
నేరేడుచర్ల, వెలుగు : పన్ను చెల్లించాలని మున్సిపాలిటీ సిబ్బంది ఇంటి ముందు కూర్చొని ధర్నాకు దిగారు. సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మున్సిపల్ కమిషనర్ యడవల్లి అశోక్ రెడ్డి తెలిపిన ప్రకారం.. స్థానిక మూడో వార్డులో నివసించే బానోత్ భీమా 2015–16 సంవత్సరం నుంచి ఇంటి పన్ను చెల్లించకుండా బకాయిపడ్డార న్నారు.
మున్సిపల్ సిబ్బంది పన్ను వసూలు కోసం వెళ్తుండగా వాయిదా వేస్తూ చెల్లించడం లేదన్నారు. రోడ్డు, డ్రైనేజీ సౌకర్యాలు లేవని సాకుతో పన్ను చెల్లించకుండా నిర్లక్ష్యం చేస్తున్నారన్నారు. రూ.27,542 ఇంటి పన్ను బకాయి ఉండగా ప్రభుత్వం 90 శాతం వడ్డీ రాయితీని ఇస్తున్నా కట్టడడం లేదన్నారు. దీంతో రెడ్ నోటీస్ జారీ చేసి నీటి సరఫరా బంద్ చేసి, డ్రైనేజీ మూసి వేసి సిబ్బందితో ధర్నా చేసినట్లు చెప్పారు. మున్సిపల్ మేనేజర్ యాకూబ్ అలి, వార్డు అధికారులు, ఆర్ పీలు ధర్నాలో పాల్గొన్నారు.