- జేసీబీతో కాలువ తీసి కబ్జాకు తెరలేపిన అక్రమార్కులు
- అక్రమ కట్టడాల తొలగింపుపై ఆఫీసర్ల నిర్లక్ష్యం
- పత్తాలేని బయో ఫెన్సింగ్ ఏర్పాటు
నాగర్‌కర్నూల్, వెలుగు: జిల్లా కేంద్రంలోని కేసరి సముద్రం చెరువు ఆక్రమణకు తెరలేపారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల నివాసానికి కూతవేటు దూరంలో కేసరి సముద్ర శిఖంలో జేసీబీతో 500 మీటర్ల పొడవు కాలువ తీశారు. తమకు సంబంధం లేదని ఇరిగేషన్, మున్సిపల్ అధికారులు చేతులెత్తేశారు. చెరువు శిఖంలో వందల కోట్ల విలువ చేసే రెండున్నర ఎకరాల భూమిని కాజేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నా, గుర్తు తెలియని వ్యక్తుల చర్యగా పేర్కొంటూ ఆఫీసర్లు సైలెంట్‌గా ఉంటున్నారు.
అక్రమ కట్టడాలపై పట్టింపేదీ?
నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రం, ఉయ్యాలవాడ, ఎండబెట్ల, చెర్ల తిర్మలాపూర్, చెర్ల ఇటిక్యాల చుట్టూ దాదాపు 1,100 ఎకరాల వైశాల్యం గల కేసరి సముద్రం చెరువు కింద నాగర్ కర్నూల్, ఉయ్యాలవాడ, ఎండబెట్ల, చందాయిపల్లి, భీమారం, గగ్గలపల్లి, మల్కాపూర్, తాడూరు గ్రామాల పరిధిలోని 2,400 ఎకరాలకు సాగునీరు అందుతుంది. నాగర్‌కర్నూల్ జిల్లాగా మార డంతో ఇక్కడి భూములకు డిమాండ్ పెరిగింది. జిల్లా కేంద్రంంతో పాటు ఎండబెట్ల, ఉయ్యాలవాడ పరిసరాల్లోని చెరువు శిఖం, బఫర్ జోన్లో కబ్జాదారులు ప్లాట్లు చేసి అమ్ముకున్నారు.
దీనిపై మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి ఎన్జీటీని ఆశ్ర యించారు. 47 చోట్ల ఆక్రమణలు జరిగాయిని, ఇండ్లు, ఫంక్షన్ హాల్స్, ఫాం హౌజులు కట్టుకున్నారని ఆధారాలు సమర్పించారు. మున్సిపాలిటీ పరిధిలోని డ్రైనేజీ నీరు, ఇతర వ్యర్థాలను చెరువులోకి వదిలి కలుషితం చేస్తున్నారని రికార్డులు అందించారు. చెరువు ఆక్రమణలు, నీటి కాలుష్యంపై ఎన్జీటీ పూర్తి స్థాయి నివేదిక అందగానే ఆక్రమణలు తొలగించాలని నిపుణుల కమిటీ కలెక్టర్, ఇరిగేషన్, మున్సిపల్ అధికారులను ఆదేశించింది.
శిఖం, బఫర్ జోన్లో ఉన్న అక్రమ కట్టడాలపై ఉన్న స్టే తొలగించడానికి న్యాయ పరమైన చర్యలు తీసుకోవాలని, చెరువు శిఖం, బఫర్ జోన్ సరిహద్దులను గుర్తించి బయో ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని ఆదేశించింది. అలాగే పుట్నాల కుంట, సద్దల్సాబ్ కుంటల పరిరక్షణ, కబ్జాదారులపై చర్యలు తీసుకోవాలని ఏడాది కింద ఎన్జీటీ ఆదేశించినా జిల్లా యంత్రాంగం ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు.
మరో కబ్జాకు యత్నం..
తాజాగా ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి,ఎమ్మెల్సీ దామోదర్‌రెడ్డి ఇంటి సమీపంలో శిఖం భూమిలో కాలువ తీసిన కబ్జాదాలు దాదాపు రెండున్నర ఎకరాలకు ఎసరు పెట్టారు. దీనిపై తనకు సమాచారం లేదని మున్సిపల్ కమిషనర్ సమాధానమిస్తే, పోలీసులకు కంప్లైంట్ ఇచ్చామని ఇరిగేషన్ ఇంజనీర్లు దాటేశారు. వాళ్లు వాళ్లు మాట్లాడుకుంటామని వెళ్ళిపోయారన్నది పోలీసుల సమా ధానం. గత ప్రభుత్వ హయాంలో బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులకు భయపడి అధికారులు ఏం చేయలేదని అంటుండగా, ప్రభుత్వం మారిన తర్వాత కూడా కబ్జాలు కొనసాగడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఆక్రమణకు గురికాకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.