మహాత్మా.. మన్నించు! నిర్లక్ష్యానికి గురైన 16 ఫీట్ల బాపూజీ కాంస్య విగ్రహం

మహాత్మా.. మన్నించు! నిర్లక్ష్యానికి గురైన 16 ఫీట్ల బాపూజీ కాంస్య విగ్రహం

పద్మారావునగర్, వెలుగు: సికింద్రాబాద్​ గాంధీ ఆసుపత్రి ఎదురుగా ఉన్న 16 ఫీట్ల బాపూజీ కాంస్య విగ్రహం అధికారుల నిర్లక్ష్యానికి గురవుతున్నది. రూ.2.25 కోట్ల ఖర్చుతో మూడేండ్ల కిందట ఈ విగ్రహాన్ని హెచ్ఎండీఏ ఏర్పాటు చేయగా, ప్రస్తుతం నిర్వహణ లేమితో కళావిహీనంగా మారింది. కొంతకాలం హెచ్ఎండీఏనే విగ్రహం చుట్టూ గ్రీనరీ, తదితర పనుల మెంటెనెన్స్​ చూసేది. ఆ తర్వాత పట్టించుకోకపోవడంతో విగ్రహం ఉనికి ప్రశ్నార్థకంగా మారుతోంది. ఆసుపత్రి ఎదుట నిత్యం ఎన్జీఓలు చేస్తున్న అన్నదానాలతో చుట్టు చెత్తాచెదారం పేరుకుపోతున్నాయి.

విగ్రహం ఆవరణ యాచకులకు నిలయంగా మారింది. ఆహార వ్యర్థాల కోసం వస్తున్న పందికొక్కులు వందల సంఖ్యలో పెరిగిపోయాయి. వాటి తవ్వకాలతో పెద్ద పెద్ద గోతులు ఏర్పడ్డాయి. విగ్రహం ఏదో రోజు పక్కకి ఒరిగే ప్రమాదం ఉన్నది.  పార్టీల నాయకులు, ప్రజా సంఘాల నేతలు తమ నిరసనల్లో భాగంగా విగ్రహానికి వినతిపత్రాలు ఇస్తున్న సమయంలో విగ్రహ ఆవరణలో ఉన్న గ్రీనరీని  తొక్కుతుండటంతో అది మొత్తం పాడైపోయింది. విగ్రహానికి వేసిన పూలదండలు ఎండిపోయిన కూడా ఎవరూ తీయడం లేదు. అధికారులు స్పందించి విగ్రహ నిర్వహణను పట్టించుకోవాలని స్థానికులు కోరుతున్నారు.