- పోలీస్దెబ్బలతో అనారోగ్యం పాలైన బాధితులు
- ఆదుకుంటానన్న మంత్రి కేటీఆర్ హామీ నెరవేరలే
రాజన్నసిరిసిల్ల, వెలుగు: ఏడేండ్ల కింద రాష్ట్రంలో సంచలనం రేపిన రాజన్న సిరిసిల్ల జిల్లా నేరేళ్ల ఘటన బాధితులకు ఇంకా న్యాయం జరగలేదు. పోలీసులు కొట్టిన దెబ్బలు ఇంకా బాధితులను వెంటాడుతున్నాయి. ఏడెళ్ళ కిందట జులై 2న తంగళ్లపల్లి మండలం జిల్లెల్ల వద్ద ఇసుక లారీ ఢీకొని నేరెళ్లకు చెందిన దళితుడు భూమయ్య చనిపోయాడు. ఈ ఘటనలో పోలీసుల చేతుల్లో దళితులు బాధితులుగా మారారు. పోలీసుల దెబ్బలకు అనారోగ్య పాలై నేటికీ ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్నారు. మంత్రి కేటీఆర్ జిల్లాకు వచ్చిన ప్రతిసారీ కలుద్దామంటే పోలీసులు అడ్డుకుంటున్నారని బాధితులు వాపోతున్నారు. చావుదెబ్బలు కొట్టి తమ బతుకులను నాశనం చేశారని ఆవేదన చెందుతున్నారు.
ఒక్కొక్కరిదీ ఒక్కో గాధ..
చీర్లవంచ, కోదురుపాక ప్రాంతాల నుంచి వందలాది ఇసుక లారీలు టిప్పర్లు నడిచేవి. ఇసుకను తరలించే క్రమంలో జరిగిన 42 ప్రమాదాల్లో నలుగురు చనిపోయారు. జులై 2 , 2017 లో నేరెళ్ల కు చెందిన ఎరుకల భూమయ్యను ఇసుక లారీ ఢీ కొట్టింది. అతను అక్కడే చనిపోయాడు. స్థానికులు ఆగ్రహానికి గురై ఐదు ఇసుక లారీలను తగలబెట్టారు. దీంతో పోలీసులకు, స్థానికుల మధ్య ఉద్రిక్తత నెలకొంది. దీంతో 13 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. జులై 4, 2017 రాత్రి 11:30 గంటలకు నేరెళ్ల కు చెందిన పెంట బానయ్య, కోలా హరీశ్, చెప్పాలా బాలరాజు, పసుల ఈశ్వర్ కుమార్, గంధం గోపాల్, రామచంద్రాపూర్ కు చెందిన భక్తుల మహేశ్, జిల్లెళ్ళ కు చెందిన కోరుకొండ గణేశ్, చీకోటి శ్రీనివాస్ ను అనుమానితులుగా పోలీసులు అదుపులోకి తీసుకొని, 7న అరెస్ట్ చేసినట్టు ప్రకటించారు.
నిరాకరించిన జైలర్..
పోలీసులు అరెస్ట్ చేసిన వారిని జులై 8న రిమాండ్కు తరలించారు. అప్పటి కరీంనగర్ జైలర్ శివకుమార్ నిందితులపై గాయాలు చూసి రిమాండ్ కు నిరాకరించారు. నడవలేని స్థితిలో ఉన్న వారిని జైల్లోకి తీసుకోలేదు. పోలీసులు పెయిన్ కిల్లర్స్ మందులు ఇచ్చి వారంతా ఆరోగ్యంగానే ఉన్నారని డాక్టర్ ధ్రువీకరణతో జులై 8న నిందితులను జైలుకు తరలించారు. జైల్లోకి వెళ్లాక అందులోని నలుగురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో జైల్లో ఓ డాక్టర్ వారిని పరీక్షించి, కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. జైలులో ములాఖత్ లో కలిసిన కుటుంబ సభ్యులకు దెబ్బలను చూపించారు. పోలీసులు వారిని తీవ్రంగా కొట్టిన విషయం బయటకు రావడంతో రాష్ట్రమంతా నిరసనలు వ్యక్తమయ్యాయి.
40రోజుల కండిషన్ బెయిల్...
జైలుకెళ్లిన ఎనిమిది మంది బాధితులను 40 రోజుల కండిషన్ బెయిలుపై కోర్టు విడుదల చేసింది. ఎనిమిది మంది 40 రోజులు వేములవాడలో ఉంటూ ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందారు. దాదాపు 40 రోజుల తర్వాత మంత్రి కేటీఆర్ నేరెళ్ల బాధితులను పరామర్శించారు. బాధితులకు ఆదుకుంటానని మంత్రి హామీ ఇచ్చారు. కానీ, ఇప్పటికి ఎలాంటి న్యాయం చేయలేదని బాధితులు వాపోతున్నారు. ఈ ఘటనను సుమోటోగా తీసుకొని, జాతీయ ఎస్సీ కమిషన్ విచారణ జరిపింది. హ్యుమన్ రైట్స్ కమిషన్ నేరెళ్ళ గ్రామాన్ని సందర్శించి బాధితులతో మాట్లాడింది. జాతీయ ఎస్సీ కమిషన్ విచారణ చేసినప్పటికీ ఇప్పటి వరకు న్యాయం జరుగలేదని బాధితులు వాపోతున్నారు.
మా గోస వట్టిగానే పోదు..
నేరెళ్ళ ఘటనకు సంబంధించిన కేసును డీఐజీ స్థాయి అధికారితో దర్యాప్తు చేయిస్తానని హామీ ఇచ్చిండ్రు. గవర్నమెంట్ జాబ్ చేస్తా అనుకున్న నన్ను ఎటు కాకుండా చేశిర్రు. న్యాయం చేయాలని అడిగితే అక్రమ అరెస్టులు, గృహనిర్బంధం చేస్తున్నారు. మమ్ముల్ని కొట్టిన ఎస్పీ విశ్వజిత్ పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలి. మా గోస వట్టిగానే పోదు. పోలీసుల దెబ్బలతో ఏం పని చేయలేక పోతున్నాం. మేము చావడం తప్ప మరో గత్యంతరం కనబడుత లేదు. మాకు న్యాయం చేసి అండగా ఉంటదనుకున్న ఎస్సీ కమీషన్ కూడా రిపోర్టును ఇంత వరకు ప్రకటించలేదు.
- కోల హరీశ్, నేరెళ్ల బాధితుడు
దవాఖానకు పోదామంటే పైసల్ లేవు.....
పోలీసులు మమ్మల్ని కొట్టారు. అప్పటి దెబ్బలు ఇప్పటికీ పోతలేవు. కూలీ పనికి పోయి కుటుంబాన్ని పోషించుటమంటే పనిచేసే స్థితిలో లేను. దవాఖానకు కోసం పైసలు కూడా లేవు. అండగా ఉంటామన్న మంత్రి కేటీఆర్ మమ్మల్ని పట్టించుకుంటలేడు. ఇప్పటికైనా మాకు న్యాయం చేయాలి. కారణంగా మమ్మల్ని కొట్టిన పోలీసులపై చట్టరీత్య కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలి.
- పెంట బాణయ్య, నేరెళ్ళ బాధితుడు