న్యూ ఎన్​ఈపీతో విజ్ఞాన విప్లవం

విజ్ఞానమే శక్తి. వేదాలు, ఉపనిషత్తులు భారతదేశపు సుసంపన్న విజ్ఞాన వనరులుగా విరాజిల్లుతున్నాయి. నలంద, తక్షశిల వంటి ప్రాచీన భారతీయ విశ్వవిద్యాలయాలతో భారతదేశం గతంలో అంతర్జాతీయ విజ్ఞాన కేంద్రంగా వెలుగొందింది. కాలక్రమేణా, భారతదేశ విజ్ఞాన శక్తి , సంపద మొఘలులు, మంగోలులు, బ్రిటీష్, డచ్, పోర్చుగీసులతో సహా అనేక మందిని ఆకర్షించింది. అలా దేశానికి వచ్చిన విదేశీయులు భారతదేశ విజ్ఞాన సంపదను దారుణంగా నాశనం చేశారు. అయితే వారు మన భూములను కొల్లగొట్టి, మన విశ్వవిద్యాలయాలను నాశనం చేసినప్పటికీ, మన దేశ గురువులు, యోగుల చేతిలో ఓడిపోయారన్నది అందరికీ తెలిసిన, అందరూ అంగీకరించే వాస్తవం. రెండో పారిశ్రామిక విప్లవం సమయంలో బ్రిటన్ ప్రపంచానికి నాయకత్వం వహించింది. నేడు, భారతదేశం బ్రిటన్ ను అధిగమించి ప్రపంచంలోనే ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. ఈ ప్రగతి మరోసారి భారత్​ను విజ్ఞానానికి కేంద్రంగా మారడానికి, కొత్త, అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానంతో ప్రపంచాన్ని నాలుగో పారిశ్రామిక విప్లవం వైపు నడిపించడానికి దోహదం చేస్తుంది. 

34 ఏండ్ల విరామం తర్వాత..

2014 లో ప్రధానిగా నరేంద్ర మోదీ బాధ్యతలు చేపట్టిన తర్వాత భారతదేశ విద్యా వ్యవస్థను 21వ శతాబ్దపు ప్రపంచ విజ్ఞాన శక్తి కేంద్రంగా మార్చడానికి ఒక దార్శనికతను నిర్దేశించారు. ఫలితంగా బడికి వెళ్తున్న కోట్లాది మంది పిల్లలతో, ఉన్నత విద్యనభ్యసిస్తున్న లక్షలాది మంది విద్యార్థులతో నేడు.. భారతదేశ విద్యా వ్యవస్థ ప్రపంచవ్యాప్తంగా అతిపెద్దదిగా ఆవిర్భవించింది. ప్రజలతో సహా మేధావులు, విద్యావేత్తలతో విస్తృత చర్చల తర్వాత, 34 ఏండ్ల విరామం అనంతరం కేంద్ర ప్రభుత్వం ‘నూతన జాతీయ విద్యా విధానం(ఎన్ఈపీ) 2020’ ను రూపొందించింది. ఎన్ఈపీ 2020 అమల్లోకి వచ్చిన సందర్భంగా మనం జులై 29న మూడో వార్షికోత్సవం నిర్వహించుకుంటూ.. రెండు రోజుల అఖిల భారతీయ శిక్షా సమాగమంతో విద్యపై ‘మహా కుంభమేళా’ జరుపుకుంటున్నాం. 

22 భాషాల్లో..

గత మూడేండ్లలో ఎన్ఈపీ గణనీయమైన విజయాలను సాధించింది. దేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా, ఎర్లీ చైల్డ్ హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్(ఈసీసీఈ) అధికారిక పాఠశాల వ్యవస్థలో విలీనమైంది. 3 నుంచి-8 ఏండ్ల వయసు గల పిల్లలకు మొదటి నేషనల్ కరిక్యులమ్ ఫ్రేమ్​వర్క్ ఫర్ ఫౌండేషన్ స్టేజ్ అభివృద్ధిలో ఆటల ఆధారిత బోధనా విధానానికి ప్రాధాన్యత దక్కింది. ఈ ఫ్రేమ్ వర్క్ లో సంభాషణలు, కథలు, సంగీతం, కళలు, హస్తకళలు, ఆటలు, ప్రకృతి క్షేత్ర పర్యటనలు, మెటీరియల్స్, బొమ్మలతో ఇంటరాక్టివ్ ప్లే వంటి విభిన్న కార్యకలాపాలు ఉన్నాయి. 2026 నాటికి అక్షరాస్యత, సంఖ్యా శాస్త్ర నిర్దేశిత లక్ష్యాలను సాధించడానికి జాతీయ నిపున్ భారత్ మిషన్ కు అనుబంధంగా ఎన్​సీఎఫ్-ఎఫ్ఎస్ ఆధారంగా 1 , 2 తరగతులకు పాఠ్యపుస్తకాలు విడుదల చేశారు. రాబోయే నేషనల్ కరిక్యులమ్ ఫ్రేమ్ వర్క్ ఫర్ స్కూల్ ఎడ్యుకేషన్(ఎన్ సీఎఫ్-ఎస్ఈ)కి అనుగుణంగా సుమారు150 కొత్త పాఠ్యపుస్తకాలు అందుబాటులోకి రానున్నాయి. ఇవి అమృత్ కాలపు పుస్తకాలు. ఎన్ఈపీ 2020 కింద బహుభాషా విద్య దార్శనికతను ప్రోత్సహిస్తూ కనీసం 22 భారతీయ భాషల్లో వీటిని రూపొందించారు. పాఠ్యపుస్తకాల డిజిటల్ వెర్షన్లు కూడా అందుబాటులోకి తెస్తాం. ఎన్ఈపీ  నిజమైన స్ఫూర్తికి ప్రాతినిధ్యం వహించే పీఎం శ్రీ స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా కూడా దేశవ్యాప్తంగా విస్తరించనుంది. 

అభివృద్ధి చెందిన దేశంగా ఇండియా

విద్యను అంతర్జాతీయం చేసే క్రమంలో భారత సంస్థలు విదేశాల్లో క్యాంపస్ లను ఏర్పాటు చేస్తున్నాయి. ఐఐటీ మద్రాస్ జాంజిబార్- టాంజానియాలో ప్రణాళికాబద్ధమైన క్యాంపస్ తో ప్రపంచవ్యాప్తంగా వెళుతుండగా, యూఏఈలో ఐఐటీ ఢిల్లీని ఏర్పాటు చేయడానికి ఈ నెల ప్రారంభంలో ప్రధాని మోదీ సమక్షంలో అవగాహన ఒప్పందంపై సంతకాలు జరిగాయి. ప్రముఖ విదేశీ విశ్వవిద్యాలయాలు కూడా గుజరాత్ లోని గిఫ్ట్ సిటీలో తమ క్యాంపస్ లను ఏర్పాటు చేస్తున్నాయి.  సమీప భవిష్యత్తులో పాఠశాల బోర్డుతో సహా ఇతర భారతీయ సంస్థల ఉనికిని విదేశాల్లో మరింత విస్తరించడానికి ప్రతిష్టాత్మక ప్రణాళికలు ఉన్నాయి. వసుధైక కుటుంబం స్ఫూర్తితో భారతదేశం 21వ శతాబ్దపు వాస్తవిక లీడర్​గా ఎదిగే దిశగా పయనిస్తోంది. ఈ పరివర్తనను వర్తమాన వాస్తవికతకు అనుసంధానించడంలో ఎన్ఈపీ కీలక పాత్ర పోషిస్తోంది. ప్రపంచ పౌరులను తయారుచేసే దృక్పథంతో భారతదేశ విజ్ఞాన వ్యవస్థల మూలాల్లో వేళ్లూనుకుపోవడం ద్వారా, ఇది ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైనా విజ్ఞాన ఆధారిత సమాజాన్ని సృష్టించడానికి ముఖ్యంగా వలసవాదం నీడల నుంచి బయటపడాలని చూస్తున్న పేద, వర్ధమాన ఆర్థిక వ్యవస్థలకు మార్గదర్శకతత్వం కాగల సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఎన్ఈపీ నాలుగో సంవత్సరంలోకి అడుగుపెడుతున్నందున, దాని విజయం 2047 నాటికి  అభివృద్ధి చెందిన భారతదేశం, విజ్ఞాన భాగస్వామ్యం, శాంతిపై కేంద్రీకృతమైన ప్రపంచ క్రమాన్ని సూచిస్తుంది.

త్వరలో డిజిటల్ ​యూనివర్సిటీ

సాధారణ విద్యతో అనుసంధానించడంతో పాటు వృత్తి విద్యపై ఎన్ఈపీ ప్రత్యేక దృష్టి సారించింది. పాఠశాల స్థాయిలో నైపుణ్య కార్యక్రమాలను ప్రవేశపెట్టడానికి సమగ్ర శిక్ష, స్కిల్ ఇండియా మిషన్ మధ్య సమన్వయానికి కృషి చేస్తున్నాం. మధ్యలో చదువు మానేసిన వారికి సమగ్ర నైపుణ్య, వృత్తి శిక్షణ కార్యక్రమం అందించడానికి బడుల్లో 5000 స్కిల్ హబ్ లను ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. పాఠశాల, ఉన్నత, నైపుణ్య విద్య, శిక్షణకు సంబంధించిన అధికారిక, అనధికారిక అభ్యాసాన్ని గుర్తించే ఒక ప్రత్యేకమైన నేషనల్ క్రెడిట్ ఫ్రేమ్​వర్క్(ఎన్ సీఆర్ఎఫ్) కూడా ఏర్పాటైంది. ఎన్ సీ ఆర్ఎఫ్ వివిధ స్థాయిల్లో బహుళ ప్రవేశం, నిష్క్రమణను అనుమతిస్తుంది. విద్యార్థులు వారి జీవితంలో ఎప్పుడైనా ఉన్నత విద్యా వ్యవస్థలోకి తిరిగి ప్రవేశించడానికి వీలు కల్పిస్తుంది. సాంకేతిక పరిజ్ఞానం విద్యార్థులు ఆన్ లైన్ లో డిగ్రీ కోర్సులు చదివేందుకు వీలు కల్పిస్తోంది. ముఖ్యంగా మారుమూల ప్రాంతాల్లో నాణ్యమైన విద్య అందించేందుకు దోహదపడుతుంది. ఇకపై ‘స్వయం‘ పోర్టల్ లో ఆన్ లైన్ కోర్సుల ద్వారా కూడా క్రెడిట్స్ పొందవచ్చు. త్వరలోనే దేశంలో డిజిటల్ యూనివర్సిటీని ఏర్పాటు చేయనున్నాం. 

కొత్త తరం కోర్సులు

విద్యార్థులకు డిమాండ్ ఆధారిత నైపుణ్యం ఇచ్చి, ఎంఎస్ఎంఈలతో సహా యజమానులతో అనుసంధానం చేయడం, ఎంటర్​ప్రెన్యూర్షిప్ పథకాలను యువతకు చేరువ చేసేందుకు ఏకీకృత స్కిల్ ఇండియా డిజిటల్ ప్లాట్​ఫామ్ తో నైపుణ్యాల కోసం డిజిటల్ పర్యావరణ వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తున్నది. నైపుణ్యం కలిగిన అభ్యర్థులు అంతర్జాతీయంగా తిరిగేందుకు గ్లోబల్ మొబిలిటీని సులభతరం చేయడానికి కూడా మేము కృషి చేస్తున్నాం. యువతకు అంతర్జాతీయ స్థాయి నైపుణ్య శిక్షణ ఇవ్వడం, నైపుణ్యం కలిగిన శ్రామిక శక్తికి విదేశీ అవకాశాలను పెంచడమే లక్ష్యంగా 30 ఇండియా ఇంటర్నేషనల్ స్కిల్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నాం. పరిశ్రమ అవసరాలను తీర్చడానికి ప్రత్యేకంగా 330కి పైగా కొత్త తరం కోర్సులను అభివృద్ధి చేస్తున్నాం. అభ్యసనలో భాషా అడ్డంకులను అధిగమించడానికి, అనేక ఉన్నత విద్యా సంస్థలు ఇప్పుడు అనేక భారతీయ భాషల్లో సాంకేతికతను అందిస్తున్నాయి. కృత్రిమ మేధ అనువాద సాధనాలు వివిధ భారతీయ భాషల్లోకి పాఠ్యపుస్తకాలను అనువదించడానికి దోహదపడుతున్నాయి. జేఈఈ, నీట్, సీయూఈటీ వంటి ప్రధాన ప్రవేశ పరీక్షలు ఇప్పుడు13 భాషల్లో అందుబాటులో ఉన్నాయి.

- ధర్మేంద్ర ప్రధాన్,
కేంద్ర విద్య, నైపుణ్యాభివృద్ధి, ఎంటర్ ప్రెన్యూర్ షిప్ శాఖల మంత్రి