హనుమకొండ, వెలుగు: వరంగల్ కమిషనరేట్‌లో ట్రాఫిక్ పోలీసుల నిర్లక్ష్యం..వాహనదారులను ఇబ్బందులకు గురి చేస్తోంది. సర్కారు ఆదాయం పెంచేందుకు ట్రాఫిక్ పోలీసులకు టార్గెట్లు విధిస్తుండంతో.. వాళ్లు ఇష్టానుసారంగా వెహికల్స్ ఫొటోలు తీసి ఫైన్లు వేస్తున్నారు. చలాన్లు జనరేట్ చేసే సమయంలో బండి నెంబర్లు తప్పుగా ఎంటర్చేస్తుండడంతో తప్పు ఒకరిదైతే.. ఫైన్ మాత్రం ఇంకొకరికి పడుతోంది. ఈ సమస్యను ఆఫీసర్ల దృష్టికి తీసుకెళ్లినా పరిష్కారం కాకపోవడంతో.. పెండింగ్ చలాన్లు భారీగా పేరుకుపోతున్నాయి.
టార్గెట్ల కోసం..
వరంగల్ కమిషనరేట్పరిధిలో హెల్మెట్ లేని వారికి, రాంగ్ రూట్, ట్రిపుల్ డ్రైవింగ్, అనాథరైజ్డ్ పార్కింగ్, డేంజరస్ డ్రైవింగ్ ఇలా వివిధ కారణాలతో ట్రాఫిక్ పోలీసులు ఫైన్లు వేస్తున్నారు. ఆదాయం పెంచేందుకు ట్రాఫిక్ కానిస్టేబుళ్లు, ఎస్సైలకు పెద్దాఫీసర్లు టార్గెట్లు పెట్టినట్లు తెలుస్తోంది. ట్రాఫిక్ సిబ్బందికి ఏరియాను బట్టి డైలీ 100 నుంచి 300 వరకు ఫైన్లు జనరేట్ చేయాలనే ఆదేశాలు ఉండడంతో సిబ్బంది ట్యాబ్‌లు, కెమెరాలు, సెల్ ఫోన్లలో ఇష్టమొచ్చినట్లు ఫొటోలు కొడుతున్నారు. నిరుడు స్పాట్చాలాన్లు, ఈ–చాలాన్లు అన్నీ కలిపి 7.5లక్షల ఫైన్లు విధించగా.. ఇప్పుడు నెలకు లక్ష చలాన్లు వేస్తున్నారు.
కంప్లైంట్ చేసినా నో యాక్షన్..
ఫొటోలు కొట్టి ఫైన్లు వేస్తున్న ట్రాఫిక్ పోలీసులు.. వాటిని ఈ–చలాన్ సైట్లో అప్ లోడ్ చేసే క్రమంలో తప్పులు చేస్తున్నారు. దీంతో ఒక బండికి పడాల్సిన ఫైన్ ఇంకో బండికి పడుతోంది. కొంతమంది బండి నెంబర్ ప్లేట్లను ట్యాంపరింగ్చేస్తున్నారు. నెంబర్ ప్లేట్ మీద కొన్ని అక్షరాలను చెరిపేయడం.. ఇంకొన్ని అక్షరాలను మార్ఫింగ్ చేస్తుండడంతో రాంగ్ ఫైన్లు జనరేట్ అవుతున్నాయి. ఇలాంటి ట్యాంపరింగ్ చేసిన వెహికల్స్ కు పడాల్సిన ఫైన్లు తమకు పడుతుండటంతో అసలు ఓనర్లు సఫర్ అవుతున్నారు. దీనిపై బాధితులు ఆన్ లైన్‌తోపాటు కంట్రోల్ రూంలోనూ ఫిర్యాదు చేస్తున్నారు. కానీ వాటిని పట్టించుకునే నాథుడే లేడు. ఇకనైనా ట్రాఫిక్ పోలీసులు స్పందించి, రాంగ్ ఫైన్లను తొలగించాలని వాహనదారులు కోరుతున్నారు.
టీఎస్ 03 ఈడబ్ల్యూ 4151 నెంబర్ గల స్కూటీ హనుమకొండకు చెందిన అజ్మీరా శ్రీరామ్ నాయక్ ది. ఈ నెల 15న హెల్మెట్ లేని కారణంతో కేయూ క్రాస్‌వద్ద పోలీసులు ఫైన్ వేసినట్టు ఆయనకు మెసేజ్వచ్చింది. దీంతో ఆయన ఈ–చలాన్ సైట్ లో చెక్ చేయగా.. ట్రాఫిక్ పోలీసుల తప్పిదంతో వేరే పల్సర్ బడికి పడాల్సిన ఫైన్ ఇతని స్కూటీకి పడినట్లు తేలింది. ఆన్ లైన్ లో చెక్ చేయగా.. ఈ కింద ఉన్న పల్సర్ బైక్ ఫొటో కనిపించింది. టీఎస్ 03 ఈజడ్ 7322 నెంబర్ కలిగిన ఈ టీవీఎస్ బండి వరంగల్ నగరానికి చెందిన ఆరెల్లి ఎల్లయ్యది. దివ్యాంగుడైన ఆయన టీవీఎస్ బండికి మరో రెండు చక్రాలు బిగించుకుని దాని మీదే రోజూ పండ్ల బేరం చేస్తుంటాడు. కాగా వరంగల్ ట్రాఫిక్ పోలీసుల నిర్లక్ష్యం కారణంగా వేరే స్కూటీకి పడాల్సిన ఫైన్ఎల్లయ్య బండికి పడింది. చలాన్ మెసేజ్ చూసుకుని కంగు తిన్నాడు.