భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: జిల్లా కేంద్రమైన కొత్తగూడెం మున్సిపాలిటీతో పాటు త్వరలో కలెక్టరేట్, ఎస్పీ ఆఫీసులు ఏర్పాటు కానున్న పాల్వంచ మున్సిపాలిటీలో స్ట్రీట్ లైట్లు వెలగడం లేదు. సెంట్రల్‌లైటింగ్, స్ట్రీట్ లైట్ల కోసం రూ.కోట్లు ఖర్చు పెడ్తున్నా చాలా ప్రాంతాలు చీకట్లోనే గడపాల్సి వస్తోంది. కొత్తగూడెం మున్సిపాలిటీలో స్ట్రీట్ లైట్ల కోసం నెలకు రూ. 2లక్షల వరకు ఖర్చు పెడుతున్నారు. అయితే పాడైన లైట్ల ప్లేస్‌లో కొత్తవి పెట్టేందుకు నెలల తరబడి వేచి చూడాల్సి వస్తోంది. పట్టణంలోని మెయిన్ రోడ్డుపై రూ. కోటి ఖర్చు పెట్టి ఏర్పాటు చేసిన సెంట్రల్ లైటింగ్ పని చేయడం లేదు.
మెయింటెనెన్స్ లేకనే..
కొత్తగూడెం పట్టణంలోని మెయిన్ రోడ్డుపై రూ. కోటి ఖర్చు పెట్టి ఏడాది కింద సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేశారు. రెండేండ్ల పాటు కాంట్రాక్టరే మెయింటెనెన్స్ చేయాల్సి ఉంది. అయితే లైట్లు వెలగకపోయినా పాలకులతో పాటు అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలున్నాయి. కలెక్టరేట్‌కు సమీపంలోని బస్టాండ్, పోస్టాఫీస్, సూపర్బజార్ఏరియాల్లో లైట్లు వెలగడం లేదు. గతంలో కోట్లు ఖర్చు చేసి ఏర్పాటు చేసిన హైమాస్ట్ లైట్లను ఇంధన పొదుపు పేరుతో తీసేసి రూ. కోటి ఖర్చు పెట్టి కొత్తగా ఎల్ఈడీ లైట్లను ఏర్పాటు చేశారు. అయినప్పటికీ ఎలాంటి ఫలితం లేకుండా పోతుందని అంటున్నారు. పాల్వంచ మెయిన్ రోడ్, రైల్వే అండర్ బ్రిడ్జిలో రాత్రంతా లైట్లు వెలగకపోయినా పట్టించుకోవడం లేదని అంటున్నారు. కొత్తగూడెంలో 2017లో 3,684 లైట్లు, 2018లో 900 ఎల్ఈడీ లైట్ల ఏర్పాటు కోసం ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీస్ లిమిటెడ్‌తో ఒప్పందం చేసుకున్నారు. వీటితో పాటు పట్టణ ప్రగతిలోనూ కొత్తగా లైట్లను ఏర్పాటు చేశారు. వీటి మెయింటెనెన్స్ కోసం నెలకు రూ. 2 లక్షలు మున్సిపాలిటీ ఆ సంస్థకు చెల్లిస్తోంది. సదరు సంస్థ మెయింటనెన్స్ సరిగా చేయడం లేదని కొన్నేండ్ల పాటు చెల్లింపులు నిలిపేశారు. డబ్బులు ఇవ్వకపోవడంతో పని చేయడం లేదని సంస్థ ప్రతినిధులు అంటుండగా, పని సరిగా చేయకపోవడం వల్లనే బిల్లులు ఇవ్వడం లేదని మున్సిపల్ ఆఫీసర్లు చెప్పుకుంటున్నారు. కొన్ని వార్డుల్లో కౌన్సిలర్లే తమ సొంత డబ్బులతో స్ట్రీట్ లైట్లు ఏర్పాటు చేసుకుంటున్నారు. ప్రతీ వార్డులో కనీసం 10 నుంచి 25 లైట్లు అవసరం ఉందని కౌన్సిల్ మీటింగ్‌లలో చెబుతున్నా పట్టించుకోవడం లేదని బీఆర్ఎస్, సీపీఐ కౌన్సిలర్లు వాపోతున్నారు. పన్నులు వసూలు చేస్తున్న మున్సిపల్ ఆఫీసర్లు సౌలతులు కల్పించే విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సంక్రాంతి వరకైనా స్ట్రీట్ లైట్లు వెలిగేలా చూడాలని కోరుతున్నారు.
రూ. 60 వేలు ఖర్చు చేసిన
రూ. 60 వేల సొంత డబ్బులతో మెటీరియల్ కొని స్ట్రీట్ లైట్లు ఏర్పాటు చేసుకున్నాం. పాలకులతో పాటు అధికారులకు సరైన ప్రణాళిక లేకపోవడంతో ప్రజలు తిప్పలు పడుతున్నారు.
- కె లీలారాణి, కౌన్సిలర్, కొత్తగూడెం
పోల్స్ వేసి లైట్లు పెట్టలే..
6 నెలల కిందట పోల్స్వేసి లైట్లను ఏర్పాటు చేయలేదు. అధికారులకు చెబితే వస్తాయని చెబుతున్నారు. కొన్ని పోల్స్‌కు లైట్లు ఇస్తే సొంత డబ్బులతో యాంగ్లర్స్ కొన్నాను.
- దామోదర్, వైస్ చైర్మన్,
కొత్తగూడెం మున్సిపాలిటీ