- 2020 జూన్ తరువాత ఇదే అత్యల్పం
- పడిపోతున్న అమ్మకాలు, ఆదాయాలు, లాభం
న్యూఢిల్లీ : మనదేశ కార్పొరేట్ రంగం వృద్ధి సెప్టెంబర్ క్వార్టర్లో నెమ్మదించింది. కంపెనీల నికరలాభ వృద్ధి 3.6 శాతమే ఉంది. గత 17 క్వార్టర్లలో ఇదే నిదానమైన వృద్ధి. నెమ్మదించిన ఆదాయ వృద్ధి, పెరుగుతున్న వడ్డీలు, తరుగుదల వ్యయాలు, మొత్తం ఖర్చులు పెరగడంతో లాభాలు తగ్గుతున్నాయి. అమ్మకాలూ పడిపోయాయి. ఈసీఈ ఈక్విటీస్ ప్రకారం, 694 లిస్టెడ్ కంపెనీల నికరలాభం సెప్టెంబర్ క్వార్టర్లో మొత్తం వార్షికంగా కేవలం 3.6 శాతం పెరిగింది.
- జూన్ 2020 క్వార్టర్ తరువాత ఇది ఇంతలా తగ్గడం మొదటిసారి. ఇది జూన్ క్వార్టర్లో 15 శాతం, ఏడాది క్రితం 29 శాతం వృద్ధి కంటే చాలా తక్కువ. సెప్టెంబర్ క్వార్టర్లో నికర అమ్మకాల వృద్ధి 8.04 శాతంగా ఉంది. ఇది మునుపటి క్వార్టర్లో 8.4 శాతం నుంచి తగ్గింది-. వరుసగా ఆరో క్వార్టర్లోనూ సింగిల్ డిజిట్ ఆదాయ వృద్ధే నమోదయింది. నిర్వహణ లాభాల మార్జిన్లు సెప్టెంబర్ క్వార్టర్లో 22.03 శాతంగా ఉన్నాయి. ఇవి జూన్ క్వార్టర్లో 23.05 శాతంతో పోలిస్తే తక్కువ. ఆరు క్వార్టర్లలో ఇదే అతి తక్కువ వృద్ధి.
కొన్ని రంగాల కంపెనీలు ఓకే
బ్యాంకులు, ఆర్థిక సేవలు, చమురు గ్యాస్ కంపెనీల మార్జిన్లు మాత్రం బాగానే ఉన్నాయి. వినియోగ వస్తువుల సంస్థలకు ఊహించిన దానికంటే కొంచెం బలహీనమైన ఫలితాలు ఉంటాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. సానుకూల గ్రామీణ వృద్ధి ద్వారా తగ్గిన పట్టణ డిమాండ్‌ను కొన్ని కంపెనీలు భర్తీ చేసుకుంటున్నాయి. కంపెనీలు పుంజుకోవడానికి పండుగ సీజన్ కీలకం. పెరుగుతున్న వస్తువుల ఖర్చుల వల్ల కంపెనీలు ధరలను పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ–-కామర్స్, క్విక్ కామర్స్ప్లాట్ఫారాలు కిరాణాలు, సూపర్మార్కెట్ల వాణిజ్య వృద్ధికి ఇబ్బందికరంగా మారాయి.
ఉదాహరణకు హెచ్‌యూఎల్ రెండో క్వార్టర్ నికర లాభం 2.4 శాతం పడిపోయింది. పట్టణాల్లో ఎఫ్ఎంసీజీ ప్రొడక్టుల అమ్మకాలు పడిపోయాయి. దీని ఆదాయం రెండు శాతమే పెరిగింది. వాల్యూమ్ వృద్ధి 3 శాతం ఉంది. డీమార్ట్ పేరెంట్ కంపెనీ అవెన్యూ సూపర్‌మార్ట్స్‌కు, బ్లింకిట్, స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ వంటి క్విక్‌కామర్స్ కంపెనీల నుంచి పోటీ తీవ్రంగా ఉంది. స్టోర్ అమ్మకాల వృద్ధి విపరీతంగా తగ్గుతోంది. మారుతీ సుజుకి క్యూ2లో నికర లాభం 17 శాతం తగ్గింది. ఐటీ సంస్థలు మాత్రం మంచి ఫలితాలను ప్రకటించాయి.
మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ నివేదిక... విచక్షణతో కూడిన వ్యయం క్రమంగా పెరుగుతుందని అంచనా వేసింది. ఆరోగ్య సంరక్షణ, తయారీ రంగాల్లో వృద్ధి బాగుంటుందని పేర్కొంది. కమ్యూనికేషన్లు, హై-టెక్ కంపెనీల లాభాలూ నిరాశపర్చాయి. సిమెంట్ సంస్థల లాభాలు ధరల ఒత్తిడి కారణంగా తగ్గాయి. కన్స్యూమర్ డ్యూరబుల్స్ ఆపరేటింగ్ ప్రాఫిట్ అంచనాలను కోల్పోయింది. రసాయన సంస్థలు ధరల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి.