ముక్కోణపు సిరీస్.. భారత్‌లో పర్యటించనున్న నేపాల్ క్రికెట్ జట్టు

ముక్కోణపు సిరీస్.. భారత్‌లో పర్యటించనున్న నేపాల్ క్రికెట్ జట్టు

నేపాల్ లో క్రికెట్ కు ఎంత క్రేజ్ ఉందో చాలా తక్కువ మందికే తెలుసు. అసోసియేట్ దేశమైనా, స్టార్ ప్లేయర్లు లేకున్నా.. ఆ దేశంలో క్రికెట్ ను ఆరాధిస్తారు. నేపాల్ ఏ దేశం మీదైనా మ్యాచ్ ఆడితే ఆ దేశ అభిమానులు భారీగా తరలివస్తారు. సరైన స్టేడియం లేకున్నా నిలబడి మ్యాచ్ చూస్తూ క్రికెట్ పై తమ అభిమానాన్ని చాటుకుంటారు. కొన్ని సందర్భాల్లో క్రికెట్ లవర్స్ చెట్లు ఎక్కి మ్యాచ్ లు చూసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇదిలా ఉండగా నేపాల్ కు భారత విదేశాంగ మంత్రి బంపర్ ఆఫర్ ఇచ్చాడు.   

భారత క్రికెట్ మైదానాన్ని నేపాల్ క్రికెట్ జట్టు తమ 'హోమ్ గ్రౌండ్'గా ఉపయోగించుకోవచ్చని భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ఆ దేశ క్రికెట్ కు 2024 జనవరి 9న శుభవార్త చెప్పాడు. ఇందులో భాగంగా T20 ప్రపంచ కప్ 2024 కోసం ట్రై-సిరీస్ కోసం భారతదేశంలో పర్యటించడానికి సిద్ధంగా ఉంది. నేపాల్ జట్టు గుజరాత్, బరోడాలతో కలిసి ముక్కోణపు సిరీస్ ఆడుతుంది. మొత్తం ఈ సిరీస్ లో ఒక్కో జట్టు మిగిలిన జట్టుతో రెండు మ్యాచ్ లు ఆడుతుంది. మొదటి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు ఫైనల్ కు అర్హత సాధిస్తాయి. 

మొత్తం 7 మ్యాచ్ లు జరుగుతాయి. ఈ సిరీస్ మార్చి 31 నుంచి ఏప్రిల్ 7 వరకు జరుగుతుంది. ఈ సిరీస్ కు ఫ్రెండ్‌షిప్ కప్ అని పేరు పెట్టారు. మ్యాచ్ లన్నీ మధ్యాహ్నం 1 గంట నుంచి ప్రారంభమవుతాయి. టీ20 వరల్డ్ కప్ కు నేపాల్ అర్హత సాధించిన సంగతి తెలిసిందే. ఆసియా క్వాలిఫయర్స్ పోరులో యూఏఈను 8 వికెట్ల తేడాతో చిత్తు చేసిన నేపాల్‌.. తొలిసారి టీ20 ప్రపంచ కప్‌కు అర్హత సాధించింది.  బంగ్లాదేశ్, దక్షిణాఫ్రికా, శ్రీలంక, నెదర్లాండ్స్‌తో నేపాల్ గ్రూప్ డిలో ఉంది. జూన్ 1 నుంచి 29 వరకు టీ20 వరల్డ్ కప్ జరుగుతుంది.