- భోజనం విషయంలో రాజీపడొద్దు.. కామన్ మెనూ అమలు చేయాలి : పొన్నం
- సమస్యలుంటే నా దృష్టికి తీసుకురావాలని ఆదేశం
హైదరాబాద్, వెలుగు: గురుకులాల్లో చదువుతున్న స్టూడెంట్లకు ఎలాంటి సమస్యలు రావొద్దని, మౌలిక వసతులు, భోజనం విషయంలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీస్కుంటామని అధికారులను మంత్రి పొన్నం ప్రభాకర్ హెచ్చరించారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి గురుకులాల్లో చేరే స్టూడెంట్లకు ఇవ్వాల్సిన యూనిఫామ్, ట్రంక్ పెట్టెలు, బెడ్లు సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. బీసీ సంక్షేమ శాఖ సెక్రటరీ, కమిషనర్, ఎంజేపీ గురుకుల సొసైటీ కార్యదర్శి, ఆర్సీవోలు, ప్రిన్సిపాల్స్, జిల్లా అధికారులతో బుధవారం మంత్రి పొన్నం జూమ్‌లో రివ్యూ మీటింగ్ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ‘‘చదువులో వెనుకబడిన స్టూడెంట్ల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. పదేండ్ల పాటు బీసీ సంక్షేమ శాఖ నిర్లక్ష్యానికి గురైంది. ఏడాది కాలంగా ఆ శాఖను చక్కదిద్దే ప్రయత్నాలు చేస్తున్నాం. ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలకు సహకారం అందిస్తున్న అధికారులకు అభినందనలు తెలియజేస్తున్న. మారుతున్న కాలానికి అనుగుణంగా స్మార్ట్ వర్క్ చేస్తూ బాధ్యతాయుతంగా ఉండాలి. ఏదైనా సమస్య ఉంటే.. కుటుంబంలో ఓ సభ్యుడిగా భావించి నా దృష్టికి తీసుకురండి. విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే మాత్రం సహించం. ఇచ్చిన బాధ్యతలు సక్రమంగా అమలు చేయాలి’’అని అధికారులను పొన్నం ఆదేశించారు.
బాధ్యతాయుతంగా పనిచేయాలి
విద్యార్థుల భవిష్యత్తు బాగుండాలంటే.. ప్రతి అధికారి బాధ్యతాయుతంగా పని చేయాలని మంత్రి పొన్నం సూచించారు. ‘‘ఎన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకుంటున్నా.. కొన్ని అవాంఛనీయ ఘటనలు జరగడం బాధాకరం. స్టూడెంట్ల భోజనం విషయంలో రాజీపడొద్దు. కామన్ మెనూ ప్రకారం భోజనం అందించాలి. అందుకు అవసరమైన వంట సామాన్లు, సరుకులు కొనుగోలు చేయాలి. ఆర్సీవోలు, జిల్లా అధికారులు తరుచూ గురుకులాలను తనిఖీ చేయాలి. ఎగ్జామ్స్ దగ్గరపడ్తున్నయ్.. స్పెషల్ స్టడీ అవర్స్ నిర్వహించాలి. మెరుగైన ఫలితాలు సాధించాలి. వచ్చే మూడు నెలలు ఎంతో ముఖ్యం. నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదు. అద్దె భవనాల్లో ఉన్న విద్యా సంస్థల్లో చిన్న చిన్న రిపేర్లు ఉంటే చేయించండి. మౌలిక సదుపాయాలు కల్పించలేని పరిస్థితి ఉంటే సంక్రాంతిలోగా వేరే బిల్డింగ్‌లో షిఫ్ట్ కావాలి. సొంత భవనాలు నిర్మించుకునేందుకు వీలుగా ప్రభుత్వ స్థలాలు ఉంటే పరిశీలించాలి’’అని అధికారులకు మంత్రి పొన్నం సూచించారు.
బీసీ సంక్షేమానికి పెద్దపీట
కాంగ్రెస్ పాలనలో బీసీ సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లు నిర్ధారించడానికి కుల గణన చేపట్టామన్నారు. ‘‘కుల గణనతో దేశానికే ఆదర్శంగా నిలిచినం. డెడికేటెడ్ కమిషన్‌ను ఏర్పాటు చేశాం. గత బీఆర్ఎస్ హయాంలో గురుకులాలు, హాస్టళ్లలో క్వాలిటీ ఫుడ్ లేక స్టూడెంట్లు ఇబ్బందులు పడ్డరు. అందుకే మేము అధికారంలోకి వచ్చాక డైట్, కాస్మోటిక్ చార్జీలు 40% పెంచినం. సీఎం రేవంత్ ఆధ్వర్యంలో బీసీ సంక్షేమ శాఖలో ఎన్నో మార్పులు తీసుకొచ్చాం. బడ్జెట్లో రూ.9,200.32 కోట్లు కేటాయించినం. నిరుడుతో పోలిస్తే రూ.2,971 కోట్లు ఎక్కువ. తాళ్లెక్కుతూ చనిపోయిన గీత కార్మికులను కాపాడుకునేందుకు 10 వేల మందికి కాటమయ్య కిట్లు పంపిణీ చేసినం. గురుకుల స్టూడెంట్లకు ట్రాఫిక్‌పై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నం. బీసీ హాస్టళ్లకు పక్కా భవనాల కోసం రూ.100 కోట్లు కేటాయించినం. బీసీ హాస్టళ్లకు ఫ్రీ కరెంట్ సప్లై చేస్తున్నం’’అని మంత్రి పేర్కొన్నారు.
విశ్వకర్మ స్కీమ్‌పై అవగాహన కల్పించండి
ఎంఎస్ఎంఈ ద్వారా కుల వృత్తుల వారికి ఆర్థిక సహాయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన విశ్వకర్మ స్కీమ్ గురించి అందరికీ అవగాహన కల్పించాలని అధికారులకు మంత్రి పొన్నం సూచించారు. ‘‘ప్రతి జిల్లా నుంచి 35వేల మంది లబ్ధిదారులను గుర్తించాలి. ఇప్పటికే నల్గొండ జిల్లా అధికారి 33వేల దరఖాస్తులు చేయించారు. ఎంతో అభినందనీయం. మిగిలిన జిల్లాల అధికారులు కూడా స్పీడ్‌గా లబ్ధిదారులను గుర్తించాలి. ఈ స్కీమ్ గురించి అవగాహన కల్పించడంలో వెనుకబడిన ఆఫీసర్లకు సంబంధించిన ఒక ఇంక్రిమెంట్ కట్ చేస్తాం’’అని మంత్రి పొన్నం హెచ్చరించారు. ఈ సమావేశంలో బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శి శ్రీధర్, కమిషనర్ బాల మాయాదేవి, మహాత్మా జ్యోతిబాపూలే గురుకుల విద్యా సంస్థల కార్యదర్శి బడుగు సైదులు పాల్గొన్నారు.
స్టూడెంట్లకు నాణ్యమైన భోజనం పెట్టాలి
సికింద్రాబాద్, వెలుగు: స్టూడెంట్లకు నాణ్యమైన భోజనం పెట్టాలని అధికారులను మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు. అన్ని చోట్ల కామన్ మెనూ అమలు చేయాలన్నారు. ఈ నెల 26వ తేదీలోపు స్టూడెంట్లకు ఐరన్ ర్యాక్స్, బెడ్లు అందజేస్తామని తెలిపారు. టెన్త్, ఇంటర్ పరీక్షలు దగ్గరపడ్తున్న నేపథ్యంలో అందరూ బాగా చదువుకోవాలని స్టూడెంట్లకు సూచించారు.
సికింద్రాబాద్ లాలాపేటలోని మహాత్మా జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాలను మంత్రి పొన్నం బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్పగా.. వెంటనే బోర్ వేయించాలని అధికారులను ఆదేశించారు. ఈ మేరకు అధికారులకు కీలక సూచనలు చేశారు. ‘‘పోటీ పరీక్షలకు కావాల్సిన పుస్తకాలను అందించాలి. అద్దె భవనాల్లో కొనసాగుతున్న వెల్ఫేర్ హాస్టల్స్, గురుకులాలకు 50శాతం అద్దె చెల్లించాం. పిల్లల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం’’అని పొన్నం అన్నారు. కిచెన్, డైనింగ్ హాల్ పరిశీలించారు. ఆయన వెంట కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి తదితరులు ఉన్నారు.