
- యజమానులకు మత్తు మందు ఇచ్చి.. ఆ తర్వాత చోరీ
- రూ.70 లక్షల క్యాష్, కేజీ బంగారంతో యజమాని కారులో పరార్
బషీర్‌బాగ్, వెలుగు: పనిచేస్తున్న ఇంటికే కన్నం వేసి, అందినకాడికి క్యాష్, బంగారంతో నేపాలీ పని మనుషులు పరారయ్యారు. కాచిగూడ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..వ్యాపారవేత్త హేమారాజు దంపతులు కుమారుడు, కోడలుతో కలిసి లింగంపల్లి అమ్మవారి ఆలయం సమీపంలోని ఆశీర్వాద్ నిలయంలో ఉంటున్నారు. వారం కింద నేపాలీ దంపతులు వీరివద్ద పనిలో చేరారు. వేసవి సెలవుల సందర్భంగా కొడుకు, కోడలు ఇటీవల ఫారిన్ ట్రిప్ కు వెళ్లారు.
ఇదే అదునుగా పని మనుషులు ఆదివారం రాత్రి హేమారాజు దంపతులకు మత్తు మందు కలిపిన కూల్ డ్రింక్ ఇచ్చారు. వారు స్పృహ కోల్పోగానే ఇంట్లోని లాకర్‌ను పగలగొట్టి అందులోని రూ.70 లక్షల నగదు, కేజీ బంగారం తీసుకుని యజమాని కారులో పరారయ్యారు. సోమవారం తెల్లవారుజామున మత్తు నుంచి తేరుకున్న హేమారాజు బయటకు వచ్చి కేకలు వేయడంతో స్థానికులు అక్కడికి చేరుకొని, వారిని హైదర్ గూడలోని అపోలో హాస్పిటల్‌కు తరలించారు.
క్లూస్ టీమ్‌తో పోలీసులు వివరాలు సేకరించారు. నాలుగు బృందాలతో గాలింపు చేపట్టారు. పని మనుషులతోపాటు మరో ఇద్దరు వ్యక్తులు చోరీలో పాల్గొన్నట్లు పోలీసులు గుర్తించారు. నేపాలీలు కారును ఐఎస్ సదన్ వద్ద వదిలి ఆటోలో వెళ్లినట్లు సీసీ ఫుటేజీల ద్వారా తెలిసింది. దంపతులు కోలుకున్న తర్వాత మరిన్ని వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉందని పోలీసులు చెబుతున్నారు.