వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. పేదల కోసం సేవలందించే పెద్దాస్పత్రిలో సిబ్బంది నిర్లక్ష్యం కళ్లకు కట్టినట్టు కనిపిస్తోంది. వైద్యం కోసం ఆసుపత్రికి వచ్చిన రోగులకు సిబ్బంది చుక్కలు చూపిస్తున్నారు. ఇక చికిత్స కోసం వచ్చిన వృద్దుల పరిస్థితి అయితే వర్ణనాతీతం. తాజాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి ఎంజీఎం హాస్పిటల్ కు వైద్యం కోసం వచ్చిన వృద్ధుల పరిస్థితి.. ఆసుపత్రి డొల్లతనానికి అద్దం పడుతోంది.
నడవలేని స్థితిలో ఉన్న తన భార్యకు స్ట్రెచర్ కావాలని భర్త ఆసుపత్రి సిబ్బందిని అడిగినా.. వారు ఇవ్వకపోవడంతో భార్యను భుజంపై ఎక్కించుకొని మోసుకుంటూ వెళ్లాల్సిన దుస్థితి చోటు చేసుకుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన లక్ష్మి అనే వృద్ధురాలికి నెల రోజుల కిందట ఎంజీఎం ఆసుపత్రిలో వైద్యులు ఆపరేషన్ చేసి అరికాలు తొలగించారు. మళ్లీ నెల రోజులకు పేషేంట్ ను ఆసుపత్రికి తీసుకువచ్చి చెకప్ చేయించుకొమని డాక్టర్లు సూచించారు. దీంతో నేడు భర్త తన భార్యను ఆసుత్రికి ఆటోలో తీసుకువచ్చాడు. అయితే లక్ష్మికి చెకప్ చేయడానికి మే 12(ఈరోజు) వైద్యులు అందుబాటులో లేకపోవడంతో మే 13(రేపు) రావాలని అక్కడున్న సిబ్బంది చెప్పారు. దీంతో కాలు బాగోలేక, నడవలేని స్థితిలో ఉన్న భార్యను బయటకు తీసుకెళ్లేందుకు భర్త ఆసుపత్రి సిబ్బందిని స్ట్రెచర్ కావాలని అడిగాడు.
అయితే సిబ్బంది స్ట్రెచర్ ఇవ్వకపోవడంతో భార్యను తన భుజాలపై ఎక్కించుకొని మోసుకుంటూ బయటకు తీసుకు వెళ్లాడు భర్త. ఈ ఘటనపై అక్కడున్న రోగుల బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైద్య సిబ్బందికి కనీసం మానవత్వంతో కూడా లేదని అసహనం వ్యక్తం చేశారు.