
- వంటిమామిడి మార్కెట్ సిబ్బంది నిర్లక్ష్యం
- రూ. లక్షల్లో మార్కెట్ సెస్ ఎగవేత
సిద్దిపేట/ములుగు, వెలుగు : ములుగు మండలం వంటి మామిడి మార్కెట్ ఆదాయానికి వ్యాపారులు గండి కొడుతున్నారు. యార్డులో సెస్ చెల్లించాల్సివస్తుందని మార్కెట్ బయట రాజీవ్ రహదారి పక్కనే కొనుగోళ్లు చేస్తున్నారు. ఇది ఓపెన్ గానే జరుగుతున్నా మార్కెట్ సిబ్బంది పట్టించుకోవడం లేదు. సిద్దిపేట, మెదక్, యాదాద్రి భువనగిరి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలకు చెందిన రైతులు తాము పండించిన ఆకు కూరలు, కూరగాయలను ఇక్కడికి తెచ్చి అమ్ముకుంటారు. ఇక్కడ రైతుల నుంచి కూరగాయలు కొనేందుకు హైదరాబాద్, తదితర ప్రాంతాలకు చెందిన వ్యాపారులు పెద్ద ఎత్తున వస్తారు. ప్రతి రోజు రెండుపూటలా దాదాపు రెండు వేల మంది రైతులు కూరగాయలు అమ్ముకుంటారు.
యార్డులో వ్యాపారులు, కమీషన్ ఏజెంట్ల నుంచి ఒక శాతం మార్కెట్ సెస్ వసూలు చేస్తారు. బయటే అమ్మకాలు జరుగుతున్నా సిబ్బంది పట్టించుకోకపోవడం, అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో మార్కెట్ యార్డుకు రావాల్సిన ఆదాయానికి గండిపడుతోంది. ఇక్కడ రెగ్యులర్ కార్యదర్శి పోస్ట్ ఖాళీగా ఉంది. షాద్నగర్ మార్కెట్ కమిటీ కార్యదర్శి ఇన్చార్జీగా ఉండడంతో ఆయన ఇక్కడ టైమ్ కేటాయించలేకపోతున్నారు.
వాహనరశీదుల్లో చేతివాటం
వ్యాపారులు మార్కెట్ బయట రాజీవ్రహదారిమీద వెహికల్స్ పెట్టుకుని రైతులు తెచ్చిన కూరగాయలను కొంటున్నారు. ప్రతి రోజు మూడు నుంచి నాలుగు వందల మంది వ్యాపారులు ఇక్కడ నుంచి లక్షల విలువైన కూరగాయలు కొని బయట నుంచే హైదరాబాద్ తదితర చోట్లకు తరలించుకువెళ్తున్నారు. వీళ్లెవరూ సెస్ చెల్లించడంలేదు.
ఫలితంగా సర్కారు ప్రతిరోజూ వేలాది రూపాయల ఆదాయాన్ని కోల్పోతుంది. మార్కెట్ యార్డు లోకి వెళ్తున్న వాహనాల రశీదుల్లోనూ కొందరు సిబ్బంది చేతివాటాన్ని ప్రదర్శిస్తున్నారు. ఒక్కో వాహనం మార్కెట్ యార్డులోకి ప్రవేశిస్తే రూ. 50 వసూలు చేస్తారు. ప్రతి రోజు ఐదు నుంచి ఆరు వందల వాహనాలు యార్డుకు వస్తున్నా సగం వెహికల్స్కు మాత్రమే రశీదులు ఇచ్చి మిగతా డబ్బులు స్వాహా చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
రాజీవ్ రహదారిపై ట్రాఫిక్ జామ్
మార్కెట్ యార్డు బయట భారీ ఎత్తున అమ్మకాలు జరుగుతుండడంతో రాజీవ్ రహదారిపై ప్రతి రోజు ట్రాఫిక్ జామ్ ఏర్పడుతోంది. ఒక్కోసారి కిలో మీటర్ మేర వాహనాలు నిలిచిపొతున్నాయి. ప్రతి రోజు ఉదయం, సాయంత్రం వేళల్లో కూరగాయలను లోడ్ చేసుకునేందుకు వాహనాల్ని హైవే పక్కనే నిలుపుతుండడంతో చిన్న చిన్న ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. ట్రాఫిక్ ను క్లియర్ చేయడానికి పోలీసులు అవస్థలు పడాల్సివస్తోంది.
యార్డులోనే అమ్మకాలు జరిగేలా చూస్తాం
వంటి మామిడి మార్కెట్ యార్డులోనే కూరగాయల కొనుగోళ్లు జరిగేలా చర్యలు తీసుకుంటాం. గతంలో ఇలాంటి సమస్య ఏర్పడినప్పుడు వ్యాపారులను కట్టడి చేశాం. వాహనాల రశీదుల జారీ, మార్కెట్ సెస్ ఎగవేతపై కఠినంగా వ్యవహరిస్తాం. - రేవంత్, ఇన్చార్జీ మార్కెట్ సెక్రెటరీ