![ఫంక్షన్ లో పేలిన హైడ్రోజన్ బెలూన్స్.. మంత్రికి తీవ్ర గాయాలు](https://static.v6velugu.com/uploads/2025/02/nepal-deputy-pm-sustain-burn-injuries-in-balloon-explosion_zYqWTn7dlR.jpg)
ఖాట్మాండ్: పర్యాటక శాఖకు సంబంధించిన ఓ కార్యక్రమంలో నేపాల్ ఉప ప్రధాని, మేయర్ గాయాల పాలయ్యారు. హైడ్రోజన్ బెలూన్స్ ఒక్కసారిగా పేలడంతో ఇద్దరికి గాయాలు అయ్యాయి. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది ఉప ప్రధాని, మేయర్‌ను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అధికారుల వివరాల ప్రకారం.. శనివారం (ఫిబ్రవరి 15) పోఖారా పర్యాటక సంవత్సరం ప్రారంభోత్స కార్యక్రమంలో నేపాల్ ఉప ప్రధాని, ఆర్థిక మంత్రి బిష్ణు ప్రసాద్ పౌడెల్, పోఖారా మెట్రోపాలిటన్ మేయర్ ధన్‌రాజ్ ఆచార్య పాల్గొన్నారు. హైడ్రోజన్ బెలూన్స్‌ను గాల్లోకి వదిలి కార్యక్రమాన్ని ప్రారంభించబోతుండగా.. బెలూన్స్ ఒక్కసారిగా పేలాయి. దీంతో ఉప ప్రధాని బిష్ణు ప్రసాద్, మేయర్ ధన్‌రాజ్ ఆచార్యలకు గాయాలు అయ్యాయి.
వెంటనే అలర్ట్ అయిన అధికారులు ఇద్దరినీ విమానంలో ఖాట్మండుకు తరలించారు. మెరుగైన చికిత్స కోసం అక్కడి నుంచి కీర్తిపూర్‌లోని బర్న్ ఆసుపత్రికి తరలించినట్లు వెల్లడించారు. ప్రస్తుతం వారి ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని పేలుడికి గల కారణాలపై లోతుగా దర్యాప్తు చేస్తున్నారని తెలిపారు. ఈ ఘటనపై ఉప ప్రధాని ప్రెస్ అడ్వైజర్ భువన్ కెసి స్పందించారు. వదలడానికి సిద్ధంగా ఉంచిన బెలూన్లు పేలడంతో ఈ ప్రమాదం జరిగిందని చెప్పారు. పౌడెల్ చేతి, ముఖంపై గాయాలయ్యాయి. మేయర్ ఆచార్యకు కూడా తీవ్రంగా గాయపడ్డారని ఆయన తెలిపారు.