ్‌లో ఉన్నాయి.
టాయిలెట్లు, బాత్రూమ్‌లు ఏర్పాటు చేస్తలే
కొత్తగా టాయిలెట్లు, బాత్రూంలు ఏర్పాటు చేయడం లేదు. చలువ పందిళ్లు, క్యూలైన్లు ఏర్పాటు చేస్తున్నం. తాగునీరు, టిఫిన్, భోజన సౌకర్యం కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నం. స్నానాలకు 40 షవర్లు పెడుతున్నం. బ్రహ్మోత్సవాల ప్రారంభ సమయానికి పనులన్నీ పూర్తి చేస్తాం.
–పురేందర్ కుమార్, ఈవో