కేటీఆర్ సిరిసిల్లలో మరో నయీమ్​లా మారాడు : నేరేళ్ల బాధితుడు

రాజన్నసిరిసిల్ల, వెలుగు: కేటీఆర్ సిరిసిల్లలో మరో నయీమ్​లా మారాడని నేరేళ్ల బాధితుడు కోల హరీశ్​ ఆరోపించాడు.  గురువారం ఆయన సిరిసిల్ల అంబేద్కర్ విగ్రహం ఎదుట జిల్లా మాజీ ఎస్పీ విశ్వజిత్ కంపాటి, మంత్రి కేటీఆర్, సీసీఎస్ ఎస్ఐ రవి ఫొటోలతో ఉన్న ప్లకార్డు పట్టుకుని రోడ్డుపై పడుకుని నిరసన తెలిపాడు. హరీశ్​ మాట్లాడుతూ నేరేళ్ల ఘటన జరిగిన ఎనిమిదేండ్లు కావస్తున్నా తమకు ఎందుకు న్యాయం చేయడం లేదని ప్రశ్నించాడు. 

ఈ ఘటనతో కేటీఆర్​కు సంబంధం ఉంది కాబట్టే తమను పట్టించుకోవడం లేదన్నాడు. నేరేళ్ల ఘటనలో తమపై థర్డ్ డిగ్రీ ప్రయోగించి జీవితాలను నాశనం చేశారన్నాడు. పోలీస్ ఉద్యోగాల కోసం ప్రిపేరయ్యే టైంలో థర్డ్ డిగ్రీ ప్రయోగంచడంతో ఎందుకూ పనికిరాకుండా పోయామన్నాడు. థర్డ్ డిగ్రీ ప్రయోగించిన వారికి ప్రమోషన్లు ఇచ్చారని, తాము మాత్రం కష్టాలు పడుతున్నామన్నాడు. నేరేళ్ల బాధితులకు న్యాయం చేయని కేటీఆర్​కు ఓట్లడిగే హక్కు లేదన్నాడు. పోలీసుల దెబ్బలతో ఒక్కరు కూడా పని చేసుకునే స్థితిలో లేరన్నాడు. హరీశ్​ నిరసన గురించి తెలుసుకున్న పోలీసులు అదుపులోకి తీసుకుని పీఎస్​కు తరలించారు.