- నియోమ్ ఫ్యూచర్ సిటీకి భూసేకరణపై సౌదీ ప్రభుత్వం ఆదేశం
రియాద్: సౌదీ అరేబియా కలల ప్రాజెక్ట్ నియోమ్ స్మార్ట్ సిటీ నిర్మాణం కోసం ఎవరు అడ్డొచ్చినా విడిచిపెట్టొద్దని అక్కడి ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. భూసేకరణకు ఎవరైనా అడ్డొస్తే చంపేయాలని ఆర్డర్స్ పాస్ చేసింది. ప్రాజెక్ట్ నిర్మాణానికి ఆటంకం కలిగించేవాళ్లపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందేనని సౌదీ అరేబియా ప్రిన్స్ ఆదేశించారు. ఈ సీక్రెట్ సమాచారాన్ని ఆ దేశం నుంచి పారిపోయి లండన్‌లో ఉంటున్న సౌదీ మాజీ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ కల్నల్ రబీహ్ అలెన్జీ ఓ ఇంటర్నేషనల్ న్యూస్ చానల్‌కు ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో బయటపెట్టారు. అయితే, దీనిపై స్పందించేందుకు సౌదీ ప్రభుత్వం, నియోమ్ మేనేజ్‌మెంట్ నిరాకరించాయి.
ఆందోళనలను అణిచివేసిన్రు
ఫ్యూచర్ సిటీలో అతి ముఖ్యమైన ది లైన్ రీజియన్ కోసం మూడు గ్రామాలను ఖాళీ చేయించాలని ప్రిన్స్ ఆదేశించారు. హువైటీ తెగ ప్రజలు అక్కడ నివాసం ఉంటున్నారు. అందులో అబ్దుల్ రహీం అల్ హువైటీ తన భూమి ఇవ్వకపోవడంతో సౌదీ సైన్యం అతడిని కాల్చి చంపేసింది. దీంతో అక్కడి ప్రజలంతా ఆందోళన బాట పట్టారు. వందలాది మందిని అరెస్ట్ చేసి పోలీసులు ఆందోళనలను అణిచివేశారు. వీరిలో కొందరికి మరణ శిక్ష విధించారు. హువైటీ అంత్యక్రియల్లో పాల్గొన్నోళ్లనూ జైలుకు పంపారు. మొత్తం 6 వేలకుపైగా మందిని ఖాళీ చేయించారు. ఈ విషయాలన్నీ వెల్లడిస్తున్నందుకు తాను కూడా భయోందోళనలో ఉన్నట్లు కల్నల్ రహీబ్ తెలిపారు.
సౌదీ ఫ్యూచర్ సిటీ.. నియోమ్
సౌదీ అరేబియాలోని ఎర్ర సముద్రం తీరం వెంబడి 26,500 చ.కి.మీ. విస్తీర్ణంలో నియోమ్ సిటీని కట్టేందుకు ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్ ప్లాన్ చేశారు. సిటీ నిర్మాణం కోసం మొత్తం 500 బిలియన్ డాలర్ల నిధులను కేటాయించారు. నియోమ్ సిటీలో 10 రీజియన్లు నిర్మించనున్నారు. వీటిలో ది లైన్ ప్రాజెక్ట్ అత్యంత కీలకం. ఈ ఒక్క ప్రాజెక్ట్100 మీటర్ల ఎత్తు, 200 మీటర్ల వెడల్పు, 170 కిలోమీటర్ల పొడవు ఉండనుంది. ఇందులోనే దాదాపు 90 లక్షల మంది నివాసం ఉండేలా సకల సౌకర్యాలతో నిర్మాణం చేపడుతున్నారు. ఇందులో అత్యాధునిక వసతులు, త్రీడీ కమ్యూనికేషన్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో పనిచేసే రోబోటిక్ టెక్నాలజీ సర్వీసులు కూడా అందుబాటులో ఉంటాయి. 2026 నాటికి నియోమ్ సిటీలో 4.5 లక్షల మంది ఉంటారని, 2030 నాటికి 20 లక్షల జనాభాకు చేరుతుందని అంచనా వేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ అమెరికాలోని న్యూయార్క్ సిటీ కంటే 33 రెట్లు పెద్దదని ప్రచారం జరుగుతోంది.