
ఈ రాళ్లను చూసి.. ఇవి ఎప్పుడో వందల ఏళ్ల క్రితం కట్టిన ఇళ్లనుకుంటున్నారా? అయితే మీరు ఎండాకాలంలో మండేరాయిపై కాలేసినట్టే. ఎందుకంటే ఇవన్నీ ఈ మధ్య కట్టిన ఇళ్లే. కాకపోతే ఇక్కడ నాపరాళ్లు ఎక్కువగా దొరుకుతాయి. దాంతో ఇక్కడివాళ్లు వాటితోనే ఇళ్లు కట్టుకుంటున్నారు. ఈ ఇళ్లకు ఇటుక అవసరం లేకపోవడంతో ఖర్చు కూడా చాలా తక్కువ అవుతుంది. అంతేకాదు.. ఈ ఇళ్లలో ఎండాకాలంలో చల్లగా, చలికాలంలో వెచ్చగా ఉంటుంది. ఇంతకీ ఈ ప్రాంతం ఎక్కుడుంది అనేదేగా.. మీరడిగేది. అయితే ఇది చదవండి.
సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల, పాలకవీడు మండలాల్లో ఎక్కడ తవ్విన నాపరాళ్లే కనిపిస్తాయి. ఆప్రాంతంలో రెండడుగుల లోతులోనే నాపరాతి వరుసలు ఉన్నాయి. అందుకే ఆ ఊళ్లలోఏ ఇంటిముందు చూసినా, ఏ పంట పొలం దగ్గర చూసినా ఈ రాళ్లే కనపడతాయి. డబ్బు ఖర్చు చేయకుండానే దొరుకుతుండడంతో ఆ గ్రామాల్లో అన్ని కట్టడాలకు ఈ రాళ్లనే వాడుతుంటారు.
ఇంటి నిర్మాణంలో ఎక్కువ ఖర్చయ్యేది ఇటుకలు, సిమెంటుకే మరి ఇటుకలు లేకుండా ఉచితంగా దొరికే రాళ్లతో ఇల్లు కట్టడం వల్ల ఖర్చు కూడా చాలా తక్కువ అవుతుంది. కృష్ణానది పక్కనే ఉన్న స్పెషల్ మేస్ట్రీలు శూన్యపహాడ్, జాన్పహాడ్, మహంకాళిగూడెం, రావిపాడు. గుండ్లపహాడ్, గుండెబోయిన గూడెం, పాడుతండా, చెరువుతండా, దేవులతండా రాఘవపురం గ్రామాల్లో ఈ రాళ్లు ఎక్కువగా దొరుకుతాయి.
నాపరాళ్లతో కట్టిన ఇళ్లు చాలా కాలం పాటు చెక్కు చెదరకుండా ఉంటాయి. అంటారు ఇక్కడివాళ్లు. ఏళ్లు గడిచినా మరమ్మతులు చేయించాల్సిన అవసరం లేదంటున్నారు. ఇక్కడ మరో ప్రత్యేకత ఏంటంటే.. ఈ ఇళ్లలో వేసవిలో చల్లగా, చలికాలంలో వెచ్చగా ఉంటుంది. ఇట్లే కాదు ప్రహరీలు, స్నానపు గదులు, నీటి తొట్టెలు, ఇంటి ముందు, చెట్ల చుట్టూ కూర్చునేందుకు అరుగులు.. ఇలా అన్నీ ఆ రాళ్లతోనే కట్టిస్తారు ఇక్కడ.
నాపరాతితో ఇళ్లు కట్టడం అంటే అంత ఆషామాషీ కాదు. ఈ రాళ్లను ఒక పక్కనుంచి పేర్చుకుంటూ పోతే.. మరోపక్క నుంచి కిందపడుతూ ఉంటాయి. వీటితో ఇల్లు కట్టేందుకు ప్రత్యేకంగా కొంతమంది. మేస్త్రీలు ఉంటారు. వాళ్లు మాత్రమే ఈ రాళ్లను ఒద్దికగా, అందంగా పేర్చి ఇల్లు కట్టగలుగుతారు. సాధారణ మేస్త్రీలకు అది సాధ్యం కాదు. ఈ మేస్త్రీలకు ఎలాంటి రాయిపై ఎలాంటి రాయి పెడితే సరి పోతుందో సరిగ్గా తెలుసు. వాటి ఆకారాలను, సైజులను బట్టి పేరుస్తారు. గతంలో ఇసుక, సున్నం వాడకుండా, కేవలం రాళ్లతోనే ఇళ్లు కట్టేవాళ్లు. కానీ ఇప్పుడు సిమెంట్, ఇసుక కూడా వాడుతున్నారు.