సర్కారు వైద్యానికి నిర్లక్ష్య చీడ : ఎ. శ్రీధర్

తెలంగాణలో బాలింతల మరణాలు వైద్య వ్యవస్థపై రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యానికి అద్దం పడుతున్నాయి. ఆ మధ్య కుటుంబ నియంత్రణ ఆపరేషన్​ చేయించుకున్న పాపానికి మహిళల ప్రాణాలు పోతే.. ఇటీవల వైద్యం వికటించి బాలింతలు చనిపోయారు. దీంతో వైద్యం కోసం సర్కారు దవాఖానలకు వెళ్లాలంటేనే భయపడే పరిస్థితి నెలకొంది. వైద్యరంగాన్ని ఎనిమిదేండ్లుగా నిర్లక్ష్యం చేసిన ప్రభుత్వం.. ఇప్పుడు ఎన్నికల ఏడాది హాస్పిటళ్లు, మెడికల్​ కాలేజీలు, కంటి వెలుగు పథకాల ప్రారంభాలతో వైద్యం కోసం ఎంతో కృషి చేసినట్లు హంగామా చేస్తున్నది. 115 ఏండ్ల చరిత్ర ఉన్న ఉస్మానియా ఆసుపత్రికి రూ.100 కోట్లు కేటాయించి నూతన భవనాన్ని నిర్మిస్తామని హామీ ఇచ్చి 8 ఏళ్ల గడుస్తున్నా ఇప్పటివరకు దాని ఉసేలేదు. 2014 తొలి బడ్జెట్ లో హైదరాబాద్ లోని ఈఎన్​టీ ఆసుపత్రికి రూ. 20 కోట్లు, మెటర్నటీ ఆసుపత్రికి రూ. 20 కోట్లు, సరోజినీ కంటి ఆసుపత్రికి రూ.20 కోట్లు, చెస్ట్ ఆసుపత్రికి రూ. 20 కోట్లు కేటాయించినట్లు పేర్కొన్న సర్కారు ఇప్పటివరకు నిధులు విడుదల చేయలేదు. వాటి అభివృద్ధి పట్టించుకోలేదు. 

వరుస ఘటనలు

రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో కొత్తగా డయాలసిస్ సెంటర్లను ఏర్పాటు చేసినా, వాటిని నడపడానికి కావాల్సిన  టెక్నీషియన్స్, డాక్టర్స్ పోస్టులను భర్తీ చేయలేదు. రంగారెడ్డి జిల్లాలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ వికటించి నలుగురు మహిళలు చనిపోయారు. ప్రభుత్వం దీనిపై విచారణ చేసి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోకపోగా, 30 మందికి ఆపరేషన్ చేస్తే కేవలం నలుగురు మహిళలు చనిపోయారని చెప్పి బాధ్యతారహితంగా చేతులు దులుపుకుంది. ఆ మధ్య నల్గొండ జిల్లాలో నిండు గర్భిణీ అఖిల కడుపుపై కాళ్లతో తొక్కి కాన్పు చేసి నర్సులు ఆమె చావుకు కారణమయ్యారని కుటుంబ సభ్యులు ఎంత ఏడ్చినా ఫలితం లేకుండాపోయింది. నాగర్ కర్నూల్ జిల్లా పదర మండలం వంకేశ్వరం గ్రామానికి చెందిన స్వర్ణ కాన్పు కోసం నాగర్ కర్నూల్ లోని ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్తే పట్టించుకోలేదు. గ్రామం నుంచి180 కిలోమీటర్ల దూరం ప్రయాణించి మహబూబ్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకున్నా, వైద్య అందక తల్లీ బిడ్డ ఇద్దరూ మరణించారు. దీన్ని రాష్ట్ర హైకోర్టు సుమోటోగా స్వీకరించింది. ఈ ఘటనలు ప్రజల ఆరోగ్యం పట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధిని తెలుపుతున్నాయి. నిన్నటికి నిన్న ఇద్దరు బాలింతలు మలక్​పేట ప్రభుత్వ ఆసుపత్రిలో డెలివరీ కోసం వెళ్లి మరణించారు. ఇంత జరుగుతున్నా తనకేమీ పట్టని వైద్యశాఖ ముఖ్య అధికారి ‘‘ముగ్గు సెల్ఫీ పంపండి బహుమతులు గెలుచుకోండి’’ అని ప్రజలకు పిలుపు నివ్వడం సిగ్గుచేటు. ఇప్పటికైనా ఆస్పత్రుల పరిస్థితిపై శ్రద్ధ పెట్టాలి.

ఇంకే మహిళా చనిపోకూడదు..

ఇంట్లో దీపం ఇల్లాలు అంటారు. అలాంటి మహిళ అర్ధంతరంగా చనిపోతే ఆ కుటుంబ మొత్తం ఆగమవుతుంది. పిల్లలు అనాథలవుతారు. వారి భవిష్యత్​ ప్రశ్నార్థకంగా మారుతుంది. ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లిన మహిళ.. వైద్యం వికటించి, నిర్లక్ష్యం కారణంగా మృతి చెందడాన్ని ప్రభుత్వం ఇప్పటికైనా సీరియస్​గా తీసుకోవాలి. ఇలాంటి ఘటన మరే ఆస్పత్రిలో జరగకుండా గట్టి చర్యలు తీసుకోవాలి. వైద్య శాఖ మంత్రి, అధికారులతో సమీక్ష జరిపి ఇలాంటివి జరగకుండా చర్యలు తీసుకోవాలి. సర్కారు వైద్యంపై విశ్వాసం కల్పించడం ఎంత ముఖ్యమో దాన్ని నిలబెట్టుకోవడమూ అంతే అవసరం.

- ఎ. శ్రీధర్, 
పాలమూరు జిల్లా