- ఏడాది కాలంలో జరిగిన ప్రమాదాల్లో 37 మంది మృతి
- ప్రమాదం జరిగినప్పుడే అధికారులు హడావిడి
- స్థానికులు కంప్లయింట్ చేసినా పట్టించుకోలేదు
- అధికారుల నిర్లక్ష్యంపై వ్యక్తమవుతున్న ఆగ్రహం
హైదరాబాద్/మెహిదీపట్నం, వెలుగు : నాంపల్లిలో జరిగిన అగ్నిప్రమాదానికి అడుగడుగునా బల్దియా అధికారుల నిర్లక్ష్యం కనిపిస్తుంది. ఇలాంటి ఘటనలు సిటీలో వరుసగా జరిగినా నివారణలో బల్దియా ఫెయిల్ అయింది. ముందుగానే స్థానికులు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోలేదు. ఎంతలా అంటే.. “ ఇండ్ల మధ్య కెమికల్ బిజినెస్ నడుస్తుంది. జనవాసాల మధ్య వందల కొద్ది డ్రమ్ములు ఏర్పాటు చేసి వ్యాపారం కొనసాస్తుండగా తమకు ఆటంకం కలుగుతుంది. కాలనీలో కెమికల్ వాసన భరించలేకపోతున్నాం. ”అంటూ నాంపల్లి ఘటనకు ముందు ఫిర్యాదు చేసినా నిర్లక్ష్యం చేశారని స్థానికులు వాపోయారు.
తమ ఫిర్యాదులపై జీహెచ్ఎంసీ సిబ్బంది స్పందించి ఉంటే ప్రమాదం జరిగేది కాదని ఆరోపించారు. కాలనీలోని అపార్టుమెంట్ ను 1998లో రమేశ్‌కుమార్ జైస్వాల్ అండ్ అదర్స్ పేరుతో 286 చదరపు గజాల్లో జీ ప్లస్ వన్ కు పర్మిషన్ పొందారు. దానిపై పెంట్ హౌస్ ని కూడా అక్రమంగా నిర్మించారు. 2008లో బీఆర్ఎస్ తో రెగ్యులరైజ్ చేసుకున్నారని బల్దియా సర్కిల్ –-12 టౌన్ ప్లానింగ్ అధికారి కృష్ణమూర్తి చెప్పారు.
ఆ తర్వాత మామూలే..
సిటీలో వరుసగా అగ్ని ప్రమాదాలు జరుగుతున్నా నియంత్రణకు పకడ్బందీ చర్యలు తీసుకోవడంలో బల్దియా ఫెయిల్ అయింది. ఏడాది కాలంలో సికింద్రాబాద్‌లో నాలుగు భారీ ఫైర్ యాక్సిడెంట్లు జరిగాయి. గత జనవరిలో సికింద్రాబాద్ దక్కన్ మాల్లో భారీ అగ్ని ప్రమాదం తర్వాత హడావుడి చేసిన ప్రజాప్రతినిధులు, బల్దియా అధికారులు ఆ తర్వాత సరిగా దృష్టిపెట్టలేదు. దాని తర్వాత సిటీలో దాదాపు పదికి పైగా అగ్ని ప్రమాదాలు జరిగాయి. తాజాగా నాంపల్లిలోని అపార్ట్ మెంట్ లో జరిగిన అగ్నిప్రమాదంలో 9 మంది మరణించారు. ఇలా వరుసగా జరుగుతున్న ప్రమాదాలు జనాలను భయాందోళనకు గురి చేస్తున్నాయి.
కమిటీ ఏమాయే..?
సిటీలో అగ్ని ప్రమాదం జరిగిన తర్వాత పరిశీలించేందుకు మంత్రులు, ఉన్నతాధికారులు వచ్చి చెప్పే మాట ఒక్కటే. మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటాం అని. దక్కన్ మాల్లో ఘటనప్పుడు ఇదే చెప్పారు. ఫైర్ యాక్సిడెంట్ల నివారణకు ఓ కమిటీని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. రెండు మీటింగ్‌లు పెట్టి హడావిడి చేసిన అధికారులు ఈవీడీఎం(ఎన్ఫోర్స్మెంట్ అండ్ విజిలెన్స్) ఆధ్వర్యంలో కేవలం అవేర్నెస్ప్రోగ్రామ్స్తో సరిపెట్టారు. సిటీలో ఎన్ని గోడౌన్లు ఉన్నాయి? ఎక్కడెక్కడ ప్రమాదకరంగా ఉన్నాయి..? వాటిపై బల్దియా ఆరా కూడా తీయలేదు. కఠిన చర్యలు లేకపోవడంతో ఫైర్ యాక్సిడెంట్లు జరుగుతూనే ఉన్నాయి. ఏడాది కాలంలో సిటీలో జరిగిన అగ్ని ప్రమాదాల్లో 37 మంది మరణించారు.
ప్రమాదాలు జరిగిన సమయంలో అన్ని వివరాలు సేకరించి సంబంధిత బాధ్యులపై చర్యలు తీసుకుంటామని నేతలు, అధికారులు హడావిడి చేశారు. గోడౌన్లపై సర్వే చేసి రిపోర్టు అందివ్వాలని అప్పట్లో మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ఆదేశించారు. ఆ తర్వాత రిపోర్టు రాలేదు. చర్యలు తీసుకోలేదు. వరుసగా అగ్ని ప్రమాదాలు జరిగిన సికింద్రాబాద్ జోన్లోనైనా చర్యలు చేపట్టలేదు. రెసిడెన్షియల్ బిల్డింగ్‌లను కమర్షియల్ గా వాడుతున్నట్లు అధికారుల దృష్టికి వెళ్లినా పట్టించుకోవడంలేదు. అనుమతులు ఇచ్చే సమయంలో కూడా పెద్దగా దృష్టిపెట్టడడం లేదు.
గతంలో జరిగిన ప్రమాదాలు
- 2022 మార్చి23న బోయగూడలోని ఓ టింబర్ డిపోలో జరిగిన అగ్ని ప్రమాదంలో 11 మంది మృతి.
- 2022 సెప్టెంబర్12న సికింద్రాబాద్‌లోని రూబీ లాడ్జిలో ఫైర్ యాక్సిడెంట్ జరిగి 8 మంది చనిపోయారు.
- ఈ ఏడాది జనవరి 29న దక్కన్ మాల్లో మంటలు చెలరేగి ముగ్గురు సజీవ దహనం.
- ఆ తర్వాత సికింద్రాబాద్ లోని స్వప్నలోక్ లో జరిగిన అగ్నిప్రమాదంలో 6 మంది చనిపోయారు.
- తాజాగా నాంపల్లిలో జరిగిన అగ్ని ప్రమాదంలో 9 మంది మృతి.
లెటర్లు రాసినా రాష్ట్ర సర్కార్ పట్టించుకోలేదు
సిటీలో తరచూ అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయని, వెంటనే నివారణ చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి లేఖలు రాశాం. అయినా పట్టించుకోలేదు. నాంపల్లి ప్రమాదం చాలా పెద్దది. చాలాబాధాకరమైనది. మృతుల కుటుంబాలకు ఆర్థికసాయం అందిస్తాం. జనవాసాల మధ్య కెమికల్ డ్రమ్ముల డంపింగ్ గోడౌన్ ఏర్పాటు చేయడం ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడడమే. ఇలాంటి పరిశ్రమలను వెంటనే సిటీ నుంచి తరలించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. కిషన్ రెడ్డి, కేంద్ర మంత్రి
కమిటీతో ఎంక్వైరీ చేయిస్తం
అగ్ని ప్రమాదం లో తొమ్మిది మంది మరణించడం చాలా దురదృష్టకరం. స్పెషల్ కమిటీ ఏర్పాటు చేసి విచారణ చేపడతాం. దోషులను శిక్షిస్తాం. ఆరు నెలల కిందటే ఇలాంటి సంఘటనలు జరగకుండా తగు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించాం. నాంపల్లి ఘటనలో చనిపోయిన వారికి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా రూ. 5 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా అందిస్తాం. గాయపడిన వారికి మెరుగైన వైద్యం చేయిస్తాం.
- కేటీఆర్, మంత్రి
బాధ్యులపై చర్యలు తీసుకుంటాం
నాంపల్లిలో జరిగిన అగ్ని ప్రమాదం ఘటన చాలా బాధాకరం. గాయపడిన బాధితులకు కార్పొరేట్ వైద్యం అందేలా చూస్తం . సిటీలో ఇలాంటి సంఘటనలు మళ్లీ చోటు చేసుకోకుండా మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటాం. ఈ ప్రమాద ఘటనపై విచారణ చేసి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటాం.
ALSO READ : ల్యాండ్ సీలింగ్ యాక్ట్‌కు మించి కేసీఆర్‌కు భూములు
- గద్వాల విజయలక్ష్మి, మేయర్
గోడౌన్లపై కంప్లయింట్ చేయండి
సిటీలో ఇళ్ల మధ్యలో ప్రమాదకరమైన గోడౌన్లు ఉంటే బల్దియా హెల్ప్ లైన్ నంబర్ 040-2111111కు కాల్ చేస్తే చర్యలు తీసుకుంటాం. నాంపల్లిలోని బజార్ ఘాట్ లో అగ్నిప్రమాదానికి కారణమైన కెమికల్ గోడౌన్ పై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదు. సిటీలో ఇళ్ల మధ్యలో ఏండే గోడౌన్లకు నోటీసులు ఇస్తున్నాం.
ప్రకాశ్‌రెడ్డి , ఈవీడీఎం డైరెక్టర్