- లక్కీ డ్రా నిర్వహించి రెండు నెలలైనా పంపిణీ లేదు
- లబ్ధిదారులకు తప్పని ఎదురుచూపులు
- ఊసులేని రెండో విడత పంపిణీ
ఆదిలాబాద్, వెలుగు : ప్రభుత్వ పథకాలు అందాలంటే అర్హతే కాదు.. ముహూర్తం కూడా ఉండాలేమో.. ఆదిలాబాద్ జిల్లాలో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. డబుల్ బెడ్రూంలను ప్రారంభించేందుకు ఎమ్మెల్యేలకు టైం కుదరక రెండు నెలలుగా ఆలస్యం చేస్తున్నారు. దీంతో ఇండ్ల కోసం ఇప్పటికే ఎనిమిదేళ్లుగా ఎదురుచూసిన పేదలకు అవి చేతికి వచ్చేందుకు నిరీక్షణ తప్పడంలేదు. ఆదిలాబాద్ మున్సిపలిటీ పరిధిలోని 32 వార్డులకు సంబంధించి డబుల్ బెడ్రూం ఇండ్ల కోసం కలెక్టర్ అధ్యక్షతన లక్కీ డ్రా నిర్వహించారు. లబ్ధిదారులను ఎంపిక చేసినప్పటికీ ఇంత వరకు వారికి ఇండ్లను కేటాయించలేదు.
మొదటి విడతలో 618 మంది ఎంపిక
ఆదిలాబాద్ జిల్లాకు 2015-16 నుంచి విడతల వారీగా 3862 ఇండ్లు మంజూరయ్యాయి. 2291 ఇండ్ల టెండర్లు పూర్తి చేసి నిర్మాణాలు జరుగుతున్నాయి. వీటిలో కొన్నింటిని పూర్తిస్థాయిలో నిర్మించినప్పటికీ ఒక్క ఇంటిని కూడా ఇప్పటివరకు పంపిణీ చేయలేదు. కొన్ని మండలాలు, గ్రామాల్లో పూర్తైన ఇండ్లలో లబ్ధిదారులు వెళ్లి నివాసముంటున్నారు. కానీ అధికారికంగా వాటిని పంపిణీ చేయలేదు. ఈ క్రమంలో మొదటిసారిగా ఆదిలాబాద్ అర్బన్‌లో 982 ఇండ్ల పంపిణీకి అధికారులు గతంలో అర్హులను గుర్తించారు. మొదటి విడత ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో నిర్వహించిన లక్కీ డ్రాలో 618 మందిని ఎంపిక చేశారు. 32 వార్డులకు సంబంధించిన వారిని మాత్రమే పరిగణలోకి తీసుకొని రిజర్వేషన్ల ప్రకారం లక్కీ డ్రా నిర్వహించారు. వీరంతా తమకు డబుల్ బెడ్ రూం ఇండ్లు వచ్చాయని ఆనందంగా ఉన్నప్పటికీ అధికారులు ఆలస్యం చేస్తుండటంతో నిరాశ చెందుతున్నారు.
ఎన్నికల కోడ్ వస్తే అంతే..
మొదటి విడతలో ఆదిలాబాద్ పాత మున్సిపాలిటీ వార్డుల్లోని పేదలకు మాత్రమే ఇండ్ల కేటాయింపులు చేశారు. రెండో విడతలో విలీన గ్రామాల్లోని ఆదిలాబాద్ రూరల్, మావల మండలాల్లోని కాలనీలకు సంబంధించిన లబ్ధిదారులకు పంపిణీ చేయాల్సి ఉంది. రెండో విడతలో 364 ఇండ్ల కోసం 2365 దరఖాస్తులు రాగా పూర్తి విచారణ తర్వాత 758 మందిని అర్హులుగా గుర్తించారు. ఇప్పుడు మొదటి విడత ఇండ్ల పంపిణీతో పాటు రెండో విడత కోసం లక్కీ డ్రా నిర్వహించాల్సి ఉన్నప్పటికీ దానిపై ఊసే ఎత్తడం లేదు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాలతో పాటు ఎలక్షన్లకు సిద్ధమవుతున్న క్రమంలో అధికారులు తమ పనుల్లోనే బిజీగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో లబ్ధిదారులకు ఇండ్లను సమయానికి కేటాయించకపోతే ఎన్నికల కోడ్ వల్ల మళ్లీ ఇబ్బందులు తలెత్తే అవకాశాలు లేకపోలేదు. దీంతో త్వరగా ఇండ్లను పంపిణీ చేసి తమ కష్టాలు తీర్చాలని లబ్ధిదారులు కోరుతున్నారు.
త్వరలో పంపిణీ చేస్తాం..
గతంలో లక్కీ డ్రా నిర్వహించిన డబుల్ బెడ్రూంల పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నాం. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు త్వరలోనే అందిస్తాం. లక్కీ డ్రా తర్వాత మిగిలిన ఇండ్లకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న దరఖాస్తుల పరిశీలన సైతం పూర్తయ్యింది.
- సతీశ్ కుమార్, అర్బన్ తహసీల్దార్