"కుషాల్ మల్లా".. ప్రస్తుతం ఈ పేరు ట్రెండింగ్ లో ఉంది. 20 ఏళ్ళు కూడా లేని ఒక కుర్రాడు దిగ్గజాల రికార్డులు బద్దలు కొడుతూ అంతర్జాతీయ టీ 20 క్రికెట్ చరిత్రలో ఆల్ టైం రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. నిన్నటివరకు టీ 20 ల్లో చెక్కుచెదరని యువరాజ్ సింగ్ ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ, రోహిత్ శర్మ ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డులు ఈ నేపాలీ కుర్రాడి బ్యాటింగ్ ప్రవాహంలో కొట్టుకుపోయాయి.
ఆసియా క్రీడల్లో భాగంగా నేపాల్ - మంగోలియా జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో ఆకాశమే హద్దుగా చెలరేగిన కుశాల్.. 9 బంతుల్లో హాఫ్ సెంచరీ, 34 బంతుల్లోనే శతకం బాదేసి టీ20 ల్లో ప్రపంచ రికార్డులు సృష్టించాడు. ఒక్క ఇన్నింగ్స్ తో ప్రపంచ క్రికెట్ ని తనవైపుకు తిప్పుకున్న కుషాల్ మల్లా ఎవరో ఇప్పుడు చూద్దాం.
ALSO READ : హైకోర్టుకు హాజరైన మంత్రి శ్రీనివాస్గౌడ్..
కుషాల్ 15 ఏళ్ళ వయసులోనే 2019–20 సింగపూర్ ట్రై-నేషన్ సిరీస్, 2019–20 ఒమన్ సిరీస్ కోసం నేపాల్ జట్టులో ఎంపికయ్యాడు. 27 సెప్టెంబర్ 2019న సింగపూర్ ట్రై-నేషన్ సిరీస్‌లోభాగంగా జింబాబ్వేపై టీ 20ల్లో అరంగేట్రం చేసాడు. ఇక 2020 లో అమెరికాపై తొలి వన్డే ఆడిన కుషాల్.. తొలి మ్యాచులోనే 51 బంతుల్లో 50 పరుగులు చేసి 15 సంవత్సరాల వయసులోనే అంతర్జాతీయ క్రికెట్ లో ఈ ఘనత సాధించిన తొలి ప్లేయర్ గా నిలిచాడు. ఇక ఏప్రిల్ 2023లో, ఒమన్‌తో జరిగిన మ్యాచ్‌లో మల్లా వన్డేల్లో తన మొదటి సెంచరీని సాధించాడు. తాజాగా ఆసియా గేమ్స్ లో పలు రికార్డులను బద్దలు కొట్టి సత్తా చాటాడు. ఇలా 20 ఏళ్ళు నిండకుండానే కుశాల్ మల్లా సాధించిన ఘనతలకు ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తుంది.