దమ్మపేట,వెలుగు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం అల్లిపల్లి గ్రామానికి చెందిన మహిళ ఓ ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ వికటించి చనిపోయిందని గురువారం ఆమె బంధువులు డెడ్‌బాడీతో ధర్నా చేశారు. వివరాలిలా ఉన్నాయి.. గ్రామానికి చెందిన నందిని(25) అనే మహిళ కొంతకాలంగా కడుపునొప్పితో బాధపడుతూ వారం రోజుల కింద మండల కేంద్రంలోని ఓ నర్సింగ్ హోంలో ట్రీట్మెంట్ కోసం అడ్మిట్ అయింది. డాక్టర్లు పరీక్షలు నిర్వహించి కడుపులో గడ్డ (కణితి) ఉందని గుర్తించారు.
ఆపరేషన్ చేస్తే నయమవుతుందని చెప్పారు. కుటుంబ సభ్యులు అంగీకరించడంతో ఆపరేషన్ చేశారు. మూడ్రోజుల తర్వాత యూరిన్‌లో ఇన్ఫెక్షన్ సమస్య రావడంతో డాక్టర్లు ఖమ్మం తరలించారు. అక్కడి నుంచి హైదరాబాద్ తీసుకెళ్లగా చికిత్స పొందుతూ బుధవారం రాత్రి నందిని చనిపోయింది. డాక్టర్ నిర్లక్ష్యమే కారణమని దమ్మపేటలోని నర్సింగ్ హోం లో ముందు ఆందోళన చేపట్టారు.
పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో హాస్పిటల్ మేనేజ్మెంట్తో మాట్లాడి న్యాయం చేస్తామని గ్రామ పెద్దలు హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. మృతురాలి బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. కాగా, ఖమ్మంలో సరైన వైద్యం చేయకపోవడంతోనే పేషెంట్ నందిని పరిస్థితి విషమించిందని నర్సింగ్‌హోం మేనేజ్మెంట్ వివరణ ఇచ్చింది.