సూర్యాపేట, వెలుగు : సూర్యాపేట జిల్లాలో కస్టమ్ మిల్లింగ్ రైస్(సీఎంఆర్) సేకరించడంలో అధికారులు సీరియస్‌గా లేరనే ఆరోపణలు వస్తున్నాయి. సీఎంఆర్ విధించిన గడువు ఈనెల చివరి నాటికి ముగియనుంది. కానీ జిల్లాలో ఇంకా చాలా మిల్లులు నిర్ధేశించిన లక్ష్యానికి చాలా దూరంగా ఉన్నాయి. నెల కిందట సివిల్ సప్లయ్ డిపార్ట్మెంట్ హెచ్చరికలు చేస్తూ మిల్లర్లకు నోటీసులు జారీ చేసినా ఆశించిన ఫలితం కనిపించడం లేదు. మిల్లర్లకు రాజకీయ నాయకులు సపోర్ట్ చేస్తూ ఆఫీసర్లపై ఒత్తిడి చేస్తున్నట్లు తెలుస్తోంది.
నాలుగు సీజన్లవి మిల్లుల్లోనే..
జిల్లా వ్యాప్తంగా 72 రైసుమిల్లులు ఉన్నాయి. ఈ మిల్లులకు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ద్వారా రైతు ల నుంచి కొనుగోలు చేసిన వడ్లు మర ఆడించి తిరిగి ప్రభుత్వానికి అందించేందుకు కేటాయిస్తారు. కానీ గత 4 సీజన్‌లకు సంబంధించి ధాన్యం మిల్లుల్లోనే ఉండిపోయింది. 2020–21 యాసంగి సీజన్‌లో రైతుల నుంచి 6,68,740 మెట్రిక్‌టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి ఆయా రైసుమిల్లులకు కేటాయించా రు. మిల్లింగ్ చేసి ప్రభుత్వానికి 4,51,817 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ఇవ్వాల్సి ఉంది. కానీ ఇప్పటి వ రకు 4,43,006 మెట్రిక్ టన్నులే అప్పగించారు. 2021-–22లో వానాకాలం సీజన్‌లో 3,64,409 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మిల్లులకు కేటాయించా రు. ఇందులో తిరిగి 2,44,510 మెట్రిక్‌టన్నుల బియ్యాన్ని ఇవ్వాల్సి ఉండగా ఇప్పటివరకు 2,04,327 మెట్రిక్ టన్నులే అప్పగించారు. 2021–-22 యాసం గి సీజన్‌లో 2,14,953 మెట్రిక్ టన్నుల వడ్లను కేటాయిస్తే తిరిగి 1,46,136 మెట్రిక్ టన్నుల బి య్యాన్ని అప్పగించాలి. కానీ 91,578 మెట్రిక్‌టన్నుల తిరిగి ఇచ్చారు. 2022–-23 వానాకాలం సీజన్‌లోనూ 3,12,503 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని అప్పగిస్తే 2,09,377 మెట్రిక్‌టన్నుల బియ్యం అందించాలి. కానీ 14,341 మెట్రిక్‌టన్నుల బియ్యాన్నే అందిం చా రు. ఇలా సీజన్‌కు కొంత పెండింగ్ ఉంటూనే ఉంది.
గడువు ఎన్నిసార్లు పెంచినా...
2020–-21లో వానాకాలం సీఎంఆర్ బకాయి అందించేందుకు కొన్ని నెలల కిందటే గడువు ముగిసింది. ఈ సీజన్‌లో సీఎంఆర్ పెండింగ్ ఉన్న మిల్లులపై చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఉన్నా ఎలాంటి చర్యలు తీసుకోలేదనే ఆరోపణలు ఉన్నాయి. ఇక 2021-–22 ఖరీప్, యాసంగి సీజన్‌కు సంబంధించిన సీఎంఆర్ గడువు ఇది వరకే ముగిసింది. అయితే మిల్లుల యాజమాన్యాలు కోరిన నేపథ్యంలో మూడు సార్లు గడువును పొడిగించారు. అయినా లక్ష్యం పూర్తి కాలేదు. మళ్లీ ప్రభుత్వం ఈ నెల చివరి వరకు అవకాశం ఇచ్చింది. కానీ ఆశించిన ఫలితం మాత్రం కనిపించడం లేదు.
ఒత్తిడిలో అధికారులు!
సీఎంఆర్ తిరిగి ప్రభుత్వానికి అప్పగించాల్సిన మిల్లర్లు గత రెండు సీజన్ లలో పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో గతంలో మూడు మిల్లులలో దాదాపు రూ.100కోట్లకు పైగా అక్రమాలు జరిగినట్లు గుర్తించిన అధికారులు రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రకారం కేసులు నమోదు చేశారు. మరి కొన్ని మిల్లులలో సైతం ధాన్యం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. దీంతో కొంతమంది మిల్లర్లు రాజకీయ నాయకులను ఆశ్రయించి తమపై కేసులు లేకుండా, మిల్లులను బ్లాక్ లిస్ట్ లో పెట్టకుండా జాగ్రత్త పడ్డట్లు సమాచారం. జిల్లాలో 72 మిల్లులు ఉండగా ఇందులో 44 మిల్లులకు ఈ సీజన్‌లో ధాన్యం కేటాయించాలని మిల్లర్ల అసోసియేషన్ సిఫార్సు చేసింది. ఇందులో జిల్లా సివిల్ సప్లయ్ యంత్రాగం33 మిల్లులకు ధాన్యం కేటాయింపులు చేశారు. మిల్లర్స్ అసోసియేషన్ సిపార్సు చేసిన మిల్లుల్లో క్రిమినల్ కేసులు, సీఎంఆర్ అందించడంతో నిర్లక్ష్యంగా వ్యవహరించిన మిల్లులు కూడా ఉన్నాయనే ఆరోపణలు ఉన్నాయి. అయితే ఈ మిల్లులకు కేటాయింపులు చేయాలని పై స్థాయి నుంచి ఒత్తిళ్లు వస్తున్నట్లు తెలుస్తోంది. గత ఖరీప్ సీజన్‌లో కూడా ముందుగా 33 మిల్లులకు కేటాయింపులు చేసిన అధికారులు తరువాత వాటి సంఖ్యను 57కు పెంచారు. ఈ సీజన్‌లో కూడా ఇదే జరిగే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. దీంతో గడువు దగ్గర పడుతున్న కొద్దీ ట్యాగింగ్ చేయాలంటూ తమపై ఒత్తిడి పెంచుతున్నారని పలువురు ఆఫీసర్లు వాపోతున్నట్లు తెలుస్తోంది.