శాంతియుత పోరాటాలకు మండేలా స్ఫూర్తి

శాంతియుత పోరాటాలకు మండేలా స్ఫూర్తి

శాంతియుత పోరాటాలకు అణచివేత పెరిగిన ప్రతీచోట పోరాటం పుడుతుంది. హక్కుల కోసం శాంతియుతంగా, సుదీర్ఘంగా పోరాడేవారు చాలా అరుదు. 1963లో న్యాయస్థానంలో ‘ఐయామ్ ప్రిపేర్డ్ టు డై’ అంటూ మొదలు పెట్టిన ఆయన ప్రసంగం దక్షిణ ఆఫ్రికాలో ఆనాటి ప్రభుత్వం అనుసరిస్తున్న జాతి వివక్షత, వర్ణవివక్షత విధానాలను యావత్ ప్రపంచం ముందు బహిర్గతం చేసింది. ఆయనెవరో కాదు నల్లజాతి సూరీడు నెల్సన్ మండేలా. 1918  జులై18 న మెవ్ జో లో జన్మించిన ఆయన.. పదేళ్ల వయసులోనే తండ్రిని కోల్పోయి.. పశువుల కాపరిగా ఉంటున్న సమయంలో ‘వాల్టర్ సిస్లూ’ పరిచయంతో ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీకి పరిచయం అయ్యాడు. 


సుమారు17వ శతాబ్దం నుంచి డచ్, ఈస్ట్ ఇండియా కంపెనీ, తదుపరి బ్రిటీష్ వారు వెనుకబడిన దేశాల వారికి ‘నాగరికత నేర్పుతాం’ అనే పేరుతో అనేక దేశాలను, జాతులను నిర్మూలన చేస్తూ వచ్చాయి.  1910 మే 31వ తేదీన ‘యూనియన్ ఆఫ్ సౌత్ ఆఫ్రికా’ ఏర్పాటు చేసుకుని, అక్కడ నల్లజాతి ప్రజలను జాతి వివక్షత పేరున అతిహీనంగా పరిగణిస్తూ పరిపాలన కొనసాగించారు.‌‌‌‌ నల్లజాతి వారికి ‘ఓటు హక్కు’ లేకుండా, నైపుణ్యం గల ఉద్యోగాలు ఇవ్వకుండా పెత్తనం చెలాయించారు.


ఏఎన్సీకి ఉపాధ్యక్షుడిగా..


నల్లజాతీయుల హక్కుల కోసం‘ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ (ఏఎన్సీ) ఏర్పడింది. అందులో యువ నాయకుడుగా ఎదుగుతున్న నెల్సన్, అప్పటి ప్రభుత్వం తీసుకువచ్చిన విభజించు -పాలించు విధానానికి వ్యతిరేకంగా పోరుబాట పట్టాడు. ముందుగా సహాయ నిరాకరణ, తదుపరి సమ్మెకు పిలుపు ఇచ్చి జయప్రదం చేశాడు. దీంతో మండేలా పేరు మిన్నంటి, 1952లో ఏయన్ సీ కి ఉపాధ్యక్షుడు అయ్యారు. వివిధ అభియోగాలు మోపి మండేలా ను తొమ్మిది నెలల జైలులో పెట్టారు. తదుపరి1955 జూన్ 26న ‘జోహెన్స్​బర్గ్’లో పెద్ద బహిరంగ సభ నిర్వహించి, హక్కుల పత్రం(ది ఫ్రీడమ్ చాప్టర్) ప్రవేశపెట్టి, ఆమోదముద్ర పొందారు.

దీంతో ప్రభుత్వం మరోసారి అభియోగాలు మోపి, మండేలాతోపాటు 122 మందిని జైలులో పెట్టింది. ప్రభుత్వంపై మరింత ఒత్తిడి పెంచేందుకు, ఇతర వర్ణాల వారికి ప్రాతినిధ్యం వహించే పార్టీలతో చేతులు కలపాలని మండేలా నిర్ణయం తీసుకున్నారు. కొంతమంది పార్టీ నుంచి వేరై, ‘పాన్ ఆఫ్రికన్ కాంగ్రెస్’ గా ఏర్పాడ్డారు. ‘కొత్త రాజ్యాంగం’ రూపొందించాలని ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చారు. ప్రభుత్వం దాన్ని కర్కశంగా అణచివేసింది. మండేలాపై తీవ్ర నేరాలు మోపి‌‌‌‌, యావజ్జీవ శిక్ష పడేటట్లు చేసి, 42 సంవత్సరాల వయసులో ‘రొబెన్’ దీవిలో  కిటికీ కూడాలేని చిన్నగదిలో 18 ఏండ్లు ఖైదీగా ఉంచారు. అందులో హింస, తదితర అవమానాలు ఆయన బయోగ్రఫీ ‘లాంగ్ వాక్ టు ఫ్రీడమ్’ చూస్తే తెలుస్తాయి. 1976 నుంచి అంతర్జాతీయంగా పరిణామాలు మారుతూ వచ్చాయి. దక్షిణాఫ్రికా శ్వేత ప్రభుత్వం పై ఒత్తిడులు పెరగటం మొదలైంది. జైలులో ఉండగానే మండేలాకు ‘లెసెత్’ ప్రభుత్వం గౌరవ డాక్టరేట్ ప్రకటించింది. 1979లో మన భారతదేశం అవార్డు ఇచ్చింది.‌‌‌‌ ఈ సమయంలోనే మండేలా కు మద్దతుగా దక్షిణాఫ్రికా లో ‘ఫ్రీ నెల్సన్ మండేలా’ పిలుపు ఊపందుకుంది.

1988, జూలై 18న మండేలా 70వ జన్మదినాన్ని లండన్ వెంబ్లే స్టేడియంలో ఘనంగా నిర్వహించారు. దాంతో ‘చీకటి ఖండంలో వెలుగు సూర్యుడు’ ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందాడు. ప్రపంచ వ్యాప్తంగా వస్తున్న పరిణామాలు దృష్టిలో ఉంచుకుని కొత్తగా బాధ్యతలు చేపట్టిన  ఎఫ్. డబ్యు. క్లార్క్1990లో అనేక సంప్రదింపులు జరిపి ఫిబ్రవరి 11న సగౌరవంగా విడుదల చేయించారు. మండేలా తన 27 సంవత్సరాల జైలుశిక్ష అనుభవించి, 72 సంవత్సరాల వయసులో విడుదలయ్యారు.1994లో ప్రజాస్వామ్య బద్ధంగా జరిగిన ఎన్నికల్లో ఏయన్ సీ పార్టీ విజయం సాధించి, దక్షిణాఫ్రికా దేశానికి కొత్త అధ్యక్షుడుగా నెల్సన్ మండేలా బాధ్యతలు చేపట్టారు. 1990లో భారతదేశం ‘భారతరత్న’ పురస్కారంతో సత్కరించింది. ఇదే సంవత్సరం రష్యా లెనిన్ పీస్ ప్రైజ్ అందించారు. 1993లో క్లార్క్ తో కలిసి ‘నోబెల్ శాంతి బహుమతి’ అందుకున్నారు. అణగారిన ప్రజలకు ఆపన్నహస్తం అందిస్తూ, 20వ శతాబ్దంలో అత్యంత శక్తిమంతుల జాబితాలో చేరిన నెల్సన్ రోలిలహ్లా మండేలా 103వ జన్మదినాన్ని స్మరిస్తూ... ఐక్యరాజ్యసమితి జులై 18వ తేదీని ‘మండే లా డే’ గా నిర్వహించాలని నిర్ణయించింది. 


- ఐ. ప్రసాదరావు, 
సోషల్​ ఎనలిస్ట్