భద్రాద్రికొత్తగూడెం, వెలుగు :రేషన్ డీలర్ల నియామకంలో ఆఫీసర్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఏండ్లుగా ఖాళీగా ఉన్న షాపులకు డీలర్లను నియమించడం లేదు. కొత్తగా ఏర్పాటు చేసే వాటికి డీలర్ల పోస్టులు భర్తీ చేయకుండా రోజులు గడుపుతున్నారు. ఖాళీలతో పాటు కొత్త రేషన్ షాపులకు డీలర్లను నియామించాలని కలెక్టర్ అనుదీప్ ఆదేశించినా నెలలుగా పెండింగ్‌లోనే ఉంది. దీంతో ఏజెన్సీలోని పలు ప్రాంతాల్లో 3 నుంచి 8 కిలోమీటర్ల దూరం వెళ్లి రేషన్ తెచ్చుకోవాల్సి వస్తోంది. ప్రభుత్వం రేషన్ బియ్యాన్ని ఉచితంగా ఇస్తున్నా, బియ్యం కోసం ఒక రోజు కూలీ వదులుకోవడంతో పాటు ఆటోలకు రూ.30 నుంచి రూ.50 వరకు భరించాల్సి వస్తోంది.
డీలర్ల నియామకమెప్పుడో..
జిల్లాలో 442 రేషన్ షాపులున్నాయి. ఇందులో 27 షాపులకు డీలర్లు లేరు. వీటితో పాటు కొత్తగా 109 షాపులను ఏర్పాటు చేస్తూ అధికారులు ప్రతిపాదనలు తయారు చేశారు. ప్రజలకు అందుబాటులో ఉండేలా కొత్త షాప్‌లకు ప్రపోజల్స్ తయారు చేసిన ఆఫీసర్లు డీలర్లను నియమించకపోవడంతో పేదలకు దూరాభారం తప్పడం లేదు. పోస్టుల భర్తీతో కొంతమందికి ఉపాధి లభిస్తుందని ఆయా గ్రామాల్లోని నిరుద్యోగులు ఆశించారు. నిబంధనల ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లోని రేషన్ షాప్‌ల పరిధిలో 500 రేషన్ కార్డులు, మున్సిపాలిటీల పరిధిలో 600 నుంచి 700 రేషన్ కార్డులుండాలి. కానీ ఇందుకు విరుద్ధంగా కొన్ని షాపుల్లో రెట్టింపు రేషన్‌కార్డులున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. నిన్న మొన్నటి వరకు కిలో బియ్యం రూ.1 చొప్పున ఇచ్చారు. ప్రస్తుతం ఫ్రీగా ఇస్తున్నారు. ఏజెన్సీలోని పలు గ్రామాల్లో రేషన్ షాప్‌లు అందుబాటులో లేకపోవడంతో 10 కిలోల రేషన్ బియ్యం కోసం రోజు కూలీ దాదాపు రూ. 500 వరకు నష్ట పోవడంతో పాటు రూ.50 వరకు ఆటో చార్జీలు చెల్లించాల్సి వస్తుందని వాపోతున్నారు. రేషన్ కోసం 8 కిలోమీటర్ల దూరంలోని ముత్తాపురం వెళ్లాల్సి వస్తుందని గుండాల మండలం పాలగూడెం గ్రామస్తులు వాపోతున్నారు. పాలగూడెం నుంచి గుండాలకు ఆటో చార్జి 5కిలోమీటర్లకు రూ. 15 ఇవ్వాల్సిందె. ఫ్రీగా ఇచ్చే బియ్యానికి రాను పోను రూ. పోకలగూడెం జీసీసీకి 3 కిలోమీటర్లు నడిచి వెళ్లాల్సి వస్తోందని చండ్రుగొండ మండలం వెంకటయ్యతండా ప్రజలు చెబుతున్నారు.
ఆటో చార్జీలు రూ.35 అయితున్నయ్..
గుండాల నుంచి ముత్తాపురానికి 6 కిలోమీటర్లకు రూ. 12, పాలగూడెం నుంచి గుండాలకు 5 కిలోమీటర్లకు రూ.15 ఆటో కిరాయి అవుతోంది. బియ్యం ఫ్రీగా ఇస్తున్నా వాటిని తెచ్చుకోడానికి మాత్రం డబ్బులు ఖర్చు అవుతున్నాయి. ఒక పూట పనులన్నీ వదులుకుంటున్నాం.
- ఈసం రాజయ్య, పాలగూడెం, గుండాల
త్వరలో నోటిఫికేషన్ ఇస్తాం
జిల్లాలో ఖాళీగా ఉన్న షాపులతో పాటు కొత్తగా ఏర్పాటు చేయనున్న షాప్‌లకు డీలర్లను నియమించాల్సి ఉంది. త్వరలో ఆర్డీవో ఆధ్వర్యంలో నోటిఫికేషన్ వస్తుంది.
- మల్లికార్జున్. సివిల్ సప్లై ఆఫీసర్
కూలీ పోతుంది..
నాగారం నుంచి ముత్తాపురం షాపుకు పోయి బియ్యం తెచ్చుకోవాలి. 10 కేజీల బియ్యం కోసం 5 కిలోమీటర్లు పోవాలి. రెండు వాగులు దాటాలి. వానకాలంలో గుండాలకు పోయి అక్కడి నుంచి ముత్తాపురం పోవాలి. ఒక రోజు కూలీ రూ.500 పోతున్నాయి. బియ్యం తెచ్చుకోకుంటే కార్డు క్యాన్సిల్ అవుతుందని భయం.
- పర్షిక సావిత్రి, నాగారాం, గుండాల