పర్యావరణంపై సింగరేణి ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టు నిర్లక్ష్యం

పర్యావరణంపై సింగరేణి  ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టు నిర్లక్ష్యం
  • ప్రభావిత గ్రామాల చుట్టూ ఓసీపీల ఓబీ డంప్​లు
  • మొక్కలు పెంచాలన్న ఆదేశాలు బేఖాతరు
  • దుమ్ము, దూళితో అవస్థలు పడుతున్న జనం
  • సమస్యలు పరిష్కరించకుంటే ఆందోళన చేస్తామని హెచ్చరిక 

జైపూర్, వెలుగు: సింగరేణి ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టు ప్రభావిత గ్రామాల ప్రజలు పర్యావరణ సమస్యలతో సతమతమవుతున్నారు. లక్ష్యానికి మించి బొగ్గును ఉత్పత్తి చేస్తున్న సింగరేణి అధికారులు పర్యావరణ పరిరక్షణపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. ఇందారం, శ్రీరాంపూర్ ఓసీపీలతో పాటు పరిసర, ప్రభావిత గ్రామాల్లో మొక్కలు నాటాలని కేంద్ర పర్యావరణ శాఖ సింగరేణికి ఆదేశాలు జారీ చేసింది. 

కానీ సింగరేణి అధికారులు మాత్రం ఆ  ఆదేశాలను పక్కన పెట్టి ఇందారం, శ్రీరాంపూర్ ఓపెన్ కాస్ట్ ప్రభావిత రామారావుపేట, ఇందారం గ్రామాల చుట్టూ ఓబీ డంప్​లు పోస్తోంది. దీంతో ఆ గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సింగరేణి యాజమాన్యం ఓసీపీలలో మట్టిని తవ్వి గ్రామాలకు కొద్ది మీటర్ల దూరంలో చుట్టూ మొక్కలు నాటకుండా మట్టిని కుప్పలు పోస్తున్నారు. ఇప్పటికే ఓసీ పేలుళ్లతో ఏర్పడుతున్న శబ్ద, దుమ్ము ధూళి, వాయు కాలుష్యంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. 

పనికిరాకుండా పోయిన 40 ఎకరాలు

రామారావుపేట గ్రామం శ్రీరాంపూర్ ఓసీపీకి అతిదగ్గరగా ఉండడంతో బాంబ్ బ్లాస్టింగ్ సమయంలో ఊళ్లలోని ఇండ్లు బీటలు వారుతున్నాయి. ఓపెన్ కాస్ట్ ఏర్పాటు సమయంలో రైతుల నుంచి భూములను సేకరించిన సింగరేణి అరకొర నష్టపరిహారం మాత్రమే చెల్లించింది. మిగిలిన భూములకు రోడ్లు లేక జనం అవస్థలు పడుతున్నారు. ఓపెన్ కాస్ట్ నుంచి వచ్చే వరదతో సుమారు 40 ఎకరాల వ్యవసాయ భూములు సాగుకు పనికి రాకుండా పోతున్నాయి. 

రామారావుపేట శివారులో ఉన్న సింగరేణి భూముల్లో మట్టి తరలింపు కోసం రాజీవ్ రహదారికి రెండు వైపులా సర్వీస్ రోడ్లు వేయకుండా ఫ్లై ఓవర్ బ్రిడ్జి నిర్మించడంతో పంట పొలాలకు వెళ్లే రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పలుమార్లు కలెక్టర్, సింగరేణి శ్రీరాంపూర్ ఏరియా జీఎం, ఇందారం, శ్రీరాంపూర్ ఓపెన్ కాస్ట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ కు సమస్యలు వివరించినా పట్టించుకోవడం లేదని గ్రామస్తులు చెబుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి సమస్యలు పరిష్కరించకుంటే ఆందోళన చేపట్టి ఓసీ పనులు అడ్డుకుంటామని హెచ్చరిస్తున్నారు.

హామీలు నెరవేర్చని యాజమాన్యం

రాజీవ్ రహదారి వరకు వ్యవసాయ భూముల మీదుగా ఉన్న రోడ్డును డంప్ కోసం ఎత్తివేసేందుకు సింగరేణి కుట్ర చేస్తోందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పది రోజుల క్రితం ఇందారం, రామారావుపేట గ్రామాల రైతులు ఆందోళన చేపట్టారు. ఇందారం నుంచి రామారావుపేట శివారులోని పంట పొలాలకు వెళ్లేందుకు సింగరేణి యాజమాన్యం బీటీ లేదా సీసీ రోడ్లను నిర్మించాలని డిమాండ్ చేస్తూ బురద రోడ్లపై నిరసన తెలిపారు. రైతులకు నష్టపరిహారం చెల్లించకుండా ఫ్లై ఓవర్ బ్రిడ్జి పక్కన రైతుల భూమిలో దౌర్జన్యంగా రోడ్డు వేశారని, సింగరేణి అధికారులు వారి స్వార్థం కోసం తప్ప ప్రభావిత గ్రామాల ప్రజలకు ఇచ్చిన హామీలు నేరవేర్చలేదని వాపోతున్నారు. 

పంట పొలాల కోసం సింగరేణి వేసిన రోడ్లపై బూడిద (యాష్)ను పోసి రోడ్లు వేశామని చెప్పుకొని చేతులు దులుపుకున్నారని ఆరోపించారు. చిన్నపాటి వర్షాలకే  రోడ్లు బురదమయమై పంట పొలాల వైపు వెళ్లడానికి ఇబ్బందులు పడుతున్నా సింగరేణి యాజమాన్యానికి తమ గోడు పట్టడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఓసీపీల ఏర్పాటుకు ముందు సింగరేణి అధికారులు ప్రభావిత గ్రామాల్లో అన్ని సౌలత్ లు కల్పిస్తామని చెప్పి మోసం చేస్తున్నారని మండిపడుతున్నారు.