- వీధి కుక్కల నియంత్రణ చర్యల్లో నిర్లక్ష్యం
- ఖర్చు చేసేందుకు వెనక్కి తగ్గుతున్న జీహెచ్ఎంసీ
- తేలని లాప్రోస్కోపీ మెషీన్ల కొనుగోలు అంశం
- ఇతర రాష్ట్రాల్లోని సిటీల్లో విజయవంతంగా సర్జరీలు
హైదరాబాద్, వెలుగు: గ్రేటర్లో కుక్కల దాడులతో జనాలు బెంబేలెత్తిపోతున్నారు. మా ప్రాంతంలో నుంచి వీధి కుక్కలను తీసుకువెళ్లాలని జీహెచ్ఎంసీకి మొరపెట్టుకుంటున్నారు. వీధి కుక్కల నియంత్రణకు సీరియస్ యాక్షన్ తీసుకోవాల్సిన జీహెచ్ఎంసీ.. అందుకు భిన్నంగా ఖర్చుకు భయపడి వెనక్కి తగ్గుతోంది. కుక్కల నియంత్రణకు ఇతర రాష్ట్రాల్లోని మెట్రోపాలిటన్ సిటీల్లో జరుగుతున్న లాప్రోస్కోపీ సర్జరీలను ఇక్కడ కూడా పెంచాలని నిపుణులు సూచిస్తున్నప్పటికీ.. ఆ దిశగా బల్దియా అధికారులు ముందుకు రావడం లేదు. కొత్తగా మెషీన్లు కొనుగోలు చేయాల్సి ఉండటంతో ఖర్చు భరించలేక వెనక్కి తగ్గుతున్నట్లు తెలుస్తోంది.
ఇతర నగరాల్లో వందశాతం స్టెరిలైజేషన్
గ్రేటర్లో కుక్కల నియంత్రణకు అనేక చర్యలు తీసుకుంటున్నట్లు జీహెచ్ఎంసీ చెబుతున్నప్పటికీ రిజల్ట్ కనిపించడం లేదు. స్టెరిలైజేషన్ పక్కాగా చేస్తున్నామని అధికారులు గొప్పలు చెబుతున్నారు. కానీ క్షేత్రస్థాయిలో చూస్తే పరిస్థితులు వేరుగా ఉన్నాయి. దేశంలో ఇతర మెట్రోపాలిటన్ సిటీల్లో కుక్కల నియంత్రణకు లేటెస్ట్ టెక్నాలజీతో వందశాతం స్టెరిలైజేషన్ చేస్తుండటంతో ప్రతి ఏటా అక్కడ కుక్కల సంఖ్య తగ్గుతోంది. ఢిల్లీ, జైపూర్, బెంగళూర్, చెన్నై, ముంబయి, కలకత్తా తదితర సిటీల్లో పక్కాగా స్టెరిలైజేషన్ జరుగుతున్నట్లు వెటర్నరీ డాక్టర్లు చెబుతున్నారు. ఆ సిటీల్లో స్టెరిలైజేషన్ భాధ్యతలు ఎన్జీవోలకు అప్పగించడంతోనే రిజల్ట్ బాగా వస్తున్నట్లు చెబుతున్నారు. గ్రేటర్ హైదరాబాద్లో స్టెరిలైజేషన్ భాద్యతలను కేవలం 5 శాతం మాత్రమే ఎన్జీవోలు నిర్వహిస్తున్నాయి. మిగతా 95శాతం జీహెచ్ఎంసీనే స్వయంగా చేపడుతోంది.
తక్కువ సమయంలో ఎక్కువ సర్జరీలు
సిటీలో కుక్కల నియంత్రణకు జీహెచ్ఎంసీకి హై లెవల్ కమిటీ 26 అంశాలను సూచించింది. ఇందులో లేటెస్ట్ టెక్నాలజీ లాప్రోస్కోపీ ద్వారా సర్జరీ చేసేందుకు పైలట్ ప్రాజెక్టు చేపట్టాలని చెప్పింది. ఇలాగైతే ఎక్కువ సర్జరీలు చేయడంతో పాటు, సర్జరీ తర్వాత రెండ్రోజులకే కుక్కలను కేర్ సెంటర్ నుంచి బయటకు పంపే వీలుంటుంది. దీనివల్ల ఎక్కువ సర్జరీలు చేయవచ్చు. ఇతర అంశాలను వెంటనే అమలు చేస్తామని చెప్పిన మేయర్.. లాప్రోస్కోపీ సర్జరీల అంశంపై కౌన్సిల్ లో నిర్ణయం తీసుకొని ప్రభుత్వానికి ప్రపోజల్స్పంపుతామని చెప్పారు. అయితే, ఇదంతా జరిగేందుకు చాలా సమయం పట్టనుంది. సిటీలోని 5 సెంటర్లలో ఒక్కో లాప్రోస్కోపీ మెషీన్ పెడితే చాలా సర్జరీలు చేయవచ్చని వెటర్నరీ డాక్టర్లు చెప్తున్నారు.
ఎన్జీవోలకే బాధ్యతలు అప్పగించాలి
కుక్కల నియంత్రణకు స్టెరిలైజేషన్ ఒక్కటే మార్గం. ఇతర పట్టణాల తరహాలో సిటీలోనూ స్టెరిలైజేషన్ బాధ్యతలు వందశాతం ఎన్జీవోలకు అప్పగించాలి. దీనివల్ల మంచి రిజల్ట్ వస్తుంది. గ్రేటర్లో 95 శాతం జీహెచ్ఎంసీ ఈ బాధ్యతలు చేపడుతుండటంతో సర్జరీలు జరగడం లేదని జనాల్లో ఎన్నో అనుమానాలున్నాయి. మున్సిపాలిటీల్లోనూ దీనిపై ఫోకస్ పెట్టాలి.
–డాక్టర్ శ్రీనివాస్, వెటర్నరీ డాక్టర్, ఫిల్మ్ నగర్