కోరుట్లలో పోలీసుల అసమర్థత వల్లే దాడి : బాలూనాయక్​ 

దేవరకొండ, వెలుగు:  పోలీసుల అసమర్థత వల్లే బీఆర్ఎస్​ గుండాలు కోరుట్ల గ్రామంలోని కాంగ్రెస్​ కార్యకర్తలపై గొడ్డళ్లు, కత్తులతో దాడికి యత్నించారని  కాంగ్రెస్​ అభ్యర్థి నేనావత్​ బాలూనాయక్​ఆరోపించారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ..  కాంగ్రెస్‌ పార్టీ తరఫున మండల ఏజెంట్ అయిన జాలె నర్సింహారెడ్డి పోలింగ్‌ సరళి పరిశీలించేందుకు వెళ్లగా  కోరుట్ల సర్పంచ్​మల్లారెడ్డి దాడి చేసేందుకు యత్నించాడని మండిపడ్డారు.  

విషయం తెలుసుకున్న నర్సింహారెడ్డి సోదరుడు జాలె తిలక్​రెడ్డి, కొందరు కార్యకర్తలతో కలిసి కోరుట్లకు వెళ్తే..  బీఆర్​ఎస్​ గుండాలు గొడ్లళ్లు, కత్తులతో వారిని చంపేందుకు యత్నించారని ఆరోపించారు.  కోరుట్లలో పోలింగ్​ ప్రశాంతగా జరిగే పరిస్థితి లేదని, వెంటనే చర్యలు తీసుకోవాలని తాను పోలీసులు, ఆర్‌‌వోకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని వాపోయారరు. పోలీసులు బీఆర్‌‌ఎస్‌ నాయకులకు తొత్తులుగా పనిచేస్తున్నారని, తమకు నష్టం చేసిన పోలీసులను వదిలి పెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. తాను 20 వేల మెజార్టీతో గెలువబోతున్నానని ధీమా వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో మున్సిపల్​ చైర్మన్​ ఆలంపల్లి నర్సింహ్మ, ఎంపీపీ జాన్​యాదవ్, పార్టీ  మండల అధ్యక్షుడు లోకసాని శ్రీధర్​రెడ్డి తదితరులు పాల్గొన్నారు.