నిర్మించి మూడేండ్లైనా.. ఒక్క షెడ్డూ కేటాయించలే

నిర్మించి మూడేండ్లైనా.. ఒక్క షెడ్డూ కేటాయించలే
  • స్ట్రీట్ వెండర్స్​కు తప్పని తిప్పలు
  • కమీషన్ల కోసమే నిర్మాణాలా..?
  • ఎండలో ఎండుతూ...వానలో తడుస్తూ రోడ్డుపైనే బిజినెస్​
  • వీధి వ్యాపారులకు శాపంగా పాలకుల నిర్లక్ష్యం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పాలకుల నిర్లక్ష్యం స్ట్రీట్​ వెండర్స్​కు శాపంగా మారింది. జిల్లా కేంద్రమైన కొత్తగూడెంలో వీధి వ్యాపారుల సంక్షేమంలో భాగంగా రూ. కోటికి పైగా వెచ్చించి షెడ్లు నిర్మించారు. వీటిని అర్హులకు కేటాయించకపోవడంతో దాదాపు మూడేండ్లుగా నిరూపయోగంగా ఉన్నాయి. అసాంఘిక కార్యకలాపాలకు అడ్డగా మారి శిథిలావస్థకు చేరుతున్నాయి.  

భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు : జిల్లాలోని పట్టణాల్లో వ్యాపారం చేసుకునేందుకు సరైన స్థలం లేక, అద్దెకు షాపులు తీసుకోలేక చిరు వ్యాపారులు రోడ్డు పక్కన బిజినెస్​ చేసుకుంటున్నారు. ఓ వైపు ట్రాఫిక్​కు తీవ్ర అంతరాయం కలుగుతుందని పోలీసుల వేధింపులు, మరోవైపు వర్షంలో తడుస్తూ.. మండుటెండల్లో మాడుతూ కుటుంబాలను పోషించుకుంటున్నారు. షాపుల ముందు బుట్టలు, బండ్లు పెట్టుకోవడం వల్ల తరుచూ పెద్ద వ్యాపారులతో ఈసడింపులకు గురవుతున్నారు. మరికొందరు అద్దె చెల్లించి పెద్ద షాపుల ముందు వ్యాపారం చేసుకుంటున్నారు.

ఈ క్రమంలో జిల్లాలోని కొత్తగూడెం, ఇల్లెందు, పాల్వంచ మున్సిపాలిటీల్లోని ఖాళీ స్థలాల్లో దాదాపు మూడేళ్ల కిందట​ చిన్న రూమ్స్(షెడ్స్)​ నిర్మించారు. కొత్తగూడెం మున్సిపాలిటీలో 2,248 మంది, పాల్వంచలో 2,682 మంది, ఇల్లెందులో 1,014 మంది, మణుగూరులో 1,027 మంది స్ట్రీట్ వెండర్స్​ను గుర్తించారు. వీరిలో మెయిన్​రోడ్, ప్రధాన కూడళ్లలో వ్యాపారం చేసుకునే వారికి రూమ్స్​ను కిరాయికి ఇచ్చేలా ఆఫీసర్లు ప్లాన్ చేశారు. ఆ మేరకు ఇల్లెందు, పాల్వంచ మున్సిపాలిటీల్లో కొందరికి షెడ్స్​ కేటాయించారు. మూడేండ్లు గడుస్తున్నా మణుగూరులో ల్యాండ్​ సేకరణలోనే ఆఫీసర్లు ఉన్నారు. ఇక కొత్తగూడెం రూ.కోటికి పైగా వెచ్చించి కూరగాయల మార్కెట్, గవర్నమెంట్​ హాస్పిటల్​, త్రీటౌన్​ పోలీస్​ స్టేషన్​ రోడ్​లోని నేతాజీ మార్కెట్​ ప్రాంతాల్లో షెడ్స్​ నిర్మించారు. కానీ, ఏండ్లు గడుస్తున్నా స్ట్రీట్​ వెండర్స్​కు కేటాయించలేదు. 

ప్రణాళిక లేకుండా..!

కొత్తగూడెం గవర్నమెంట్​ హాస్పిటల్ సమీపంలో దాదాపు 15 షెడ్స్ నిర్మించారు. వీటిని నిర్మించి మూడేండ్లు కావస్తున్నా.. ఇప్పటివరకు ఒక్కరు  కూడా అక్కడ బిజినెస్ పెట్టింది లేదు. కూరగాయల మార్కెట్​సమీపంలో దాదాపు 50కిపైగా నిర్మించిన షెడ్లు ​స్ట్రీట్​ వెండర్స్​కు మున్సిపల్​ పాలకులు, అధికారులు కేటాయించకపోవడంతో అవి అసాంఘిక కార్యకలాపాలకు నిలయాలుగా మారాయి. నేతాజీ మార్కెట్​ ఏరియాలో ప్రణాళిక లేకుండా నిర్మించిన షెడ్స్​ను కొందరు పరిసర ప్రాంతాల్లోని వ్యాపారులు గోదాములుగా ఉపయోగించుకుంటున్నారు.

కమీషన్ల కోసమేనా..?

కేవలం తమ కమీషన్ల కోసమే హడావుడిగా షెడ్లు​ నిర్మించి పాలకులు వదిలేశారని ప్రజలు ఆరోపిస్తున్నారు. షెడ్లలోకి వెళ్లక ముందే నిర్మాణాలు శిథిలావస్థలకు చేరుతున్నాయంటున్నారు. షెడ్లలో వ్యాపారం చేసుకుంటే రోడ్డుకు ఇరువైపులా ట్రాఫిక్​ సమస్య కూడా కొంత మేర తగ్గుతుందని పోలీసులు పేర్కొంటున్నారు. ఇప్పటికైనా పాలకులు, ఉన్నతాధికారులు స్పందించి స్ట్రీట్ వెండర్స్​కు షేడ్లను​ కేటాయించే విధంగా చర్యలు తీసుకోవాలని పలువురు 
కోరుతున్నారు. ​