ఉపాధి కూలీలకు నీళ్లూ లేవు.. నీడా లేదు

  •     ఉపాధి కూలీల వర్క్​స్పాట్స్​పై నిర్లక్ష్యం
  •     కలెక్టర్​ చెప్పినా నో ఛేంజ్


నిజామాబాద్, వెలుగు: ఉపాధి హామీ కూలీలకు పనిచేసే చోట నీడ కోసం టెంట్, తాగునీరు, ఓఆర్ఎస్​ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని కలెక్టర్ ​రాజీవ్​గాంధీ హన్మంతు ఆదేశాలు ఇచ్చినా.. గ్రౌండ్ లెవల్​లో అమలు కావడం లేదు. ఎండల జోరు, వడగాల్పులకు గ్రామాల్లో కూలీలు పనిచేయలేక వర్క్​స్పాట్స్​ నుంచి​త్వరగా వెళ్లిపోతున్నారు. ఫలితంగా వారికి కూలి డబ్బు గిట్టుబాటు కావడం లేదు. 

రోజూ 65 వేల కూలీలు..

పంట పొలాల కోతలు ముగిశాక గ్రామాల్లో కూలిలకు స్థానికంగా పని ఉండదు. అలాంటి వాళ్లు వలస వెళ్లకుండా నివారించేందుకు ఉపాధిహామీ పథకం అమలు చేస్తున్నారు. జిల్లాలో సుమారు 1.80 లక్షల జాబ్​కార్డులున్నాయి. 2.71 లక్షల కూలిలు తమ పేర్లు నమోదు చేసుకున్నారు. ఏవరేజ్​గా రోజూ 65 వేల మంది కూలీలు ఉపాధి పనులకు వెళ్తున్నారు.

సౌలత్​లు లేవు..

ఉపాధి కూలీలు ఉదయం 7 గంటలకు వర్క్​స్పాట్ కు​వెళ్తున్నారు.10 గంటల వరకు పని చేస్తే కనీసం రూ.150 కూలీ అందుతోంది. అయితే పనిచేసే చోట సౌలత్​లు లేక గంట ముందే ఇంటికి వస్తున్నారు. దీంతో వారికి రూ.వంద కూడా రావడం లేదు. పనిచేసే చోట కూలీలకు గాయాలైతే ట్రీట్​మెంట్​కోసం గతంలో హెల్త్​ డిపార్ట్​మెంట్​తరఫున ఫస్ట్​ఎయిడ్​ కిట్​లు ఏర్పాటు చేసేవారు. ఇప్పుడు ఎక్కడా కిట్​లు లేవు. గ్రామపంచాయతీల తరఫున టెంట్లు, తాగునీరు ఏర్పాటు చేయించాలని కలెక్టర్​ ఆదేశించినా, ఫండ్స్​ కొరతతో సర్పంచులు చేతులెత్తేస్తున్నారు.

మస్టర్ ​రోల్ ​చోట మొబైల్ ​సిస్టమ్​..

గతంలో కూలీల హాజరు, పని విలువను మస్టర్​రోల్​లో నమోదు చేసేవారు. ఈ విధానంలో అవినీతి జరుగుతోందని గుర్తించిన సర్కారు, ఆన్​లైన్ ​మొబైల్   ​మానిటరింగ్ ​సిస్టమ్ అమలు చేస్తోంది. ఇందులో ఉన్న టెక్నికల్ ​అంశాల వల్ల చెల్లింపులు ఆలస్యమవుతున్నాయి. రెండు నెలలైనా డబ్బులు 
అందడం లేదు.

రెండు నెలల నుంచి డబ్బులు రాలే..

ఎండతో భూమి గట్టిపడ్డది. గట్టిగ తొవ్వితే చేతులకు పొక్కులు వస్తున్నయ్. పొద్దున 8 గంటలకే ఎండ దంచికొడుతోంది. పనిచేసే జాగల సౌలత్​లు లేక జల్ది ఇంటికి పోతున్నమ్. రోజుకు వంద రూపాయలు కూడా వస్తలేవు. ఇచ్చే గీయిన్ని పైసలకు రెండు నెలలు దాటుతుంది.
–  రూప, ఒడ్యాట్​పల్లి