ఓరుగల్లు అందించిన గొప్ప కళాకారుడు పద్మశ్రీ కళాప్రపూర్ణ నేరెళ్ళ వేణుమాధవ్ ధ్వని అనుకరణ కళను ప్రపంచ పటం మీద ఎగరవేసిన గొప్ప ఘనత ఆయనది. వేల స్వరాలను అలవోకగా పలికించే విశిష్టకంఠం మిమిక్రీకి పాఠ్యాంశమై వెలుగొందిన స్వర విజ్ఞాన శిఖరం, అరవై నాలుగు కళల్లో ఒకటైన స్వరవచనను శాసించి చివరి క్షణం వరకు శ్వాసించిన అపూర్వ కళాదిగ్గజ మిమిక్రీ సామ్రాట్ డాక్టర్ నేరెళ్ళ వేణుమాధవ్. మిమిక్రీ కళకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు గౌరవం తెచ్చిపెట్టిన నేరెళ్ళ వేణుమాధవ్ చిన్నతనంలో ప్రతిభను గుర్తించిన ఆయన గురువు బారు వెంకట రామనర్సు ఎంతగానో ప్రోత్సహించారు. ఆసక్తికరమైన అబ్బురపరిచే అంశాలతో మిమిక్రీ కార్యక్రమాన్ని తీర్చిదిద్దుకోవడమే కాకుండా తన హాస్య వ్యంగ్య వైభవంతో కూడిన వ్యాఖ్యానంతో దానిని పండించేవారు. ఆబాలగోపాలం ఆయన మిమిక్రీ చూసి ఆనందించేవారు.
మహానటులకు, దేశాధినేతలకు, ఆయన అభిమానులకు మిమిక్రీ అంటే పిల్లి కూతలు నక్క ఊళలు కాదు ఒక ఉన్నతమైన కళాప్రదర్శన అని నిరూపించారు. మెకనాస్ గోల్డ్ ఐటమ్ తో అలరించేవారు. మిమిక్రీ ప్రదర్శన అంటే ఎలా ఉండాలో చూపించి ఆ కళ ద్వారా తాను ఎదగడమే కాకుండా ఆ కళను పాఠ్యాంశంగా తీర్చి దిద్ది తరతరాలకు తరగని సేవ చేశారు. ఆయన ప్రదర్శనలకు వెళితే ఎంతటి పనిభారంతో ఉన్నా, ఒత్తిడులతో ఉన్నా హాయిగా నవ్వుకునేవారు. కేవలం ప్రదర్శన సమయంలోనే కాదు. మామూలు సమయాల్లో కూడా ఆయన తనదైన శైలితో తన పరిసరాల్లో ఉన్న వారిని తన మిమిక్రీతో ఆహ్లాదపరిచేవారు.
పద్మశ్రీ సహా ఎన్నో అవార్డులు
దేశ, విదేశాల్లో ఆయన ప్రదర్శనలకు లెక్కేలేదు. 1964లో ఆస్ట్రేలియా పర్యటనలో మొదలైన ఆయన విదేశీ ప్రదర్శనలు నిరంతరంగా సాగాయి. ఏకంగా ఐక్యరాజ్య సమితి వేదికగా ప్రదర్శన ఇవ్వడం ఆయనతోపాటుగా మిమిక్రీ కళకు దక్కిన అరుదైన గౌరవంగా భావించవచ్చు. నేరెళ్ళ వేణుమాధవ్ కళారంగ సేవకు ప్రపంచమే అబ్బురపడింది. భారత ప్రభుత్వం ఆయనకు పద్మశ్రీ అవార్డు ఇచ్చి సత్కరించింది. కాకతీయ ఆంధ్రా, జెఎన్టీయూసీ యూనివర్సిటీలు ఆయనను గౌరవ డాక్టరేట్ తో సత్కరించాయి. కనకాభిషేకాలు, గండపెండేరాలు, ఉగాది పురస్కారాలు కళాప్రపూర్ణ బిరుదులు ఒకటా.. రెండా లెక్కలేనన్నీ అవార్డులు ఆయనను వెతుక్కుంటూ వచ్చాయి.
అనేక పదవుల్లో..
గౌరవప్రదమైన ఎన్నో పదవులు బాధ్యతలు నిర్వహించారు. 1972 నుండి 1978 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సభ్యుడిగా, ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పోరేషన్ డైరెక్టర్ గా, సంగీత నాటక అకాడమీ సభ్యుడిగా, కాకతీయ విశ్వవిద్యాలయం సెనెట్ సభ్యుడిగా హైదరాబాద్ దూరదర్శన్ కేంద్రం సలహామండలి, రవీంద్రభారతి పాలకమండలి, ఆంధ్రప్రదేశ్ శాసనసభ లైబ్రరీ కమిటీలకు సభ్యులుగా పని చేశారు. తెలంగాణా ప్రభుత్వం 2018 రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నగదు పురస్కారంతో సన్మానించింది. గత మూడు సంవత్సరాల నుంచి ఆయన పుట్టినరోజును డిసెంబర్ 28ని మిమిక్రి దినోత్సవంగా జరుపుతుండటం విశేషం.
మిమిక్రీ కోర్సు కోసం తపన
మిమిక్రీ కళను అంతరించిపోకుండా వేలాదిమంది కళాకారులను తీర్చిదిద్ది చిన్న చిన్న కళాకారులను వేణుమాధవ్ ప్రోత్సహించారు. ప్రపంచ వ్యాప్తంగా మిమిక్రీ కళకు డిప్లమా కోర్సు ఉండాలని, కాకతీయ యూనివర్సిటీలో మిమిక్రీ డిప్లొమా కోర్సు ప్రారంభించాలని ఆయన తపించేవారు. వేణుమాధవ్ శిష్య ప్రశష్యగణం ఎందరో మిమిక్రీ కళలో అద్భుతమైన ప్రతిభ కనబరుస్తున్నారు. మిమిక్రీ కళలో అన్నీ తానై ఆ ప్రక్రియను శిఖరాగ్రాన నిలిపిన వేణుమాధవ్ మహానీయుడు. వేల గొంతులను తన గొంతులో పలికిన అరుదైన కళాకారుడు. తెలంగాణ వారి ప్రతిభను, ఖ్యాతినీ అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టిన నేరెళ్ళ వేణుమాధవ్ ప్రపంచ కళాభిమానులందరి హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు.