- ఏళ్లుగా ముందుకు సాగని ప్రాజెక్టు పనులు
- అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో మళ్లీ తెరపైకి
- తాజాగా బీఆర్ఎస్ సమ్మేళనాల్లో లీడర్ల ప్రస్తావన..
ఆదిలాబాద్, వెలుగు: ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలం కుప్టీ గ్రామం వద్ద నిర్మించే ప్రాజెక్టుపై సర్కార్ ఎనిమిదేళ్లుగా నిర్లక్ష్యం వహిస్తోంది. నేతల హామీ కేవలం ప్రచార అస్త్రంగానే మిగిలుతోంది. స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చినా ఎలాంటి ముందడుగు పడటం లేదు. ప్రతి ఏడాది బడ్జెట్లో నిధులు కేటాయిస్తారని ఆశించినా.. భంగపాటు తప్పడం లేదు. ఈ ఏడాది ప్రవేశపెట్టిన బడ్జెట్లోనూ నిధులు కేటాయించలేదు. దీంతో జిల్లా వాసులు నిరాశకు గురవుతున్నారు. ఎన్నికల సమయంలోనే బీఆర్ఎస్ నేతలు కుప్టీ ప్రాజెక్టు కడతామంటూ ప్రజలకు హామీ ఇస్తూ వస్తున్నారు. తాజాగా బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాల్లోనూ మరోసారి ఈ ప్రాజెక్టు అంశంపై తెరపైకి వచ్చింది. బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు ప్రాజెక్టు గురించి త్వరలోనే శుభవార్త వింటారంటూ కామెంట్చేశారు. దీంతో ఎన్నిసార్లు చెప్పిన అంశాన్నే మళ్లీ మళ్లీ చెప్తారంటూ ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇలా ప్రతీసారి కుప్టీని ప్రచార అస్త్రంగానే వాడుతున్నారు కానీ.. పనులు చేయడం లేదంటూ ప్రజలు మండిపడుతున్నారు. ప్రాజెక్టు నిర్మాణ పనుల్లో ఎలాంటి ముందడుగు పడకపోవడంతో అటు కార్యకర్తల్లోనూ ఆందోళన నెలకొంది. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ప్రజల్లోకి వెళ్లాలంటే ప్రాజెక్టుపై స్పష్టమైన హామీ ఇస్తేనే ప్రచారం చేయగలుగుతామనే భావిస్తున్నారు.
కడెంకు అనుసంధానంగా..
కుప్టీ ప్రాజెక్టు ద్వారా నీళ్లు దిగువన ఉన్న నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టుకు చేరుకుంటాయి. గతేడాది వర్షకాలంలో కడెంకు భారీగా వరద నీరు రావడంతో ప్రాజెక్టు ప్రమాదంలో పడింది. ఒకవేళ కుప్టీ ప్రాజెక్టు పూర్తయి ఉంటే పరిస్థితి ఏర్పడేది కాదు. కుప్టీ ప్రాజెక్టు నిర్మిస్తే భారీ వర్షాలు పడ్డా కడెం ప్రాజెక్టుపై అంతగా భారం పడదు. అయితే కుప్టీ ప్రాజెక్టును కడెంకు అనుసంధానం చేయడం వల్ల కడెం ప్రాజెక్టుకు అవసరమైనప్పుడుల్లా ఈ ప్రాజెక్టుకు నీళ్లు వదిలేలా రూపకల్పన చేశారు. 5.30 టీఏంసీల సామర్థ్యంతో నిర్మించే ఈ ప్రాజెక్టు ద్వారా బోథ్ నియోజకవర్గంలోని దాదాపు కుమారి గ్రామ పంచాయతీ పరిధిలోని 2500 ఎకరాలు ముంపునకు గురయ్యే అవకాశాలున్నాయి. గతంలోనే అధికారులు సర్వే చేసి కుమారి, గాంధారి, రాయధారి, మల్కలపాడు గ్రామాలను ముంపు గ్రామాలుగా ప్రకటించారు. మొదట్లో రూ.900 కోట్లతో నిర్మాణ అంచనా వ్యయం ఉండగా.. సవరించిన డీపీఆర్ అంచనా ప్రకారం రూ. 1100 కోట్లకు పెంచారు. ఈ ప్రాజెక్టు పూర్తైతే 18 వేల ఎకరాల సాగునీరు అందుతోంది. దీంతో పాటు మూడు మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి, బోథ్, బజార్హత్నూర్, ఇచ్చోడ, నేరడిగొండ, కడెం మండలాలకు నిరంతరం తాగునీటి సదుపాయాన్ని కల్పించవచ్చు. ఈ ప్రాజెక్టు ద్వారా నిరంతరం నీటి సరఫరా ఉండటం వల్ల కుంటాల ప్రాజెక్టుకు సైతం నిత్యం జలకళ ఉంటుంది.
ప్రచారానికే పరిమితం..
బహుళ ప్రయోజనాల పేరిట కుప్టీ ప్రాజెక్ట్ నిర్మించాలనుకున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా కడెం ప్రాజెక్ట్‌కు సాగునీటిని అందించాలనే లక్ష్యంతో 2015లో ఈ ప్రాజెక్టును ప్రకటించారు. కేసీఆర్ కుప్టీ ప్రాజెక్టుపై హామీ ఇచ్చారు. ప్రతీ ఎన్నికల ప్రచారానికి వచ్చినప్పుడు, ఏదైనా బహిరంగ సభలకొచ్చినపుడు ప్రాజెక్టు ను ప్రస్తావిస్తున్నారు. గత అసెంబ్లీ, పార్లమెంట్ఎన్నికల ప్రచారానికి వచ్చిన సమయంలోనూ జిల్లాలో ఏర్పాటు చేసిన సభలో కేసీఆర్ ప్రాజెక్టుపై హామీ ఇచ్చారు. కానీ ప్రాజెక్టుకు నిధులు కేటాయించి, టెండర్లు పిలవడంలో జాప్యం చేస్తున్నారు.