కట్టి న్రు.. వదిలేసిన్రు

బెల్లంపల్లి,వెలుగు: ప్రజా ప్రతినిధుల నిర్లక్ష్యం, అధికారుల అలసత్వం కారణంగా బెల్లంపల్లిలో దాదాపు  రూ.12 కోట్లతో నిర్మించిన 100 బెడ్స్​ ఏరియా హాస్పిటల్​ ప్రారంభానికి నోచుకోవడం లేదు.  రెండు సంవత్సరాల క్రితం ప్రారంభమైన ఆసుపత్రి  పనులు  మూడు నెలల క్రితమే పూర్తయ్యాయి. అయినా భవనం అందుబాటులోకి తీసుకురావడంలేదు. ఆసుపత్రి ప్రారంభం విషయమై ఇటు ప్రభుత్వం.. అటు వైద్య విధాన పరిషత్ స్పష్టత ఇవ్వకపోవడం రోగులు ట్రీట్మెంట్​ కోసం దూరప్రాంతాలకు వెళ్తున్నారు.

రోజుకు 400 ఓపీ..

ప్రస్తుతం వైద్యావిధాన పరిషత్ ఆధ్వర్యంలో 30 పడకల కమ్యూనిటీ హెల్త్ సెంటర్  కొనసాగుతోంది. రోజుకు ఈ ఆసుపత్రికి ఆసిఫాబాద్, రెబ్బెన, తిర్యాణి, దహెగాం, తాండూర్, కన్నెపల్లి, భీమిని, వేమనపల్లి, నెన్నెల, కాసిపేట, బెల్లంపల్లి టౌన్, రూరల్  ప్రాంతాలకు చెందిన  సుమారు 400 మంది పేదలు చికిత్స కోసం వస్తుంటారు. సరైన వైద్యం, సౌకర్యాలు లేని కారణంగా చాలామంది దూరప్రాంతాల్లోని ప్రవేట్ ​హాస్పిటళ్లకు వెళ్తున్నారు. ఉన్నదంతా ఊడ్చి చికిత్స చేయించుకుంటున్నారు. ప్రస్తుతం కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లో రోగుల తాకిడి పెరగడం.. సరిపడా వైద్యులు లేకపోవడం ఇబ్బందిగా మారింది. ఇప్పటికైనా కలెక్టర్, వైద్య విధాన పరిషత్ అధికారులు, ఎమ్మెల్యే స్పందించి పెద్ద హాస్పిటల్​ అందుబాటులోకి తీసుకురావాలని పేదలు కోరుతున్నారు.