- అన్నిపత్రాలు సబ్మిట్ చేసిన నెలల తరబడి అందట్లే
- కార్యాలయాల చుట్టూ చక్కర్లు కొడుతున్న జనం
- ప్రజావాణి లోనూ బర్త్, డెత్ సర్టిఫికెట్లు ఇవ్వడం లేదని ఫిర్యాదులు
- సర్కిల్ స్థాయిలో అధికారుల నిర్లక్ష్యం కారణంగా జనం ఇబ్బందులు
హైదరాబాద్, వెలుగు: బల్దియాలో బర్త్ , డెత్ సర్టిపికెట్లు టైమ్ కి అందడం లేదు. ఉన్నతాధికారుల కారణంగా సర్టిఫికెట్లు టైమ్‌కి పొందలేకపోతున్నారు. సర్టిఫికెట్ల ఫైల్స్హాస్పిటల్స్ నుంచి జీహెచ్ఎంసీ ఆఫీసులకు వెంటనే వస్తున్నప్పటికీ బల్దియా కార్యాలయాల్లోనే ఆలస్యం చేస్తున్నారు. ఈ సమస్య లేకుండా ఉండేందుకు అన్ని రకాల చర్యలు తీసుకున్నప్పటికీ సర్కిల్ స్థాయి అధికారుల నిర్లక్ష్యం కారణంగానే సర్టిఫికెట్లు అందడం లేదు. ప్రజలు రోజుల తరబడి ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నప్పటికీ సర్టిఫికెట్లు అందకపోతుండటంతో ఆందోళనకు గురవుతున్నారు. ఇతర జిల్లాల నుంచి వస్తున్న వారి పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఓ వ్యక్తి మరణించి నెలరోజులవుతున్నప్పటికీ సర్టిఫికెట్లు అందడం లేదు.
దూర ప్రాంతాలకు చెందిన వారు కనీసం ఐదారు సార్లు అయినా సర్టిఫికెట్ల కోసం హైదరాబాద్‌కు వచ్చి వెళుతున్నారు. డెత్ సర్టిఫికెట్ లేకపోతే ఇన్సురెన్స్‌లు, రైతు బీమా డబ్బులు క్లైమ్ కావు. దీంతో సర్టిఫికెట్లను తీసుకునేందుకు సిటిజన్స్‌తో పాటు ఇతర జిల్లాలకు చెందిన వారు బల్దియా ఆఫీసుల ముందు క్యూ కడుతున్నారు. బల్దియా అధికారులు క్షేత్ర స్థాయిలో పని చేయకపోతుండటంతో చాలా అప్లికేషన్లు పెండింగ్‌లో పడుతున్నాయి. ఈ సమస్యలపై జీహెచ్ఎంసీ అధికారులను అడిగితే ఎక్కడ సమస్య లేదని చెబుతున్నారు. కానీ సర్కిల్ అధికారులు పట్టించుకోకపోవడంతోనే ఈ సమస్య ఏర్పడుతుంది.
ఆలస్యంతో ఇబ్బందులు
బర్త్, డెత్ సర్టిఫికెట్లు ఆలస్యం అవుతుండటంతో జనం చాలా ఇబ్బందులు పడుతున్నారు. డెత్ సర్టిఫికెట్లు ఆలస్యం అవుతుండటంతో ఇన్సురెన్స్, రైతుబీమాలతో పాటు ఇతర పనులు కావడం లేదంటూ ప్రజలు వాపోతున్నారు. బర్త్ సర్టిఫికెట్లు త్వరగా రాకపోతుండంటంతో స్కూల్స్ లో అడ్మిషన్ల విషయంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ప్రధానంగా సర్టిఫికెట్లలో ఏదైనా తప్పులు పడితే వాటిని సవరించేందుకు నెలల తరబడి ఇబ్బంది అవుతోంది. ఇలాంటి సర్టిఫికెట్లు చాలా వరకు రిజెక్టు అవుతున్నాయి. అప్లికేషన్ లో ఏ సర్టిఫికెట్లు తక్కువ ఉన్నాయన్నది చూడకుండానే రిజెక్ట్ చేస్తుండటంతో మళ్లీ దరఖాస్తులు చేయాల్సి వస్తుంది. చివరకు సరైన రీజన్ తెలియడం లేదు. అధికారు లు ఇలా చేస్తుండటంతో ప్రజలకు ఇబ్బందులు ఎదురువుతుందని బల్దియా కార్యాలయాల్లో సిబ్బంది చర్చించుకుంటున్నారు.
ప్రజావాణిలోనూ ఫిర్యాదులు
బర్త్, డెత్ సర్టిఫికెట్లు టైమ్ కి జారీ కాకపోతుండటంతో ఓపిక నశించిన వారు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తుండగా, కొందరు ట్విటర్ ద్వారా ఫిర్యాదు చేస్తున్నారు. ఇంకొందరు ఇటీవల ప్రారంభించిన ప్రజావాణిలోనూ ఫిర్యాదు చేశారు. కొత్తగా ఏర్పడిన రాష్ట్ర ప్రభుత్వం ప్రజావాణికి చాలా ప్రయారిటీ ఇస్తుండటంతో జనం అదే బాటలో వెళుతున్నారు. బర్త్, డెత్ సర్టిఫికెట్లపై రానున్న రోజుల్లో ఫిర్యాదులు ఎక్కువయ్యే అవకాశం ఉంది. అంతలోపు అధికారుల్లో మార్పు వచ్చి సర్టిఫికెట్లు పెండింగ్‌లో లేకుండా చూస్తే సమస్యకు పరిష్కారం లభించనుంది.
నాగోల్ కి చెందిన 9 ఏళ్ల అనన్య లక్ష్మి గతేడాది ఏప్రిల్ 14న అనారోగ్యానికి గురికావడంతో స్థానికంగా ఉన్న సుప్రజ ఆస్పత్రికి తరలిస్తుండగా మరణించింది. అందుకు సంబంధించి ఆస్పత్రిలో సర్టిఫికెట్ తీసుకొని డెత్ సర్టిఫికెట్ కోసం కుటుంబ సభ్యులు దరఖాస్తు చేశారు. దీంతో పాటు మిగతా అన్ని పత్రాలు జత చేశారు. కానీ సంబంధిత హయత్ నగర్ సర్కిల్ అధికారులు ఆ దరఖాస్తపై విచారణ జరిపి రిజెక్ట్ చేశారు. ఇలా మూడుసార్లు రిజెక్టు చేస్తూనే వచ్చారు. దరఖాస్తు దారులు హెడ్ ఆపీసులో అధికారులను సైతం కలిశారు. ఉన్నతాధికారులు కూడా ఫైల్ అంతా కరెక్ట్ గానే ఉందని చెప్పిన సర్కిల్ అధికారులు చేయలేదు. చివరకు గత మూడ్రోజుల క్రితం మరోసారి ఫ్రెష్ గా అప్లయ్ చేసి అధికారిని ఎందుకు చేయడం లేదని ప్రశ్నిస్తే అప్పుడు అప్రూవల్ ఇచ్చారు.